నెలకు ఎనభై వేలు సంపాదించే సాఫ్ట్‌వేర్ అమ్మాయి పనీపాటా లేని అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ప్రేయసిని ఆ ప్రేమికుడు అడిగే ప్రశ్నలు, సందేహాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సాఫ్ట్‌వేర్ అమ్మాయి, ఈ నిరుద్యోగి కుర్రాడి లవ్‌స్టోరీలో మలుపులు ఏంటి? ఆ కుర్రాడికి ఉద్యోగం దొరుకుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘తారామణి’.
తెలుగమ్మాయి అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధానపాత్రల్లో రామ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి. వెంకటేశ్ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానుభావుడు’ రీ రికార్డింగ్ సమయంలో ‘తారామణి’ చూశా. మంచి సినిమా. చాలా బాగుంది.
ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో రామ్ ఈ సినిమా అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ప్రతి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడానికి ఎవడో ఒకడు వస్తుంటాడు. అలాంటి వ్యక్తి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సినిమా అవగాహన కల్పిస్తుంది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి. వెంకటేశ్. నిర్మాతలు బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment