
ఆ కథ తొలుత చిరంజీవిగారికే చెప్పా!
‘భలే భలే మగాడివోయ్’ సినిమా మారుతి లైఫ్‌ను భలే మలుపు తిప్పింది. అంతుకుముందు అతనిపై ఉన్న బ్యాడ్ ఇమేజ్‌నంతా ఈ సినమా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు మారుతిపై ఆడియన్స్‌లో ఓ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇండస్ట్రీలో కూడా సేమ్ టు సేమ్. స్వయంకృషితో ఈ స్థాయికెదిగిన మారుతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కబుర్లు.
‘భలే భలే మగాడివోయ్’ కథ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని ఆలోచించకుండా రాసుకుంటూ వెళ్లిపోయాను. ఈ కథకు నానియే కరెక్ట్ అనుకున్నాను. ముందు తనకే ఈ కథ చెప్పాను. నాని ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్నాడు. ప్రేక్షకులందరూ నానిలో తమను తాము చూసుకున్నారు. నేను నమ్మినదాన్ని ప్రేక్షకులు అంగీకరించడం చాలా ఆనందంగా అనిపించింది. గత ఏడాది నేను పుట్టినరోజు జరుపుకోలేదు. ఎవరికీ తెలీదు కూడా. కానీ, ఈ బర్త్‌డే జరుపుకోవడానికి మంచి కారణం ఉంది. అదే ‘భలే భలే మగాడివోయ్’. ఈ చిత్రంతో ఓవర్సీస్‌లో కూడా జెండా పాతినందుకు ఇంకా ఆనందంగా ఉంది.
ఎక్స్‌పెక్ట్ చేయనిది ఇవ్వాలనుకుంటాను
నేను ఏ జానర్‌లోనైనా సినిమా తీయగలను. నా మీద ఓ ముద్ర పడటం ఇష్టం లేదు. నేనేం చేసినా నా ఫ్యామిలీ కోసమే చేశాను. వాళ్లను పోషించడానికి పడిన కష్టమిది. మెకానిక్‌గా, ఆర్ఙిస్ట్‌గా ఇలా ఏ పని చేసినా అక్కడే ఆగిపోవాలనుకోలేదు. ఇప్పుడు నేను డెరైక్షన్ చేస్తున్నాను. ఎప్పుడూ నేను నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడానికి చేసే ప్రయత్నమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.
బన్నీ, వెంకటేశ్‌ల కోసం కథలు రెడీ చేస్తున్నా
బన్నీ మంచి కథ చెప్పమని అడుగుతున్నాడు. నేను ఓ మంచి డెరైక్టర్‌గా ప్రూవ్ చేసుకుని అతని దగ్గరికి వెళ్లాలనుకున్నాను. ఫ్రెండ్‌షిప్ అనే ట్యాగ్‌తో వెళ్లడం నాకు ఇష్టం లేదు. వెంకటేశ్‌గారికి కూడా కథ రాస్తున్నా. అప్పట్లో అనుకున్న ‘రాధ’ సినిమా అయితే ఉండదు. ఒకసారి డిస్టర్బ్ అయ్యాక దాని జోలికి మాత్రం వెళ్లలేను.
నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేవి చిన్న సినిమాలే
చిన్న సినిమా హిట్ చేయించడమే కష్టం. థియేటర్‌కు రప్పించి, ప్రేక్షకుల దగ్గర డబ్బులు వసూలు చే యాలి. పెద్ద సినిమాలకు అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మనం చిన్న తప్పులు చేసినా, హీరోల మీద అభిమానంతో తప్పులు పెద్ద పట్టించుకోరు. చిన్న సినిమాలకు అలా కాదు. చిన్న సినిమా బతికేతేనే ఇండస్ట్రీ నెక్ట్స్ లెవెలకు వెళుతుంది. చిన్న సినిమా ఎలా తీసినా చెల్లుతుందన్న అపోహలో చాలా మంది ఉన్నారు. దాని వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. అది చిన్న సినిమా కావచ్చు, క్వాలిటీ చిత్రాలను ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ కోవలో ఉన్న ‘స్వామి రారా’, ‘ఉయ్యాల జంపాల’ ఇవన్నీ మంచి హిట్ అయ్యాయి. చిన్న సినిమాలకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద సినిమాలకు కూడా రాదు.
మళ్లీ నిర్మాణమంటే ఆలోచిస్తా
కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వాలని నేను కొన్ని తప్పులు చేశాను. దాని వల్ల ఆ సినిమాల అవుట్‌పుట్ కూడా నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఆ కారణంగా కొంత డిస్టర్బ్ అయ్యాను. చిన్న సినిమా చేసినా నాకు నచ్చితే, కాన్సెప్ట్ బాగుంటే వాటిని నిర్మిస్తాను.
ఆ హీరోలందరూ అభినందించారు
‘భలే భలే మగాడివోయ్’ చూసి మహేశ్‌బాబు, ప్రభాస్ అందరూ అభినందించారు. చరణ్ అయితే అరగంట సేపు మాట్లాడారు. మొదట ఈ సినిమా కథ చిరంజీవిగారికే చెప్పాను. బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు.