
అఖిల్ రికార్డు పారితోషికం?
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆరంగేట్రంతోనే ఏ హీరో తీసుకోనంత పారితోషికం అక్కినేని అఖిల్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించిన నితిన్, అఖిల్కు రూ.7 కోట్లు పారితోషికంగా ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రయలర్లో అఖిల్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నాడు. 'అఖిల్' సినిమాకు మంచి టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం భారీగానే డబ్బు పెట్టినట్టు తెలుస్తోంది.
హీరోగా అఖిల్ నటించిన తొలి చిత్రం కాబట్టి, అక్కినేని అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిన్నప్పుడు 'సిసింద్రీ'గా అలరించి, పెద్దయ్యాక 'మనం'లో తెరపై కొన్ని సెకన్ల పాటు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని అందరి అభినందనలూ అందుకున్నాడు అఖిల్. ఈ అక్కినేని నటవారసుడు తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడా? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? అనే చర్చ జరుగుతోంది. చిత్రదర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ బాగా చేశాడని అంటున్నారు. ఈ చిత్రం నిడివి రెండు గంటల పది నిమిషాలు. అఖిల్ ఏ రేంజ్‌లో విజృంభించాడో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.