సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌కు పితృవియోగం..
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు పితృవియోగం కలిగింది. దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి (61) గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. సత్యమూర్తి రచయితగా తెలుగు చలన చిత్రపరిశ్రమకు 90 సినిమాలకు పైగా తన రచనలు అందించారు. రచయితగా పనిచేసిన ఆయన తొలి సినిమా 'దేవత'.
ఆ తరువాత ఖైదీ నెం.786, చంటి, బంగారు బుల్లోడు, ఛాలెంజ్, అభిలాష, భలేదొంగ లాంటి పలుచిత్రాలకు రచయితగా పనిచేశారు. కాగా, ఈ రోజు సాయంత్రం చెన్నైలో సత్యమూర్తి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ రచయిత సత్యమూర్తి మృతిపట్ల దర్శకుడు హరీష్ శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవిశ్రీ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు.
Shocked and Deeply Saddened with the Dismissal of Great Writer Satyamurthy Gaaru may God give strength to @ThisIsDSP and family..
— Harish Shankar .S (@harish2you) December 14, 2015