ఇప్పటికి నిజమైంది!
ఇప్పటికి నిజమైంది!
Published Wed, Feb 12 2014 11:20 PM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, పాండవులు పాండవులు తుమ్మెద... ఇలా వరుసగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. వాటిలో వెంకటేష్, పవన్‌కల్యాణ్ చిత్రం ఒకటి. ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషనే. వెంకీకి ఇది తొలి మల్టీస్టారర్ కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌కి మాత్రం ఇదే తొలి సినిమా. పైగా ఎప్పట్నుంచో ఈ ఇద్దరూ కలిసి నటించాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెంకటేషే స్వయంగా చెప్పారు.
మంచి కథ కుదిరితే చేయడానికి అభ్యంతరం లేదని పవన్ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రెండేళ్లల్లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. ఈసారి నిజమైంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత శరత్ మరార్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇంగ్లిష్ మూవీ ‘మేన్ హు స్యూడ్’, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం ఆనందంగా ఉందని శరత్ తెలియజేయగా, పూర్తి వివరాలను త్వరలో చెబుతామని సురేష్‌బాబు తెలిపారు.
Advertisement
Advertisement