సినీ రంగం..అదో రంగుల ప్రపంచం. ఇందులోని చీకటి కోణాలు అనేకం. వర్ధమాన తారలు వ్యభిచారం కేసులో పట్టుబడిన ఉదంతాలు, డ్రగ్స్ కేసులో హల్‌చల్ ఇప్పటికే సంచలనం సృష్టించాయి. వీటన్నింటితో పాటు మొన్నటికి మొన్న ఇష్టం దర్శకుడు రాజ్ ఆదిత్య, నిన్నటికి నిన్న సినీ హీరో ఉదయ్‌కిరణ్ అర్ధంతరంగా తనువు చాలించారు. తాజాగా సోమవారం హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య వెనుక కుటుంబ కలహాలతో పాటు సినిమా అవకాశాలు లేకపోవడమూ ఓ కారణమని ఆయన కుటుంబీకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నీ సినీరంగంలో ఉన్న మరో కోణాన్ని వెలుగులోకి తెస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: వృత్తి నిబద్ధత, నిరాడంబరత, క్రమశిక్షణ... ఇవన్నీ ఒకప్పుడు సినీ రంగ ప్రముఖులకు కేరాఫ్ అడ్రగ్‌గా మారేవి. ఆ విధంగా జీవిస్తూ అందరికీ ఆదర్శప్రాయులైన వారు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. ఇది రంగుల ప్రపంచానికి సంబంధించి ఓ కోణం. మరో కోణం విషయానికి వస్తే... ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది లాటరీ వ్యవహారంగా మారిపోయింది. క్లిక్ అయితే స్టార్‌డమ్, ఇబ్బడి ముబ్బడి సంపాదన ఫలితంగా విలాసాలకు అలవాటుపడి, పబ్స్‌లో జరిగే జల్సాల జోష్‌లో మాదకద్రవ్యాలకు బానిసలవుతూ బతుకు ఛిద్రం చేసుకుంటున్నారు. గతంలో మాదకద్రవ్యాల కేసులో పట్టుబడిన సినీ హీరో రవితేజ సోదరులు రఘు, భరత్‌లు ఈ కోవకు చెందిన వారే. క్లిక్ కాకుంటే కుటుంబ పోషణతో పాటు బతుకు బండిని ఈడ్చడం సైతం భారంగా మారిపోయి, ఆ రంగాన్ని పూర్తిగా వదిలి బయటకు రాలేక పెడదారులు పడుతున్నారు. గతంలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ముగ్గురు వ్యభిచార నిర్వాహకులు, విముక్తులైన ఇద్దరు వర్థమాన తారలు ఈ కేటగిరీకి చెందిన వారే.
తెరపై కనిపిస్తే స్టార్‌డమ్...
ఒకటిరెండు సినిమాల్లో నటించినా... సాంకేతిక, ఇతర విభాగంలో పని చేసినా వారికి కృత్రిమ స్టార్‌డమ్ అంటుకుంటోంది. విలాసవంతమైన జీవితం, పబ్స్, రెసార్ట్‌ల్లో ఈవెంట్స్ పరిపాటిగా మారిపోతున్నాయి. అనునిత్యం సెలబ్రెటీ స్టేటస్‌తో ఖరీదైన లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడుతున్నారు. ఈ వ్యవహారాలకు అలవాటు పడిన తరవాత భవిష్యత్తులో సినిమా ఛాన్సులు రాకపోతే తీవ్ర డిప్రెషన్‌కు లోనై అందులోంచి బయటపడలేక పోతున్నారు. వీటికి తోడు కుటుంబ కలహాలు ఉంటున్నాయి. ఫలితంగా పెడదారులు పట్టి వక్రమార్గంలో ప్రయాణించడమే, అర్ధాంతరంగా తనువు చాలించడమో చేస్తున్నారు.
‘ఫేమ్’ వారికి ప్రాణంతో సమానం...
సినీ ప్రపంచంలో ఓసారి వెలుగు వెలిగిన వారికి డబ్బుకన్నా ‘ఫేమ్’కు మాత్రం బానిసలుగా మారతారు. సక్సెస్‌తో ముడిపడి వస్తున్న ఈ ఫేమ్ ఒక్కోసారి ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండానూ కోల్పోతున్నారు. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉందనే వాదన బలంగా ఉంది. వీరి ‘ఆశీర్వాదం’ ఉంటేనే ఆ రంగంలో రాణించడం, లేదంటే అవకాశాల కోసం వెతుక్కోవడం పరిపాటిగా మారింది. ఈ కారణాలతోనూ అనేక మంది ‘సినీ జనం’ సర్వం కోల్పోయి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఉదాహరణలెన్నో...
♦ నియంత్రణ పదార్థాల జాబితాలో ఉన్న ఎఫిడ్రిన్‌ను అక్రమ రవాణా చేస్తూ సినీ నిర్మాత కామిని వెంకటేశ్వరరావు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు.
♦ కురియన్ టోనీ జాకబ్..అసిస్టెంట్ కెమెరామెన్‌గా జీవితం ప్రారంభించి 2006లో హఠాత్తుగా ఫిల్మ్ ఫైనాన్సియర్ అవతారం ఎత్తాడు. ‘ఆప్తుడు’ చిత్రానికి పెట్టుబడిపెట్టి నిండా మునిగాడు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహించడం ప్రారంభించి పోలీసులకు చిక్కాడు.
♦ తలనొప్పి మందుల తయారీకి వినియోగించే రసాయనమైన నారాథ్రెఫ్టాన్‌ను బ్రౌన్‌షుగర్‌గా నమ్మించి విక్రయించడానికి ప్రయత్నించిన సినీ నిర్మాత హేమంత్ రామకృష్ణతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ‘యువత’ అనే చిత్రాన్ని నిర్మించి దాదాపు రూ.1.5 కోట్లు నష్టపోయి ఈ బాటపట్టాడు.
♦ పబ్ కల్చర్‌తో విసాలాలకు అలవాటు పడి కొకైన్‌కు బానిసగా మారిన సినీ నటుడు రఘు, భరత్‌లు నైజీరియన్ నుంచి ఆ డ్రగ్ కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
♦ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఓ వ్యభిచార ముఠాలోని వర్ధమాన తారలు, నిర్వాహకులు సినిమా అవకాశాలు లేకో, నష్టాలతో ఈ బాటలోకి వచ్చిన వారే.
♦ ఇష్టం చిత్ర దర్శకుడు రాజ్ ఆదిత్య సైతం తీవ్ర మానసిక వేదనతోనే సికింద్రాబాద్‌లోని హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
♦ ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేసిన డ్ర గ్స్ కేసులో నిర్మాతలు, హీరోలు, హీ రోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టు లు సైతం విచారణ ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment