
సినిమాల్లోకి కొడుకో.. కూతురో.. అల్లుడో... వస్తున్నారంటే పేరెంట్స్ చాలా హ్యాపీ. కానీ, అసలు పండగ అభిమానులదే. కొత్త తరం కొత్త తెరంగేట్రం కావాలనుకుంటారు కదా.
అభినయ సుందరి
అందం+అభినయం= శ్రీదేవి. ఫ్రమ్ సౌత్ టు నార్త్ శ్రీదేవికి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. అందుకే వారసురాలిపై చాలా అంచనాలు ఉన్నాయి. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టీనేజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ‘ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది’ అని ఒకటే వార్తలు. ఇదిగో.. ఆ సమయం రానే వచ్చేసింది. మరాఠి సూపర్ హిట్ సినిమా ‘సైరట్’ రీమేక్ ‘ధడక్’ ద్వారా హీరోయిన్‌గా పరిచయం కానుంది జాన్వీ. ఇదే చిత్రం ద్వారా షాహిద్‌కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. తల్లిలానే జాన్వీ అభినయ సుందరి అనిపించుకుంటుందనే అంచనాలున్నాయి.
మెగా కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్‌లో జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆయన చిన్నల్లుడు కల్యాణ్ హీరో ఎంట్రీ ఖరారైంది. అల్లుడు కూడా అభిమానులకు వారుసుడే కదా. ప్రస్తుతం కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మెలకువలు నేర్చుకుంటున్నాడట. ‘జతకలిసే’ ఫేమ్ రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
అచ్చన్ పేరు నిలబెట్టే మగ
సిక్స్‌టీ ప్లస్ ఏజ్‌లో వెయిట్ తగ్గడం అంటే మాటలా? కానే కాదు. కానీ మోహన్‌లాల్ చేస్తారు. సినిమా కోసం తగ్గుతారు. ఎందుకంటే సినిమా అంటే ప్యాషన్. అందుకే ఆయన్ను ‘కంప్లీట్ యాక్టర్’ అంటారు. మరి.. ఆయన కుమారుడు ప్రణవ్? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని మలయాళ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘ఒన్నమన్, పునర్జని’ సినిమాల్లో కనిపించారు. ‘పునర్జని’ సినిమాకు ప్రణవ్ కేరళ స్టేట్ అవార్డ్ కూడా సాధించాడు. చిన్నప్పుడు అవార్డు కొట్టేశాడంటే.. హీరోగా వేరే చెప్పాలా? అచ్చన్ (నాన్న) పేరు నిలబెట్టే మగ (కొడుకు) అవుతాడని మోహనల్‌లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆది’ అనే సినిమాతో ఈ నెల 26న హీరోగా స్క్రీన్‌పైకి రాబోతున్నాడు ప్రణవ్. ‘పాపనాశం’ ‘లైఫ్ ఆఫ్ జోసుట్టీ’ సినిమాలకు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ప్రణవ్ ఆయన డైరెక్షన్‌లోనే ఇంట్రడ్యూస్ కానుండటం విశేషం.
విక్రమ్ పుత్రుడు
అంధుడు, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి, మల్టిపుల్ డిజార్డర్... ఇలా వెరైటీ రోల్స్ ఏం చేయాలన్నా విక్రమ్ రెడీ. ఈయన టాలెంట్ సూపర్. మరి.. వారసుడు. తండ్రి టాలెంట్ కచ్చితంగా ఉంటుందని ‘ధ్రువ్’పై ఇప్పటికే బోలెడన్ని అంచనాలు. ధ్రువ్ సన్నాఫ్ విక్రమ్ హీరోగా ఎంటర్ కాబోతున్నాడు. అది కూడా సాదాïసీదా సినిమాతో కాదు. సెన్సేషనల్ హిట్ మూవీ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దర్శకుడెవరో తెలుసా? ఎవరి పేరు చెబితే ఆర్టిస్టులకు మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతగాడే. డైరెక్టర్ ‘బాల’. ఆర్టిస్టులను నానా కష్టాలు పెడతాడన్న పేరు బాలాకి ఉంది. కానీ ఆర్టిస్టులకు వచ్చే ‘పేరు’ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. అన్నట్లు.. బాల డైరెక్షన్‌లో చేసిన ‘శివపుత్రుడు’కే విక్రమ్‌కు నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన డైరెక్షన్‌లో చేసిన ‘సేతు’ ఆయనకు బోలెడంత పేరు తెచ్చింది. మరి.. ఈ డైరెక్టర్ చేతిలో పడ్డ ధ్రువ్ ‘వర్మ’గా రెచ్చిపోతాడని ఊహించవచ్చు. అదేనండీ.. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌కి ‘వర్మ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు.
సూపర్ స్టార్ గ్రాండ్ డాటర్ ఎంట్రీ
జాహ్నవి ఎవరనేగా మీ డౌట్. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె. మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సినిమా ద్వారా మంజుల కుమార్తె జాహ్నవి టాలీవుడ్‌కి బాలనటిగా పరిచయం అవుతోంది. తాతయ్య కృష్ణ, మేనమామ మహేశ్‌బాబు స్ఫూర్తితో జాహ్నవి బాగా యాక్ట్ చేసిందని ఇండస్ట్రీ టాక్.
నానమ్మ బాటలో మనవరాలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్‌ల కుమార్తె సారా అలీఖాన్. చూడచక్కగా ఉంటుంది. హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. 2014 నార్త్ ఇండియా ఉత్తరాఖాండ్‌లో వచ్చిన వరదల ఆధారంగా రూపొందుతున్న ‘కేదార్‌నాథ్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది సారా. అభిషేక్ కపూర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. నానమ్మ షర్మిలా ఠాగూర్ అప్పట్లో పేరున్న కథానాయిక. మనవరాలు కూడా అంత పేరు తెచ్చుకుంటుందా? వెయిట్ అండ్ సీ.
డాడీ డైరెక్టర్.. సన్ హీరో
డైరెక్టర్ల పిల్లలు డైరెక్టర్లే అవ్వాలని రూలేం లేదు. హీరోలు కూడా అవుతారు. టి.కృష్ణ తనయుడు గోపీచంద్, రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి , పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోలైన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు కె.విజయభాస్కర్ తనయుడు కమల్ హీరోగా అరంగేట్రం చేయనున్నారు. విజయభాస్కర్ అనగానే ‘నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ, మల్లీశ్వరి’ వంటి సినిమాలు గుర్తుకురాక మానవు. తండ్రి ఓ మంచి దర్శకుడైనా కొడుకుని మాత్రం కాళీ అనే ఓ కొత్త దర్శకుడి చేత ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో తన కుమారుడి ఎంట్రీని గ్రాండ్‌గా ప్రకటించనున్నారు విజయభాస్కర్.
శివానీ ఎంట్రీ షురూ
హీరో కాకముందు రాజశేఖర్ ఎవరు? విలన్. అంతకుముందు డాక్టర్. ఆ తర్వాతే యాక్టర్ అయ్యారు. కుమార్తె శివానీ కూడా తండ్రి ఫుట్‌స్టెప్స్‌నే ఫాలో అవుతున్నారు. భవిష్యత్తులో ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎడ్యుకేషన్ కంపల్సరీ కదా. అందుకే జీవితారాజశేఖర్ ముందు శివానీని ఎంబీబీఎస్ పూర్తి చేయమన్నారు. శివానీ కూడా స్టడీస్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు యాక్టర్‌గా టాలెంట్ నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. హిందీ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ ద్వారా శివానీ ఎంట్రీ షురూ అయింది. ఇక, షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. వయసుకి తగ్గట్టు మంచి లవ్‌స్టోరీతో ఇంట్రడ్యూస్ కాబోతున్న శివానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వెంకట్ కుంచం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అడవి శేష్ హీరో.
Comments
Please login to add a commentAdd a comment