సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించడానికి హీరో నితిన్ ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాను ఎదుర్కొవడానికి తనవంతుగా రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన, ప్రజలందరూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళాన్ని అందజేయనున్నట్టు నితిన్ తెలిపారు.
మార్చి 31వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ, మరేదైనా విపత్తుల సమయంలో కానీ తన వంతు సాయం అందించడంలో నితిన్ ముందుంటారనే సంగతి తెలిసిందే. అలాంటి నితిన్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత విపత్కర పరిస్థితిని మనో ధైర్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అనవసర భయాందోళనలకు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే మార్గదర్శకాలను పాటించాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment