
డ్రగ్ కలకలం.. మీడియా హంగామా మాత్రమే : సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారిగా తన తనయుడు రానా హీరోగా సినిమాను నిర్మించిన సురేష్, సినిమా రిలీజ్ కు ముందు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ శుక్రవారం (11-08-2017) రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తిరుమలలో మీడియాతో మాట్లాడిన సురేష్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. సినీ రంగంలో డ్రగ్ కలకలం కేవలం మీడియా హంగామా మాత్రమే అన్న సురేష్, ఇండస్ట్రీలో ఉన్న డ్రగ్స్ ప్రభావాన్ని తామే సరిదిద్దుకుంటామన్నారు. స్కూల్ పిల్లలపై డ్రగ్స్ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిదన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో
స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలకు సినీ ఇండస్ట్రీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.