‘‘మిస్కిన్ (దర్శకుడు) విచిత్రమైన మనిషి. నేనూ, ఆయన సినిమా చేస్తున్నామనగానే ‘ఇద్దరు సైకోలు కలసి సినిమా చేస్తున్నారు’ అని ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తే... నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందని గట్టి నమ్మకం. ఆయన డిఫరెంట్ సినిమాలు తీస్తారు. ఎనిమిదేళ్లుగా ఇద్దరం సినిమా చేయాలనుకుంటుంటే... ఈ ఏడాది కుదిరింది. హాలీవుడ్ ‘షెర్లాక్ హోమ్స్’ తరహా చిత్రమిది. అక్టోబర్‌లో తమిళ్‌లో ‘తుప్పరివాలన్’గా విడుదలై సూపర్ హిటై్టంది.
తెలుగులోనూ హిట్టవుతుందనే నమ్మకముంది. నా కెరీర్‌లో వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్’’ అన్నారు విశాల్. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి. హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్’. ఈ నెల 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ– ‘‘ఇందులో అద్వైత భూషణ్‌గా నటించా. ఒక్క పాట కూడా లేకుండా నేను సినిమా చేయడం ఇదే తొలిసారి.
వచ్చే ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేశాం’’ అన్నారు. తెలుగులో మీ సిన్మాలు ఎందుకు లేటుగా విడుదలవుతున్నాయి? అనడిగితే.. ‘‘సెన్సార్ సమస్యలే కారణం. తమిళ్ సెన్సార్‌ను ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి సర్టిఫికెట్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ చేతికొచ్చినట్టు ఉంటోంది. ఒక్కోసారి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఉంటే వెనక్కి వెళ్లక తప్పడం లేదు. (నవ్వుతూ...) 10వ తేదీన సినిమా విడుదల కాకుంటే హరిని చంపేస్తా.
తెలుగులో నా బలం హరి’’ అన్నారు విశాల్. ‘విజయ్ ‘మెర్సల్’కి మద్దతిచ్చారు. చెన్నైలో వరదలొస్తే హెల్ప్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?’ అనడిగితే... ‘‘సీబీఎఫ్‌సీ (సెన్సార్) సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల జోక్యం ఏంటి? వాళ్లందరూ డైలాగులు కట్ చేస్తే... చివరికి సిన్మాలో సెన్సార్ సర్టిఫికెట్, రోలింగ్ టైటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఇక, రాజకీయాలు అంటారా? పవర్ ఉంటేనే ప్రజలకు మేలు చేయగలుగుతానని ఫీలైన రోజున రాజకీయాల్లోకి వస్తా.
మన రాజకీయ నాయకులు మంచి రాజకీయం చేయాలని నా ఆశ.అప్పుడు నాలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉండదు’’ అని విశాల్ తెలిపారు. మన దేశంలోని సినీ ప్రముఖులందరూ కలసి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీపై ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కార్యక్రమంలో చిత్రనిర్మాత హరి, నటి ఆండ్రియా, మాటల రచయిత రాజేశ్ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎవరితో.... అనేదిఅమ్మాయి ఇష్టమే!
క్యాస్టింగ్ కౌచ్... (హీరోయిన్లపై లైంగిక వేధింపులు/పడకగదికి వస్తే సిన్మాలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం)... ఇప్పుడీ అంశం ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది! కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో సామాన్యులు ‘మీ టూ’ పేరుతో ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు.
‘‘క్యాస్టింగ్ కౌచ్, మీటూ’లపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆండ్రియాను అడిగితే... ‘‘ఇండస్ట్రీలో నాకెలాంటి లైంగిక ఇబ్బందులూ ఎదురుకాలేదు. ఒకవేళ ఎదురైతే సినిమాలు వదులుకోవడానికి నేను సిద్ధమే. అయినా... ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగతం. మగవాళ్లు డిసైడ్ చేయాల్సిన విషయం కాదిది. మరొకరు బలవంతం చేయకూడదు’’ అన్నారు.
ప్రేమ పెళ్లే... జనవరిలో!
ఇంట్లో కోప్పడుతున్నారు... ‘పెళ్లెప్పుడు?’ అని! డిసెంబర్‌లో ‘నడిగర్ సంఘం’ ఓన్ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ నెక్ట్స్ మంత్... జనవరిలో పెళ్లి చేసుకుంటా. ‘పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?’ అని ‘సాక్షి’ అడగ్గా... ‘‘లవ్ మ్యారేజే (ప్రేమ పెళ్లే)! నాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదండీ’’ అని నవ్వేశారు విశాల్.
Comments
Please login to add a commentAdd a comment