
బాహుబలి, శ్రీమంతుడిని వెనక్కి నెట్టేసిన 'కోర్టు'
న్యూఢిల్లీ: జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రతిష్ఠాత్మక మరాఠీ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం కోసం భారత్ నుంచి ఈ సినిమాను అధికారికంగా ఎంపిక చేసినట్లు జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ బుధవారం వెల్లడించారు. కోర్టు లోపల జరిగే సన్నివేశాలతో సాగే డ్రామాతో ఈ చిత్రాన్ని ప్రముఖ మరాఠీ దర్శకుడు చైతన్య తమనే రూపొందించారు. ముంబయి కింది స్థాయి కోర్టులో ఓ వృద్ధ ఫోక్ సింగర్కు సంబంధించిన కేసు వాదోపవాదాలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బాహుబలి, శ్రీమంతుడు, బాలీవుడ్ నుంచి పీకే, మేరీ కోం వంటి చిత్రాలున్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టేసి మరీ 'కోర్టు' చిత్రం నామినేషన్ పొందింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం ఎంపిక చేసినట్లు ప్రకటించిన అనంతరం జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ మాట్లాడుతూ ఉత్తమ విదేశీ భాషల చిత్రాల కేటగిరీ కింద వచ్చిన చిత్రాలకు 'కోర్టు' గట్టి పోటిని ఇస్తుందని చెప్పారు. ఎంపిక బృందం ఏకగ్రీవంగా కోర్టు చిత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 30 చిత్రాలను ఎంపిక ప్యానెల్ తొమ్మిది రోజులపాటు హైదరాబాద్ లో చూసిన తర్వాత చివరకు కోర్టు చిత్రాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు.