
జూ.ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: 'నాన్నకు ప్రేమతో' భారీ విజయంతో జోష్ మీదున్న జూ. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 2009లో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకొంటూ ఆయన చేసిన కమెంట్స్తో అందరూ షాకయ్యారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని.. మృత్యువు తనదాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానని వ్యాఖ్యానించాడు. 2009లో మార్చి 26 జరిగిన యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పాడు. జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందని తెలిపాడు. అది తన రెండవ జన్మగా భావిస్తానన్నాడు. అందుకే తన భార్య లక్ష్మీప్రణతి బర్త్ డే కూడా అయిన మార్చి 26 న ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుపుకొంటామని వెల్లడించాడు.
'పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా మరణానికి చేరువ కావాల్సిందే. ఆశ అనే చిన్న రేఖపై బతుకుతున్నాం. ఎపుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదు' అంటూ తన ఆలోచనలు ఇలానే ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.
సూర్యాపేట సమీపంలో జూనియర్ ఎన్టీయార్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడటంతో ఆయన గాయపడ్డారు. ఆ సమయంలో తనను ఆసుపత్రికి తీసుకెళ్లేటపుడు అమ్మ, అభిమానులు, వస్తువులు, కుక్క సహా అన్నీ గుర్తుకొచ్చాయన్నాడు. చనిపోతాననే భయం లేదు కానీ...సాధించాల్సింది చాలా ఉంది, అప్పుడే వెళ్లిపోతున్నానా అన్న ఫీలింగ్ మాత్రం వెంటాడిందని చెప్పుకొచ్చాడు. కానీ అభిమానులు, పెద్దల ఆశీస్సులు ఉండబట్టే ఇపుడు ఇలా మళ్లీ అందరిముందుకు రాగలిగానన్నాడు. కాగా ఈ మధ్య సరైన హిట్స్ లేక కలవరడుతున్న ఎన్జీఆర్ 'నాన్నకు ప్రేమతో' విజయంతో ఖుషీగా ఉన్నాడు. ఇండియాలో కంటే ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తూ ఎన్టీయార్ కు అక్కడ తిరుగులేని మార్కెట్ ను క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.