అనుమానాల్లో నిజం లేకపోలేదు..
- మంచి చిత్రాలను అవార్డులు రాకపోవడంపై కళాతపస్వి కె. విశ్వనాథ్
- దాదా సాహెబ్ పురస్కారాన్ని అందుకోవడం అశ్యర్యం ఉంది
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. పలు చిత్ర పరిశ్రమలను జాతీయ అవార్డు కమిటీ సభ్యులు చిన్నచూపు చూస్తారన్న భావన ప్రజల్లో ఉండేదన్నారు. కొన్ని పరిశ్రమలకు చెందిన చిత్రాలు బాగా లేకున్నా జ్యూరీ సభ్యులు ఎంపిక సందర్భంగా వాటిని చివరి వరకూ వీక్షించి అవార్డులకు ఎంపిక చేస్తున్నారని, మంచి చిత్రాలను సగం రీలే చూసి వాటిని పక్కనపెట్టేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు.
కొన్ని పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు తప్పవన్నారు. ఇందులో నిజం లేకపోలేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం చిత్ర పరిశ్రమలో అత్యున్నత పుస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్‌రాయిస్ ఇస్తే ఎలా భ్రమలో ఉంటాడో.. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన అన్నారు.
ఈ పుస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తన తల్లిదండ్రులను స్మరించుకుంటున్నట్టు చెప్పారు. ఈ పురస్కారాన్ని తనకే అంకితం ఇచ్చుకుంటున్నట్టు చెప్పారు. తాను ఏ నిబద్ధతతో దర్శకత్వం ప్రారంభించానో.. అదే నిబద్ధతతో అందరూ మెచ్చే ఆరోగ్యకరమైన చిత్రాలు తీసిన దర్శకునిగా మాత్రమే వైదొలుగుతానని చెప్పారు. తన తీరుకు అనుగుణంగా చిత్రాలు తీయండలో నిర్మాతలు ఎంతగానో సహకరించారని, తప్పులేవైనా ఉంటే అది తన బాధ్యతేనని ఆయన చెప్పారు.
తెలుగు చిత్రాల హవా కొనసాగుతుంది
ఇక నుంచి జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. తెలుగు చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కేలా బాహుబలి కృషి చేసిందన్నారు.
మంచి చిత్రాన్ని ప్రాంతీయ భేదం లేకుండా ఆదరిస్తారు
మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీస్ వేగ్నేష్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శుభపరిణామమన్నారు. ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలు వస్తే ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అవార్డు వచ్చే చిత్రాలకు డబ్బురావు, డబ్బులు వచ్చే చిత్రానికి అవార్డు రావు అన్న అభిప్రాయానికి ప్రస్తుతం కాలం చెల్లిందన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి చిత్రాలు తీస్తే అవార్డులతో పాటు కలెక్షన్లు కూడా వస్తాయని పేర్కొన్నారు.
చిన్న చిత్రం.. పెద్ద గుర్తింపు
చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని పెళ్లిచూపుల నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు. తమ మొదటి చిత్రానికి జాతీయ అవార్డు అందుకోనుండడంపై వారు అనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యతులో మరిన్ని మంచి చిత్రాలు నిర్మిస్తామని వారు తెలిపారు.