సినిమా ముఖ్యంగా తమిళ సినిమా వైవిధ్యాన్ని వెతుక్కుంటూ పోతోందని చెప్పవచ్చు. కథానాయకులు, దర్శకులు కొత్తదనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ వైవిధ్యానికి చిరునామా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాల్లో ఇతర చిత్రాలకు భిన్నంగా పాత్రలు చోటు చేసుకుంటాయి. నటులను అందుకు తగ్గట్టుగానే మార్చేస్తారు. వెట్రిమారన్ ఇంతకు ముందు తెరకెక్కించిన ఆడుగళం, పొల్లాదవన్, వడచెన్నై లాంటి చిత్రాలను గమనిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ మూడు చిత్రాల్లోనూ ధనుషే కథానాయకుడు. అందులో ఆయన పోషించిన పాత్రలు ఒకదానికి ఒకటి పోలికే ఉండదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అసురన్. ఇందులో ధనుష్‌కు జంటగా మలయాళ నటి మంజువారియర్ నటించడం మరో విశేషం. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది తాజా సమాచారం. అదే విధంగా ఇందులో ఆయన గెటప్ చూస్తుంటే రైతుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అసురన్ చిత్రంలో ధనుష్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇందులో 45 ఏళ్ల తండ్రి పాత్ర కొంచెం సేపే ఉన్నా దాని ప్రభావం కథపై చాలానే ఉంటుందని చెప్పారు. అదే విధంగా తండ్రీ కొడుకులుగా ధనుష్ చూపిస్తున్న వైవిధ్యభరిత నటన అందరినీ ఆకర్షిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో ఒక కొండ ప్రాంతంలో జరిగే సన్నివేశాన్ని దాదాపు 6 గంటల పాటు చిత్రీకరించాం.
అయినా ఎలాంటి అసహనం చెందకుండా ధనుష్ నటించారని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు. ధనుష్ ఈ చిత్రంతో పాటు దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఇలా ఒకే సారి రెండు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న నటుడు ఈయనే అవుతారేమో.
Comments
Please login to add a commentAdd a comment