లీటర్‌ యాసిడ్‌తో నాపై దాడి చేశాడు | Sakshi
Sakshi News home page

నాకు 54 సర్జరీలు జరిగాయి: హీరోయిన్‌ సోదరి

Published Tue, Dec 10 2019 4:29 PM

Deepika Padukone Movie Chhapaak Trailer Praised By Rangoli Chandel - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘చపాక్‌’. యాసిడ్‌ దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగన రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ ఈ ట్రైలర్‌పై సోషల్‌ మీడియాలో స్పందించారు. యాసిడ్‌ దాడికి గురైన రంగోలి చందేల్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ చిత్ర నిర్మాతలపై, దర్శకురాలిపై ప్రశంసలజల్లు కురిపించారు. ‘చపాక్‌ ట్రైలర్‌ను చుశాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించాలని కోరుకుంటున్నాను’ అనే క్యాప్షన్ జత చేసి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 

ఈ క్రమంలో రంగోలి తనపై జరిగిన యాసిడ్‌ దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ వ్యక్తి ప్రేమను నిరాకరించినందుకు అతను ఒక లీటర్‌ యాసిడ్‌తో నాపై దాడి చేశాడని.. దీంతో తన ముఖానికి 54 సర్జరీలు జరిగాయని చెప్పుకొచ్చారు. ‘దాడి తర్వాత నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. యాసిడ్‌ దాడి వల్ల నా అందాన్ని కోల్పోయావంటూ చాలా మంది నాపై సానుభూతి చూపించారు. మీరు ఊహించగలరా.. ఈ సర్జరీల కోసం నా శరీరంలోని వివిధ భాగాల నుంచి వైద్యులు నా చర్మాన్ని ప్యాచ్‌లుగా తీసుకున్నారు. యాసిడ్‌ ధాటికి నా అవయవాలు అన్నీ కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్‌లు నా చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు.

ఈ ఘటనలో నా రొమ్ము భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. నేను బిడ్డలకు పాలు పట్టేటపుడు తీవ్రమైన నొప్పిని భరించాను. ఇప్పటికీ నా మెడను కొన్ని సమయాలల్లో తిప్పలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అలాగే ఈ దాడిలో నా కన్నును కోల్పోయాను. దానికి ప్రస్తుతం రెటీనా మార్పిడి చేయాల్సి ఉంది’ అని రంగోలి తన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం భారదేశంలో యాసిడ్‌ ఘటనలు పెరిగిపోయాయని, యాసిడ్‌ దాడి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఆమె అందోళన వ్యక్తం చేశారు.  

ఇక చపాక్‌ విషయానికి వస్తే.. దీపికా పదుకోనే, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చపాక్‌లో యాసిడ్‌ దాడి ఘటన అనంతరం కేసు దర్యాప్తు, కోర్టు విచారణ, వైద్య చికిత్సలు ఇలా ఆ యువతి ఎదుర్కొన్న పరిస్థితులను దర్శకురాలు తెరపై మనకు చూపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదలు చేయనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement