ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ (55)ఇంటిని తాకాయి. తన సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఆమీర్ వెల్లడించారు. వెంటనే వారిందరినీ క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆమీర్ ఈ సమాచారాన్ని షేర్ చేశారు.
కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిందని ఆమీర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఆమెకు నెగిటివ్ రావాల్సిందిగా కోరుకోవాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించి, సహాయం అందించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోకిలా బెన్ ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు కూడా ఆమీర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాగా టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్' హిందీ రీమేక్ లో 'లాల్ సింగ్ చద్దా' లో అమీర్ కనిపించనున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్' దర్శకుడు అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆమీర్ భార్య కిరణ్ రావు దీన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
— Aamir Khan (@aamir_khan) June 30, 2020
Comments
Please login to add a commentAdd a comment