
ముంబై గ్యాంగ్‌స్టర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్. అతని హృదయంలో ప్రేమ పుట్టించడానికి ఓ అందమైన అమ్మాయి మంగళవారం ముంబై వెళ్లింది. మరి.. ఆ పోలీసాఫీసర్ మనసుకు ఎలా బేడీలు పడ్డాయి? ఆమె లవ్ లాకప్‌లో ఖైదీ అయ్యాడా? అన్న విషయాలను మాత్రం ‘దర్బార్’ చిత్రంలో చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.
ఈ చిత్రం షూటింగ్‌లో మంగళవారం నయనతార జాయిన్ అయ్యారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’(2005)లో రజనీ సరసన నటించిన నయనతార ఆయన హీరోగా నటించిన ‘కథానాయకుడు’ (2008)లో స్పెషల్‌సాంగ్ చేశారు. అలాగే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నయనతార దాదాపు 14 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘గజినీ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు నయనతార. ‘‘నయనతారతో కలిసి మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు మురుగదాస్. ఈ చిత్రాన్ని అనిరు«థ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment