
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారం. సినిమాలతో బిజీగా ఉండే వరుణ్ వీలు చిక్కినప్పుడల్లా.. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో కలిసి పార్టీలకు, పబ్‌లకు, డిన్నర్‌లకు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్ కోడైకూసింది. అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చేయని వరుణ్.. కాఫీ విత్ కరణ్ షోలో తొలిసారిగా స్పందించాడు.
వచ్చే ఏడాది పెళ్లి..!
‘అవును.. నేను తనతో ఉన్నాను. ఇకపై ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తను స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. సమస్యల గురించి గళం వినిపించగల ధీశాలి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకే తనకు జీవిత భాగస్వామిగా మారి.. తన పక్కన నిలబడాలనుకుంటున్నాను. తన విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నా. అదే విధంగా తను కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. అన్నివేళలా నాకు తోడుగా ఉంటుంది’ అని నటాషాతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
ఇక ఈ జంట బంధం గురించి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా సానుకూలంగా స్పందించాడు. ‘ వచ్చే ఏడాది మా అబ్బాయి వివాహం జరిగే అవకాశం ఉంది. వరుణ్-నటాషాల రిలేషన్‌షిప్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ సంతోషంగా కూడా ఉంది. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి’అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే వరుణ్ ధావన్ వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా వరుణ్ -అలియా భట్ జంటగా నటించిన ‘కళంక్’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment