దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్
‘‘గతంలో సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేవి.. కానీ, ఇప్పుడు సమాజం సినిమాలను ప్రభావితం చేస్తోంది. ఇండస్ట్రీ కంటే ముందుగా సొసైటీ చాలా ఫాస్ట్‌గా ఉంది. అందుకే సొసైటీని చూసి చిత్రాలు చేసే పరిస్థితి. సినిమా అన్నది అబద్ధంలా కాకుండా అద్దంలా నిజాలను చూపాలి.. అప్పుడే హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని చెప్పిన విశేషాలు.
► ‘చిలుకూరు బాలాజి’ సినిమా తర్వాత ‘బిచ్చగాడు’ సినిమా నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌గారి బ్యానర్‌లో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నా. క్లైమాక్స్ ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంతో డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావుగారి అబ్బాయి పవన్ హీరోగా పరిచయమవుతున్నాడు. సీనియర్ నటుడు సురేశ్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.
► నేటి తరం పిల్లలు డిజిటల్ మాధ్యమాలకు ఎలా బానిసలవుతున్నారనే కథాంశంతో ‘డూడు.. డీడీ’ అనే చిన్నపిల్లల సినిమా తీశా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, కలకత్తా చిల్డ్రన్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. త్వరలో విడుదల చేయనున్నాం. ∙‘కొమరం భీమ్’ సినిమాని నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టు డిజిటలైజ్ చేసి మళ్లీ తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నా.
► నా దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్‌లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. వ్యవసాయం, ఆరోగ్యంపై చైతన్యం వచ్చేలా నేను తీసిన షార్ట్స్ ఫిల్మ్స్‌కి మంచి పేరొచ్చింది. ఇటీవల వచ్చిన ‘మల్లేశం’ సినిమా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలి.
► ప్రస్తుతం సమాజంలో 9 నెలల పసికందు నుంచి 90ఏళ్ల మహిళలపై ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? అనే అంశంపై ఓ టీనేజ్ గర్ల్ పరిశోధన చేశారు. నా దర్శకత్వంలో దాన్ని సినిమాగా చేస్తున్నాం. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం చేయనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment