లుక్.. లుక్.. లుక్..దిసీజ్ ధ్రువ లుక్!
అతనో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. ఉద్యోగంలో చేరక ముందే సమాజంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలనేది అతని ఆశయం. అందుకే ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్స్‌తో కలిసి కొన్ని నేరాలకు చెక్ పెడతాడు. ఐపీఎస్‌గా చార్జ్ తీసుకున్నాక సమాజంలో పెద్ద మనిషిగా ,చలామణి అవుతున్న ఓ తిమింగలం పనిపట్టడానికి సిద్ధమవుతాడు. తర్వాత ఏమైందనే ది తమిళ చిత్రం ‘తని ఒరువన్’ కథ. ‘జయం’ రవి హీరోగా నటించిన ఈ సూపర్‌హిట్ మూవీకి తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘ధ్రువ’. తెలుగుకి అనుగుణంగా పలు మార్పులూ చేర్పులూ చేశారు.
రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాతృకలో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా అదే పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రామ్‌చరణ్ లుక్ శనివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. గత నెలాఖరున మొదలైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఫైట్ సీక్వెన్సెస్, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 20న కశ్మీర్‌లో మలి షెడ్యూల్‌ను ప్రారంభించ నున్నారు. ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: హిప్ హాప్ ఆది, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వై ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: ఎన్వీ ప్రసాద్.