ఓంకార్
‘‘నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. కథ నచ్చితేనే ప్రేక్షకులు హిట్ చేస్తారు. ‘రాజుగారి గది 3’ సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. తప్పక విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఓంకార్. అశ్విన్‌బాబు, అవికా గోర్ జంటగా ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారిగది 3’. ఈ చిత్రం నేడు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన విశేషాలు.
► ‘రాజుగారి గది’ (2015) విజయానికి ఆ సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలే కారణం. అందులో మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ‘రాజుగారి గది 2’ (2017)లో మంచి సందేశం ఉంది కానీ వినోదాన్ని మిస్సయ్యాం అని ప్రేక్షకులు అన్నారు. ‘రాజుగారి గది 3’ మంచి వినోదాన్ని అందిస్తుంది.
► ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడే నా తమ్ముడు అశ్విన్ హీరోగా సరిపోతాడనిపించింది. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాక, ఇతర సినిమాల్లోనూ అశ్విన్ నటించాడు. కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రాజుగారి గది 3’ తర్వాత అశ్విన్‌కు హీరోగా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. అవికా అద్భుతంగా నటించింది.
► ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్, తాప్సీలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా అవికాను తీసుకున్నాం. కథలో కూడా కొన్ని మార్పులు చేశాం. కానీ తమన్నాకు నేను చెప్పిన కథ వేరే. ఈ కథతో ఓ అగ్ర కథానాయికతో భవిష్యత్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ‘రాజుగారి గది 2’ సినిమాను వెంకటేశ్‌గారితో తెరకెక్కించాలనుకున్నా. వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉండటం వల్ల నాగార్జునగారితో తీశాం. వెంకటేశ్‌గారితో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ‘రాజుగారి గది’ సిరీస్‌లో ఓ చిత్రాన్ని ఆయనతో చేయాలని ఉంది.
► నేను అక్టోబరులో పుట్టాను. ‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తోన్న ప్రతి సినిమా అక్టోబరులోనే విడుదలవుతోంది. ‘రాజుగారి గది 3’ సినిమా నాకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడినిగానే కొనసాగుతాను.
► నేను చేస్తోన్న ఓ రియాలిటీ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా దగ్గర ‘రాజుగారి గది 4’ కథతో పాటు, ఓ క్రీడా నేపథ్యంలో సాగే కథ ఉంది. వీటిలో ఏ సినిమా ముందు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment