మా అమ్మే మా స్టార్‌! | Devi sriPrasad talking about her mother Shivamani Satyamurthy | Sakshi
Sakshi News home page

మా అమ్మే మా స్టార్‌!

Published Sun, May 10 2020 12:50 AM | Last Updated on Sun, May 10 2020 5:03 AM

Devi sriPrasad talking about her mother Shivamani Satyamurthy - Sakshi

తల్లి శివమణితో దేవిశ్రీ ప్రసాద్‌

అమ్మంటే అనురాగం
అమ్మంటే ఆనందం
అమ్మంటే ఆత్మీయం
అమ్మంటే ధైర్యం
అమ్మంటే త్యాగం
అమ్మంటే రక్షణ
అమ్మంటే ఓదార్పు
అమ్మంటే... చెప్పడానికి ఇలా ఎన్నో ఉంటాయి. ‘మదర్స్‌ డే’ సందర్భంగా ‘మా అమ్మే మా స్టార్‌’ అంటూ కొందరు సినీ స్టార్స్‌ పంచుకున్న విశేషాలు.


మన తప్పులను ప్రేమించే వ్యక్తి అమ్మ: దేవిశ్రీ ప్రసాద్‌
అమ్మ గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. కొన్ని వేల పాటలు చేసినా కూడా అమ్మ గురించిన కంప్లీట్‌ ఎమోషన్‌ను చెప్పలేం. ఎందుకంటే వారు చూపించే ప్రేమ అటువంటిది. అమ్మ చేసే త్యాగాలు అటువంటివి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ ఒకేలా మనల్ని ప్రేమించగల ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైన మదర్స్‌ అందరికీ ‘హ్యాపీ హ్యాపీ మదర్స్‌ డే’.

► మా కుటుంబంలో మేమందరం సాధించిన ప్రతి విజయానికి కారణం మా అమ్మగారే. మా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. మా అందరి పని కంటే మా అమ్మగారు మా కోసం చేసే పనే ఎక్కువ. ఏ పనినైనా చాలా అకింతభావంతో, ఏకాగ్రతగా చేస్తారు. ‘మీరు చేసే హార్డ్‌వర్క్, ఆ కమిట్‌మెంట్, ఆ డెడికేషన్‌లో మాకు పదిశాతం ఉన్నా మేం జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళతాం’ అని మా అమ్మగారితో నేను అంటుంటాను. ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ‘మా ఆవిడకు నలుగురు పిల్లలండీ నాతో కలిపి’ అని మా నాన్నగారు అంటుండేవారు. మా నాన్నగారిని కూడా మా అమ్మగారు ఓ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు.

► నా ఇంటిపైనే నా స్టూడియో ఉంటుంది. దాని పై నా పెంట్‌హౌస్‌ ఉంటుంది. కింద అమ్మ ఉంటారు. పైన నేను ఉంటాను. మాములుగానే లంచ్‌ టైమ్, డిన్నర్‌లను మా అమ్మగారితో చేస్తాను. ఈ క్వారంటైన్‌ సమయంలో అమ్మతో ఇంకా ఎక్కువసేపు స్పెండ్‌ చేస్తున్నాను. ఖాళీ సమయంలో నేను ఏదైనా వంటకాన్ని ట్రై చేద్దామన్నా కూడా అమ్మ ఒప్పుకోవడం లేదు.

► ఈ మదర్స్‌ డే రోజు మా అమ్మగారి గురించి మాట్లాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారి గురించి చెప్పమంటే నేను చెబుతూనే ఉంటాను. మా అమ్మగారు వంట చేసినప్పుడల్లా నేను ఓ కాంప్లిమెంట్‌ ఇస్తూనే ఉంటాను. ‘మమ్మీ వంటలో నువ్వు ఇళయరాజాగారిలా అని’. మ్యూజిక్‌ గురించి ఏదైనా పోల్చాలంటే నా దృష్టిలో ఇళయరాజాగారు నంబర్‌ వన్‌. ‘మ్యూజిక్‌లో ఇళయరాజాగారు ఎలానో వంటలో నువ్వు అలా’ అని మా అమ్మకు నేను కాంప్లిమెంట్‌ ఇస్తుంటాను.

► చిన్నతనం నుంచే మ్యూజిక్‌ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడిని. చాలా ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేవాడిని. స్కూలు, మ్యూజిక్‌ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండలిన్‌ శ్రీనివాస్‌గారి దగ్గర క్లాసులు, మళ్లీ ప్రాక్టీస్‌.. ఇలా వేళకు భోజనం చేయడానికి కుదిరేది కాదు. అందుకే ఇప్పటికీ నాకు డిఫరెంట్‌ టైమ్స్‌లో ఆకలి వేస్తుంది. అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆశ్యర్యంగా అప్పుడే మా అమ్మగారు ఫోన్‌ చేసి ‘ఏరా.. ఆకలేస్తుందా’ అని అడుగుతారు. ఇది జరిగినప్పుడల్లా నాకు ఒళ్లు పులకరిస్తుంది. ‘నాకు ఆకలేస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది?’ అంటే ‘ఏమోరా నాకు అనిపించింది’ అని చెబుతారు.

ఇంకో విశేషం ఏంటంటే.. నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మా అమ్మగారు ఆ డిష్‌ పేరు చెప్పి తింటావా? అని అడుగుతారు. ఉదాహరణకు నాకు ఎగ్‌ రైస్‌ తినాలనిపించిందనుకోండి.. ‘ఏరా ఎగ్‌రైస్‌ తింటావా?’ అని మా అమ్మగారు అడుగుతారు. అమ్మా నేను అదే అనుకుంటున్నాను అంటాను. చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చాలా జరిగాయి. మనం అందరం అమ్మకు రుణపడి ఉండాలి. వారిని ప్రేమిస్తూ, బాగా చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం గడపడమే మనం చేయగలిగింది. ఎందుకంటే వారి స్థాయికి మనం ఎప్పుడూ చేరుకోలేం. హ్యాపీ మదర్స్‌ డే. విత్‌ లవ్‌ టు మై మదర్‌ శివమణి సత్యమూర్తిగారు.

మళ్లీ మళ్లీ నీకే పుట్టాలనుకుంటున్నా: చిన్నికృష్ణ
► బుడి బుడి అడుగుల నుంచి పరుగుల వరకు.. జీవితంలో అమ్మ (లక్ష్మీ సుశీల) ఎన్నో పాఠాలు నేర్పింది. నా జీవిత ప్రయాణానికి కూడా గురువు అయ్యింది. మా ఇంటో ఓ కష్టం వస్తే.. దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలు తిప్పింది. అమ్మ వేలు పట్టుకుని అన్ని గుళ్లూ తిరిగాను. అప్పుడు ఎన్నో కథలు చెప్పింది. ఆ కథలే ప్రేక్షకులకు చెప్పే రచయితను చేశాయి.

► నేను సంపాదించడం మొదలుపెట్టాక ఏం కావాలని అడిగితే అమ్మ ‘కపిల గోవు’ని అడిగింది. మాకు గోశాల ఉండేది. అమ్మ అడిగిన గోవుని కొనిపెడితే సంబరపడిపోయింది. అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. ఇప్పటికీ నాకు అన్నం తినిపిస్తుంది.

► మానవత్వానికి, మంచితనానికి జంతువుల్లో ఆవుకి ప్రథమ తాంబూలం ఇస్తారు. అలా మానవత్వంలో మా అమ్మకు నేను ప్రథమ తాంబూలం ఇస్తాను. అందర్నీ సమానంగా చూడటం అనేది ఆమె దగ్గరే నేర్చుకున్నాను. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మా అమ్మగారు ఆర్‌ఎస్‌ఎస్సా? మదర్‌ థెరిస్సానా? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడకు అందరూ ఒకటే. ‘మానవకులం’ అనుకుంటుంది. చెడ్డవాళ్లల్లోనూ మంచిని చూసే మనిషి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండకు. వీలైతే మంచివాళ్లలా మార్చు అని చెప్పింది. అందుకే ‘అమ్మా... మళ్లీ మళ్లీ నీ కడుపునే పుట్టాలనుకుంటున్నాను’.

► అమ్మ నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య, చెల్లెలు తెనాలిలో ఉంటారు. వాళ్లతో, వాళ్ల పిల్లలతో ఉండాలని తెనాలి వెళ్లింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన విషయాలకు కారణంగా నిలిచిన అమ్మా... నీకు ‘హ్యాపీ మదర్స్‌ డే’.

లక్ష్మీ సుశీల, చిన్నికృష్ణ

చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం: కాజల్‌ అగర్వాల్‌
► నా పదేళ్ల కెరీర్‌లో ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. అమ్మ, నాన్న, నాన్నమ్మతో ఎక్కువ టైమ్‌ గడిపే వీలు దొరికింది. అలాగని సమయాన్ని వృథా చేయడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను. అందరం కష్టకాలంలో, భయంలో ఉన్నాం. దీన్ని ఎలా అయినా దాటగలుగుతాం.

► నేను అమ్మకి చాలా క్లోజ్‌. నేను ఈరోజు మంచి పొజిషిన్‌లో ఉన్నానంటే దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. నన్ను సరైన మార్గంలో గైడ్‌ చేస్తుంటుంది. నాకు వంట నేర్పించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అమ్మ. ఫైనల్‌గా ఇప్పుడు  నేర్చుకుంటున్నాను. నేను వంట గది బాధ్యతలు తీసుకోవడం అమ్మకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ).

► మా చిన్నప్పుడు నేను, చెల్లెలు (నిషా అగర్వాల్‌) మదర్స్‌ డే కోసం స్పెషల్‌గా గ్రీటింగ్‌ కార్డ్‌ తయారు చేసి, అమ్మకి ఇచ్చేవాళ్లం. అలాగే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ మేమే తయారు చేసేవాళ్లం. అమ్మ గదిని బాగా అలంకరించేవాళ్లం. పెద్దయ్యాక లంచ్‌కి బయటికి తీసుకెళుతున్నాం. లాక్‌డౌన్‌ ముందు వరకూ మదర్స్‌ డే అంటే అవుటింగే. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం. బయటికి వెళ్లలేం కాబట్టి, చిన్నప్పుడు చేసినట్లుగా మా అమ్మ రూమ్‌ని అందంగా డెకరేట్‌ చేశాం. బ్రేక్‌ఫాస్ట్‌ కూడా మేమే తయారు చేస్తాం.

► అమ్మకు బహుమతులంటే ఇష్టం ఉండదు. తనతో మేం ఉండటమే పెద్ద గిఫ్ట్‌ అనుకుంటుంది. ఈ లాక్‌డౌన్‌ వల్ల ఓ రెండు నెలలుగా అమ్మతోనే ఉంటున్నాను. ఆవిడకు చాలా ఆనందంగా ఉంది.

తల్లి సుమన్‌ అగర్వాల్‌తో కాజల్‌

అమ్మ ఏం చెప్పినా వింటాను: నిధీ అగర్వాల్‌
► సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ఇంటిపట్టున ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బావుంది. ఇంట్లో ఉండటం ఎవ్వరికైనా ఇష్టమే కదా. అమ్మ చేతి వంట తింటూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇంట్లో ఉంటే చాలా గారాభంగా చూస్తారు. ఇలా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి 2–3 ఏళ్లు అవుతోంది. షూటింగ్స్‌ వల్ల మహా అయితే 2 రోజులు కూడా ఉండటానికి కుదిరేది కాదు.

► చిన్నప్పుడు మదర్స్‌ డే అంటే అమ్మకి స్వయంగా గ్రీటింగ్‌ కార్డ్‌ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎలాంటి కార్డ్‌ తయారు చేయాలనే విషయంలో ముందు రోజంతా ఆలోచించేదాన్ని. అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసేదాన్ని.

► ఈ మదర్స్‌డేకి అమ్మకి ఏదైనా కొందామంటే బయటకు వెళ్లే వీలు లేదు. ఇవాళ అమ్మ ఏం చెప్పినా వింటాను (నవ్వుతూ). షూటింగ్స్‌ ఉన్నప్పుడు ఇంటికి ఫోన్‌  చేయడం కుదరదు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఫోన్‌ వచ్చినా ఆన్సర్‌ చేయడం వీలవదు. కానీ ఈసారి నుంచి అమ్మ ఫోన్‌ని ఎప్పుడూ మిస్‌ చేయకూడదని నిశ్చయించుకున్నాను.

► అమ్మానాన్న ఇద్దరితోనూ నేను క్లోజ్‌. అమ్మతో మంచి అటాచ్‌మెంట్‌ ఉంది. అమ్మకు చిన్న వయసులోనే నేను పుట్టాను. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్ని క్లాస్‌లకు పంపేది. కేవలం చదువు ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ డెవలప్‌ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలని డ్యాన్సింగ్‌ క్లాస్, స్పోర్ట్స్‌ క్లాస్‌ చేర్పించారు. ప్రస్తుతం నేను సినిమాలో ఈజీగా డ్యాన్స్‌ చేసినా, ఈజీగా ఎవ్వరితో అయినా కమ్యూనికేట్‌ అవుతున్నా అంటే చిన్నప్పుడు అమ్మ తీసుకున్న శ్రద్ధ వల్లే. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ అమ్మ పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ‘మై మమ్మీ ఈజ్‌ బెస్ట్‌’. మంచి చెబుతూ పెంచారు.

► లాక్‌డౌన్‌లో వంట గదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పటివరకూ  2 కేకులు బేక్‌ చేశాను. దోసె, గ్రీన్‌ చట్నీ, టీ తయారు చేశాను. అన్నింటికీ మా అమ్మ పదికి పది మార్కులు వేశారు. ఏదైనా పని చేస్తే పక్కాగా చేయాలి, లేదంటే పక్కన పెట్టేయాలి అనుకుంటాను నేను. ఆ అలవాటు అమ్మ వల్ల వచ్చింది. అలాగే మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తారు. తననుంచి నేను నేర్చుకున్న మరొక విషయం అది.

తల్లి ఇందూ అగర్వాల్‌తో నిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement