నిత్య నటన చూసి ఆశ్చర్యపోయాను - శ్రీప్రియ
నిత్య నటన చూసి ఆశ్చర్యపోయాను - శ్రీప్రియ
Published Wed, Sep 4 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘22 ఫీమేల్ కొట్టాయం’. ఈ చిత్రం ‘మాలిని 22’గా తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మాణం అవుతోంది. నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అలనాటి అందాల తార శ్రీప్రియ దర్శకురాలు. రాజ్‌కుమార్ సేతుపతి నిర్మాత. ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిత్యామీనన్ మాట్లాడుతూ -‘‘శ్రీప్రియ ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వాణిజ్య విలువలతో పాటు, చక్కని సందేశం కూడా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘సమాజం పోకడలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నిత్యామీనన్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఆమె నటన, హావభావాలు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇందులో నిత్య రెండు పాటలు కూడా పాడారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అని శ్రీప్రియ చెప్పారు.
ఈ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించాలనుకుంటున్నట్లు నిర్మాత తెలిపారు. ఇందులో భిన్నమైన పాత్ర చేస్తున్నానని, శ్రీప్రియ గొప్ప నటి మాత్రమే కాదు, గొప్ప దర్శకురాలు కూడా అని నరేష్ అన్నారు. ఈ చిత్రంలో అవకాశం రావడం పట్ల కథానాయకుడు క్రిష్ సత్తార్ ఆనందం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యూరామన్, అంజలిరావ్, జానకీ, చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఉమర్జీ అనూరాధ-గౌతమ్ కశ్యప్, సంగీతం: అరవింద్ శంకర్.
Advertisement
Advertisement