
రవిశంకర్, రష్మికా, విజయ్, భరత్, నవీన్, యష్ రంగినేని, చెర్రీ
‘‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్‌తో ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.
ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదలవుతుందంటే కొన్ని రోజులుగా నిద్రపట్టడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి నేడు బెంగుళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. మన కష్టసుఖాల్లో తోడుగా ఉండే వ్యక్తుల్ని, స్నేహితులను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకుల అభిమానం, ప్రేమ, సపోర్ట్.. వాళ్లంతా కామ్రేడ్సే. అందరూ ఈ మ్యూజికల్ ఫెస్టివల్‌కి రావచ్చు. బెంగుళూరులో జరిగే ఈవెంట్‌కి అతిథిగా వస్తున్న యశ్ (‘కేజీఎఫ్’ ఫేమ్)కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇదొక అందమైన ప్రేమకథ.
పది నిమిషాల సన్నివేశాల కోసం మూడు, నాలుగు నెలలు క్రికెట్ నేర్చుకోవాల్సి వచ్చింది. సెట్‌లో నన్ను 20 రోజులపాటు ఏడిపించారు. డబ్బింగ్ చెప్పడానికి నాలుగు నెలలు పట్టింది’’ అన్నారు రష్మికా మండన్నా. ‘‘ఇదొక లాంగ్ జర్నీ. మూడేళ్లుగా దీనిపై వర్క్ చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. నేను మాట్లాడటం కంటే సినిమానే మాట్లాడుతుందనుకుంటున్నా’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఈ సినిమా ద్వారా ఓ కొత్త విజయ్‌ని చూస్తారు’’ అన్నారు యష్ రంగినేని. ‘‘ఈ నెల 22న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత రవిశంకర్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.అనిల్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: సుజిత్ సారంగ్.
Comments
Please login to add a commentAdd a comment