మారుతి
‘‘ఈ రోజుల్లో’ సినిమా ముందు వరకూ సినిమా తీయడమే నా లక్ష్యం. ఆ సినిమాతో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలను నా శక్తి మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాల్లో తన ప్రయాణం గురించి మారుతి పంచుకున్న విశేషాలు...
► ‘ఈరోజుల్లో’ సమయంలో నా స్కిల్‌ని నమ్మడానికి ఒక డీవీడీలా అయినా ఆ సినిమా ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత మనల్ని నమ్మి నిర్మాతలు డబ్బులు పెడితే చాలనిపించింది. ఆ తర్వాత కొంచెం ఎక్కువ పారితోషికం వస్తే బావుండు అనిపించింది. ఇప్పుడు నేను ఏ హీరోతో సినిమా చేసినా అతనికి కెరీర్ బెస్ట్ సినిమా ఇవ్వాలి అనుకుంటున్నాను.
► ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నేను చేస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ సినిమా విషయానికి వస్తే చాలా తక్కువ రోజుల్లో రాసిన కథ ఇది. చాలా నిజాయతీ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ కథ. కుటుంబ ప్రేక్షకులకు 100 శాతం కనెక్ట్ అవుతుంది. కథ వినగానే తేజు చాలా ఎగ్జయిట్ అయ్యాడు. సమాజానికి అద్దం పట్టేలా కథ ఉంటుంది. మనల్ని మనం నిలదీసుకునేలా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ‘ఈరోజుల్లో, బస్‌స్టాప్’ సినిమాల్లో కూడా సొసైటీలో ఏం జరుగుతుందో అదే చూపించాను.
► మనం పుట్టినప్పటి నుంచి ప్రతి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. మరి చావుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోం? జీవితంలో వచ్చే చివరి వేడుక చావు. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.. వయసు పైబడుతున్న వాళ్లకు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ చుట్టూ ‘ప్రతి రోజూ పండగే’ సినిమా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ పుట్టినరోజులానే అనిపించింది. సెట్లో ప్రతి రోజూ 18–20 మంది ఆర్టిస్ట్‌లు ఉండేవారు. ప్రతిరోజూ పండగలానే గడిచిపోయింది.
► ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం వల్గారిటీనే టార్గెట్ చేసి ఆడియన్స్‌ను రప్పించాలనుకుంటున్నారు. నా తొలి సినిమాల్లో నేనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టాను. అదే సినిమాను నడిపించదు.
► మారుతి టాకీస్ బ్యానర్లో చిన్న సినిమాలు ఆపేశాను. సినిమా తీస్తున్నప్పుడు మన పూర్తి శ్రద్ధ అందులోనే పెట్టాలి. అలా వీలు కానప్పుడు సినిమా చేయకూడదు. అందుకే జీఏ2, యూవీ బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ‘మహానుభావుడు’ సినిమా హిందీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయి. నేనే దర్శకత్వం వహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment