
చెన్నైకి డార్లింగ్
తమిళసినిమా : చెన్నై మహానగరానికి వచ్చిన వారిని ఆదరిస్తుందనే పేరుంది.ఇక్కడి సినీపరిశ్రమకు ఏ మూల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునే విశాల హృదయం ఉందని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పనవసరంలేదు.ఇంతకు ముందు భాషా భేదం (ఇప్పుడు లేదనుకోండి) లేకుండా సినిమాకు పుట్టినిల్లుగా భాసిల్లింది చెన్నై. అలాంటి తమిళ చిత్రపరిశ్రమలో పర భాషా తారల వెల్లువన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం తేదు. భాషా ఒక్కసారి చెబితే అన్నట్లుగా ఇక్కడ ఒక్క చిత్రం చేసిన నటి మళ్లీ మళ్లీ నటించాలని ఆశ పడుతుంటారు. యువ నటి నిక్కీగల్రాణి ఇలానే కోరుకుంటోంది.
డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు ఎంటర్ అయిన ఈ బెంగళూరు బ్యూటీ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకేముంది అవకాశాలు వరుసగా తలుపు తట్టడం మొదలెట్టాయి. ఇటీవలే ఆది సరసన నటించిన యాగవరాయనుమ్ నాక్కాక చిత్రం తెరపై కొచ్చింది.ఈ చిత్రంలో అమ్మడి అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పకోవడం. కాగా ప్రస్తుతం నటుడు బాబిసింహా సరసన కో-2 చిత్రంలోనూ, జీవాకు జంట గా కవలై వేండామ్ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేసూ బిజీగా ఉంది.తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయట.దీంతో తన మకాంను చెన్నైకి మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.