ఆ నవ్వు కోసమే...మళ్లీ మహేశ్ డేట్స్..! | Director koratala siva latest interview | Sakshi
Sakshi News home page

ఆ నవ్వు కోసమే...మళ్లీ మహేశ్ డేట్స్..!

Published Tue, Jul 28 2015 10:56 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

ఆ నవ్వు కోసమే...మళ్లీ మహేశ్ డేట్స్..! - Sakshi

ఆ నవ్వు కోసమే...మళ్లీ మహేశ్ డేట్స్..!

తొలి చిత్రం ‘మిర్చి’తోనే స్టయిలిష్ డెరైక్టర్ అనిపించుకున్నారు కొరటాల శివ.

స్టోరీ వేల్యూకి స్టార్ వేల్యూ యాడ్ అయితే వండర్స్ సృష్టించొచ్చునంటున్న శివ,

‘శ్రీమంతుడు’తో బాక్సాఫీస్‌ని కొల్లగొడతామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

వచ్చే నెల 7న విడుదలకు సిద్ధమవుతోన్న ‘శ్రీమంతుడు’ గురించి

కొరటాల శివ మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలు ప్రస్తావించారు.
 
 ‘బాహుబలి’ కారణంగా మీ ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చినందుకు నిరుత్సాహపడ్డారా?
 అలాంటిదేంలేదు. ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ ప్రొడక్షన్‌కి ఓ మూడు వారాలు టైమ్ దొరికింది. ’బాహుబలి’ అంటే రెస్పెక్ట్ ఉంది. చాలా పెద్ద సినిమా. వాయిదా వేయడం ద్వారా మేమేదో ఫేవర్ చేసినట్లు చెప్పడంలేదు. వాళ్లు మూడేళ్లు కష్టపడి చేశారు. మా హీరో మహేశ్‌బాబు, నేను, నిర్మాతలు... మేమందరం ‘బాహుబలి’ యూనిట్ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. నిజంగానే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మేమంతా హ్యాపీ.
 
 ‘బాహుబలి’ అంత బడ్జెట్‌తో తీయకపోయినా.. తదుపరి విడుదలయ్యే ప్రతి సినిమా వసూళ్లను ఆ చిత్రం వసూళ్లతో కంపేర్ చేస్తుంటారు కదా?
 నేనసలు వసూళ్ల గురించి పట్టించుకోను. సినిమా బాగుందని ప్రేక్షకులు అన్నాక ఆటోమేటిక్‌గా వసూళ్లు బాగుంటాయి. నా స్వార్థం ఎంతసేపూ ఏంటంటే.. అందరూ సినిమా బాగుంది అనాలి. బాగున్న సినిమాకి వసూళ్లు ఆగమన్నా ఆగవు.
 
 గత రెండు చిత్రాలు నిరుత్సాహపరిచాయని, ఈసారి అలా కాకూడదని మహేశ్‌బాబు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మీతో అన్నారా?
 బయట మనకు కనిపించే మహేశ్‌బాబు సీరియస్‌గా ఉంటారు. కానీ, నిజానికి ఆయనంత సరదా మనిషి ఎవరూ ఉండరు. డిసప్పాయింట్‌మెంట్స్‌ని కూడా ఆయన సీరియస్‌గా కాకుండా కామెడీగా చూస్తారు. ‘ఏదో మంచి ప్రయత్నం చేయాలని చేశాం అండీ.. పక్కకు నెట్టేశారు’ అని సరదాగా అంటారు. చాలా లైట్ హార్టెడ్. హ్యూమర్‌ని బాగా ఇష్టపడతారు.
 
 మహేశ్ బాగా జోక్స్ వేస్తారట కదా?
 ఆయన జోక్స్ బాగా పేలుస్తారు. మొదటి రోజు నుంచీ సినిమా పూర్తయ్యే వరకూ క్షణానికో జోక్ వినిపించేది. అలా మాట్లాడి ఇలా తిరిగే లోపు ఓ పంచ్ వదులుతారు. వాళ్లు వీళ్లూ అని కాదు.. లైట్ బోయ్స్‌తో కూడా జోక్‌లేసి నవ్వుతుంటారు. ఉదయం లొకేషన్‌కి రావడమే నవ్వుతూ వస్తారు. ఇక, రోజంతా ఆ నవ్వు కంటిన్యూ అవుతుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుందంటే నిర్మాతలు ‘ఈ నవ్వు మిస్ అయిపోతామండి. ఆ నవ్వు కోసమే మళ్లీ మహేశ్ డేట్స్ ఇస్తే బాగుండు’ అన్నారు. దాన్నిబట్టి ఎంత బాగా షూటింగ్ చేశామో ఊహించుకోవచ్చు.
 
 ఈ చిత్రంలో మహేశ్ ఏడు రకాల లుక్స్‌లో కనిపిస్తారట?
 ‘దశావతారం’లా గెటప్స్‌లో కనిపించరు. టీ షర్ట్, పంచె, హెడ్ బ్యాండ్.. ఇలా సీన్‌కి తగ్గట్టుగా కనిపిస్తారు. వాటినే ఏడు రకాల లుక్స్ అని డిజైనర్స్ చెప్పి ఉంటారు.
 
 ‘శ్రీమంతుడు’గా కనిపించడానికి ఫిజికల్‌గా వర్కవుట్ చేసినట్లు అనిపిస్తోంది?
 ఏమీ లేదు. స్వతహాగానే ఆయన ఫిట్‌నెస్ ఫ్రీక్. ఈ క్యారెక్టర్‌కి ఫిట్‌గా, నీట్‌గా కనిపించాలనన్నాను.. అంతే. సినిమాలో వేల కోట్ల అధిపతి అయినా సింపుల్‌గా కనిపించే క్యారెక్టర్. మహేశ్‌బాబు గొప్పతనం ఏంటంటే.. పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ అయిపోతారు.
 
 ఈ సినిమాకి ఓ నిర్మాతగా కూడా మహేశ్ వ్యవహరించారు... మరి బడ్జెట్ విషయంలో రాజీపడాలని చెప్పారా?
 అసలలాంటిది ఆయనకు తెలియదు. రాజీపడరు. వాస్తవానికి ఆడియో ఫంక్షన్ రోజున మహేశ్‌బాబు ‘ఎంబి’ బేనర్ లాంచ్‌ని మేం గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. మహేశ్‌బాబు సంస్థలో రూపొందిన మొదటి సినిమా మాది కావడం మాకు ఆనందంగా అనిపించింది. అందుకే, బేనర్ లాంచ్‌ని గ్రాండ్‌గా చేయాలనుకున్నాం. అదే విషయం మహేశ్‌బాబుతో అంటే, ‘ఒక బేనర్ పెట్టాం. టైటిల్ కార్డ్స్‌లో ‘ఎంబి’ అని వస్తుంది. అది చాలు. లాంచ్ ఎందుకు? అలాగే నాన్నగారి 50 ఏళ్ల సన్మానం కూడా సింపుల్‌గా చాలు’ అన్నారు. ఈ సింప్లిసిటీ అంతా కృష్ణగారి దగ్గర్నుంచే వచ్చిందనిపించింది. కృష్ణగారు కూడా చాలా సింపుల్‌గా ఉంటారు.. క్లుప్తంగా మాట్లాడతారు.
 
 ‘శ్రీమంతుడు’ అంటే టాలీవుడ్‌లో మహేశ్‌బాబు మాత్రమే పనికొస్తారా?
 ‘ఇండియాలో మహేశ్‌బాబు వన్నాఫ్ ది బెస్ట్ యాక్టర్స్’. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకలా అనిపించింది. ఈ సినిమాకి మహేశ్‌బాబు బెస్ట్ చాయిస్. అది మాత్రం చెప్పగలను. పర్‌ఫెక్ట్ ఆర్టిస్ట్. నేను చెప్పిన సీన్‌కి ప్రాణం పోశారు. ప్రేక్షకులు చూసే ముందు ఓ దర్శకుడిగా ఈ సినిమా చూసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మహేశ్‌బాబు బెస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. ఇంటెలిజెంట్ ఆర్టిస్ట్. కో ఆర్టిస్ట్‌కు ఎంత కంఫర్ట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు.
 
 ఊరిని దత్తత తీసుకోవడం అనే ఈ సినిమా కాన్సెప్ట్‌ని రియల్‌గా కూడా మహేశ్ ఆచరించడం పట్ల మీ అభిప్రాయం?
 వాస్తవానికి ‘ఆగడు’ టైమ్‌లోనే నేనీ కాన్సెప్ట్ అనుకున్నా. ఈ కథకు ఎలాంటి ఇన్‌స్పిరేషన్ లేదు. మరి.. మహేశ్‌బాబు గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకోవడానికి ఏ విషయం ఆదర్శంగా నిలిచిందో నాకు తెలియదు. ఏదేమైనా మంచి విషయం కాబట్టి, హ్యాపీగా ఉంది. ఆ సంగతలా ఉంచితే, ఈ చిత్రకథ వినగానే టెక్నిషియన్స్ ఎవరు? అనడిగారు. అంతగా నచ్చిందాయనకు.
 
 జగపతిబాబు చేసిన తండ్రి పాత్ర గురించి?
 ఇందులో తండ్రి పాత్ర చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. చాలా రిచ్‌గా కనిపించాలి. ఎవరైతే బాగుంటారా? అనుకుంటున్నప్పుడు ‘లెజెండ్’ విడుదలైంది. విలన్‌గా చేశారు కదా, క్యారెక్టర్ నచ్చితే ఈ సినిమా ఒప్పుకుంటారేమో అనిపించింది. ఆ హుందాతనం, రిచ్‌నెస్ జగపతిబాబుగారిలో ఉన్నాయి. తండ్రి పాత్రకు ఆయన్ను అడుగుదామని మహేశ్‌బాబుతో అంటే, ‘ఆయనకన్నా బెస్ట్ ఎవరు? అన్నారు. జగపతిబాబుగారు కథ వినగానే ఓకే చెప్పేశారు.
 
 తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కదా... అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కూడా ఈ చిత్రం ఉంటుందా?
 ఈ కథ యూనివర్శల్. ఎవరికైనా నచ్చుతుంది. తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో విడుదల చేస్తున్నాం. తమిళ డైలాగ్స్ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకున్నాం.
 
 మీ తదుపరి
 రెండు, మూడు కథలు రెడీ చేశాను. ఎవరితో చేస్తానన్నది తర్వాత చెబుతాను.
 
 ప్రభాస్, మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తోనేనా? కొత్తవాళ్లతో కూడా చేస్తారా?
 కొత్తవాళ్లతో చేయాలని ఉంది. ‘సీతాకోక చిలుక’ వంటి లవ్‌స్టోరీ తీయాలనే ఆకాంక్ష ఉంది.
 
 ‘మిర్చి’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం వస్తే, మీరు ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ సినిమాకి అవకాశం వస్తే?
 నాకు రీమేక్స్ మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకసారి చూపించిన కథను మళ్లీ చూపించడమా? అనుకుంటాను. అందుకే ‘మిర్చి’ అంగీకరించలేదు. కొత్త కొత్త కథలు చూపించడం ఎక్కువ ఇష్టం. మరీ తప్పదనుకుంటే అప్పుడు రీమేక్ గురించి ఆలోచిస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement