
నాకు అడవిలో ఉన్నట్లుగానే ఉండాలి!
పూరి జగన్నాథ్... సక్సెస్‌కు పొంగిపోడు, ఫెయిల్యూర్‌కి లొంగిపోడు. కోట్లు పోయినా, పట్టించుకోనివాడు కుక్కపిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పూరి లైఫ్‌లో గొప్ప స్క్రీన్‌ప్లే కనిపిస్తుంది.
పూరి మాటల్లో గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది. ‘లోఫర్’ రిలీజ్ సందర్భంగా పూరితో స్పెషల్ టాక్...
ఏంటి...ఎప్పుడు చూసినా గడ్డంతో కనిపిస్తారు.. తీరిక లేకా.. స్టయిలా?
నాకిష్టమైనవాళ్లందరూ గడ్డంతో ఉన్నందువల్లో ఏమో గడ్డం అంటే నాకిష్టం ఏర్పడింది. నేనిష్టంగా చదివే రచయితలు చలం గారు, ఆచార్య రజనీష్, కమ్యూనిస్ట్ లీడర్ లెనిన్ - అందరికీ గడ్డం ఉండేది. చిన్నప్పుడు త్వరగా గడ్డం వచ్చేస్తే బాగుండనుకునేవాణ్ణి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డం కంపల్సరీ అనిపించింది. నాది కొంచెం బేబీ ఫేస్. ఇండస్ట్రీలో ఎవరికైనా కథలు చెప్పడానికి వెళ్లినప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని వెళితే ‘వీడు పిల్లాడులా ఉన్నాడు. వీడికేం తెలియదు’ అనుకుంటారని భయం. గడ్డం ఉండేలా చూసుకునేవాణ్ణి. అలాగే కంటిన్యూ అవుతున్నా. బేసిక్‌గా క్లీన్‌గా ఉండడం ఇష్టం ఉండదు. నాకు అడవిలో ఉన్నట్లుగానే ఉండాలి (నవ్వు).
మీ పిల్లలు ‘ఎప్పుడూ గడ్డం ఏంటి నాన్నా’ అని అనలేదా? మీ ఆవిడ?
నాకు రగ్గ్‌డ్‌గా కనిపించడం ఇష్టం. మా ఆవిడకీ, నా పిల్లలకీ అదే ఇష్టం. నేనెప్పుడైనా గడ్డం తీసినా వాళ్లే పెంచమని అడుగుతుంటారు.
ఓకే. ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో మదర్ క్యారెక్టర్‌ని ట్రెండీగా చూపించారు. మరి.. ‘లోఫర్’ అమ్మ ఎలా ఉంటుంది?
ఈ అమ్మ ట్రెండీ కాదు. ఆ సినిమాలోకన్నా ఎక్కువ ఎమోషన్ ఉన్న మదర్. పల్లెటూరి అమ్మ. నేను తీసిన మొదటి పల్లెటూరి సినిమా ఇది. రేవతిగారు కమర్షియల్ సినిమాలు చేయరు కాబట్టి, వెనకాడారు. కథ విని, ఒప్పుకున్నారు. లౌడ్‌గా ఉన్న సీన్స్‌లో నటించేటప్పుడు ‘నా లైఫ్‌లో నేనిలాంటి సీన్స్ చేయలేదు. నీ మీద నమ్మకంతో చేస్తున్నా’ అన్నారావిడ.
అమ్మగారి గురించి తెలుసుకోవాలని ఉంది. మిమ్మల్ని ఎలా పెంచారు?
నా చిన్నప్పుడు అమ్మకు సహాయం చేసేవాణ్ణి. అమ్మ వంట చేస్తుంటే కూరగాయలు తరిగిచ్చేవాణ్ణి. ఇంటి పనులు చేసిపెట్టేవాణ్ణి. నా ఐదో తరగతి అప్పుడే నాకు వంట తెలుసు.ఎప్పుడైనా అమ్మకు కుదరకపోతే వంట కూడా చేసేవాణ్ణి. అప్పట్నుంచీ ఇప్పటివరకూ మంచి కొడుకునే. మా అమ్మ వెరీ స్ట్రాంగ్ ఉమన్. ఎప్పుడో కానీ ఆమెకు కన్నీళ్లు రావు. మరీ బాధ అనిపిస్తే తప్ప ఏడవదు. అది ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది.
మీరు కూడా మీ అమ్మగారిలా మరీ బాధ అనిపిస్తేనే ఏడుస్తారా?
అవును. కన్నీళ్లు తప్పించుకుని ఎవరూ బతకలేం. అది సత్యం. కానీ, కన్నీళ్లకూ కారణం ఉండాలి. అప్పుడే ఆ ఏడుపుకి ఓ విలువ ఉంటుంది.
జీవితంలో మీరు విపరీతంగా ఏడ్చిన సందర్భం ఏదైనా...?
ఉంది. ఎప్పుడూ ఏడ్వనంతగా ఆ రోజు ఏడ్చాను. ఆస్తులు పోయాయి. ఆఫీసూ, ఇల్లూ అమ్మేశాను. అప్పటివరకూ ముద్దుగా పెంచుకున్న పది కుక్కలకు ఆహారం పెట్టడం కూడా భారం అయ్యింది. ఒకతన్ని పిలిచి ఆ కుక్కలు ఇచ్చేశా. అప్పుడు విపరీతంగా ఏడ్చా. కుక్కల్ని తీసుకుంటున్న వ్యక్తి కూడా ఏడ్చేశాడు. నా లైఫ్‌లో పెద్ద ఏడుపు అదే.
అప్పుడనిపించిందా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని?
జీవితంలో మొదటిసారి అలా అనుకున్నా. అంతకు ముందు డబ్బు మీద పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. మనకేదంటే ఇంట్రస్ట్ లేదో అది మన దగ్గర ఉండదని అప్పుడు అర్థమైంది. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాలు నాతోనే ఉన్నాయి. డబ్బు మాత్రం పోయింది.
ఇది జరిగి ఎన్నేళ్లయింది? ఆ తర్వాత నుంచీ పొదుపుగా ఉంటున్నారా?
జస్ట్ ఏడెనిమిదేళ్లయ్యింది. అంతే. ఎక్స్‌పెన్సెస్ తగ్గించలేదు కానీ, ఇన్‌కమ్ పెంచాలని ఫిక్స్ అయ్యాను. అసలు నా ఖర్చులెంత? రెగ్యులర్‌గా చేసేదాని కన్నా ఒక సినిమా ఎక్కువ చేశాననుకోండి... ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే ఎక్కువ పని చేద్దామనుకున్నా.
ఫెయిల్యూర్స్ పరంగా బాగా బాధపెట్టిన సినిమా ఏది?
‘నేనింతే’ అప్పుడు బాగా బాధపడ్డా. మంచి సినిమా. కానీ, ఎవరూ చూడలేదు. ఆ సినిమా నిజాయతీగా ఉంటుంది. ‘రూపాయి సంపాదించ లేని ఏ ఎధవకీ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పే అర్హత లేదు’ అనే డైలాగ్ ఆ సినిమాలో ఉంటుంది. ఆ డైలాగ్‌కి యూత్ అంతా హర్ట్ అవుతారు. ఎందు కంటే, వయసులో ఉన్నప్పుడు ఎవరూ సంపాదించలేరు. అలా ఆ సినిమాలో కొన్ని నిజాలు చెప్పడం డెజైస్ట్ అయ్యుండదేమో. నేనిప్పటి వరకూ చేసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఏందంటే - ‘నేనింతే’నే.
మళ్లీ ‘లోఫర్’కు వద్దాం. ఇది ఎలాంటి సినిమా?
ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, పోసాని, రేవతిల కాంబినేషన్ బాగుం టుంది. రేవతి మహా తల్లి. పోసాని చండాలమైన తండ్రి. ఈ రెండూ సమ పాళ్లల్లో పుణికి పుచ్చుకున్న కొడుకు వరుణ్‌తేజ్. కాంబినేషన్ సీన్స్ టచింగ్‌గా ఉంటాయి. ముగ్గురూ బతికే ఉంటారు. కానీ, ఒకళ్లు చనిపోయారని మరొకరు చెప్పుకుంటుంటారు.
ఈ ‘లోఫర్’లో మీ లక్షణాలేమైనా ఉన్నాయా?
కొన్ని ఉంటాయి. ఎవరు కథ రాసినా వాడి తాలూకు షేడ్స్ కొన్ని ఉంటాయి. మీరు కథ రాస్తే, మీ లక్షణాలు ఎక్కడో ఆ కథలో ఉంటాయి.
హీరోలు ఇడియట్, పోకిరి, లోఫర్ ఇలా ఎందుకు, మంచిగా ఉండొచ్చుగా?
మంచిగా ఉండకపోవడమే మంచిది. ఇవాళ మంచివాళ్లను చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. నా హీరోలు ఇప్పుడు ప్రపంచానికి తగ్గట్టు ఉంటారు. ‘ఎండ్ ఆఫ్ ది మూవీ’ ఇడియట్, పోకిరి, లోఫర్ మంచివాళ్లేగా (నవ్వు).
వరుణ్‌లో హైట్ కాకుండా మిగతా ప్లస్ పాయింట్స్?
మంచి ఆర్టిస్ట్. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిపోతాడు. సీన్‌కి ఎంతవరకూ కావాలో అంతే చేస్తాడు. సీన్ చేసినంతసేపూ ఆ క్యారెక్టర్‌లానే ఉండిపోతాడు. వరుణ్ కళ్లల్లో మంచి ఫైర్ ఉంది. లోపల కూడా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమాలో నేనేదైతే చూపించానో అంతకన్నా ఎక్కువ ఫైర్ తనలో ఉంది. అది తన కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుంది.
సూపర్‌స్టార్ అవ్వాలంటే మీ చేతిలో పడాల్సిందేనని ‘లోఫర్’ ఆడియో వేడుకలో ప్రభాస్ అన్నారు. మరి, వరుణ్ సంగతేంటి?
కచ్చితంగా.. ‘వరుణ్ సూపర్ స్టార్’ అని స్టాంప్ వేసేయొచ్చు.
నటుడిగా.. వ్యక్తిగా.. వరుణ్ గురించి ఏం చెబుతారు?
ఓ పాటలో వరుణ్ ఏడ్చే సీన్ ఒకటుంది. ఆ పాట చాలు వరుణ్ ఎంత పెద్ద హీరో అవుతాడో చెప్పడానికి. మంచి పొజిషన్‌కి వెళతాడు. వ్యక్తిగా సూపర్. బిహేవియర్ బాగుంటుంది. అది చాలు పెకైదగడానికి.
కథలన్నీ బ్యాంకాక్‌లో రాస్తారట. ఇండియాలో కూడా రాయొచ్చు కదా?
అంతకు ముందు ఇక్కడే రాసేవాణ్ణి. డబ్బొచ్చాక బ్యాంకాక్‌లో రాయడం మొదలుపెట్టా. అక్కడ నాకు కంఫర్ట్‌గా ఉంటుంది.
బ్యాంకాక్ వీధుల్లో మీరు బాగా పాపులర్ అట?
అవును. ఆ మాటకొస్తే నా భార్యా, పిల్లలు కూడా పాపులరే. హాలిడే ట్రిప్ అంటే అక్కడికే వెళుతుంటాం. నా బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు సొంత ఊరిలా, ఇక్కడ ఉన్నప్పుడు ఫారిన్‌లా అనిపిస్తుంది.
మీ గురించి వచ్చే వదంతులకు ఎలా రియాక్ట్ అవుతారు?
బాధపడను. పని చేసేవాళ్ల గురించే కాంట్రవర్సీస్ వస్తాయి. ఏ కాంట్రవర్సీ రాకుండా ఉండాలంటే ఏ పనీ చేయకుండా ఉండాలి.
మరి.. ఇంట్లోవాళ్ల సంగతి?
వాళ్లు కూడా మెల్లిగా అలవాటుపడిపోతారు (నవ్వుతూ).
ఈ మధ్యకాలంలో చిరంజీవిగారిని కలిశారా? ఆయనతో సినిమా ఏమైంది?
కొన్ని రోజుల క్రితం కలిశాను. 150 కాకపోతే 151, 152.. ఏదో ఒకటి చేస్తాను. ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉంటాను. ఒక కథ కాకపోతే.. ఇంకోటి.. ఏదో కథ రాయకుండా ఉండను.
‘చిరంజీవిగారు నాకు చెప్పకుండా, కథ నచ్చలేదని మీడియాతో చెప్పారు’ అని మీరన్న మాటలు ఆయన అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి.
చిరంజీవిగారికీ, నాకూ మధ్య స్నేహం గురించి వాళ్లకు తెలియదుగా.
‘లోఫర్’ గురించి చిరంజీవి గారు ఏమన్నారు?
క్లిప్పింగ్స్ చూసి, వరుణ్ బాగా చేశాడన్నారు. ఎమోషనల్ సీన్ చూసి, ‘ఓ ఆర్టిస్ట్‌గా ఈ సీన్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అన్నారు.
‘లోఫర్’ ఆడియో ఫంక్షన్‌లో అభిమానులు పవన్ కల్యాణ్ అని పదే పదే అరవడం ప్రభాస్‌ని ఇరిటేట్ చేసింది. మీరు కూడా ఇరిటేట్ అయ్యారా?
అయ్యాను. ఎందుకంటే సినిమా గురించి చెప్పడానికి ఫంక్షన్ పెడతాం. అక్కడకొచ్చి అరుస్తుంటే, ఎవరైనా ఇరిటేట్ అవుతారు. అరవ డం వల్ల పవన్ కల్యాణ్‌కే బ్యాడ్‌నేమ్ వస్తుంది. ఫ్యాన్స్‌కి కామన్‌సెన్స్ లేదేమో అనిపిస్తుంది. అలా అరవొద్దని కల్యాణ్ చెప్పినా వింటారో లేదో తెలియదు. కానీ, కల్యాణ్ ఏ ట్విట్టర్‌లోనో ‘ఇలా అరిచి పరువు తీయ కండ్రా’ అని చెబితే ఉపయోగం ఉంటుందేమో. అభిమానులు ఇలా అరవడంవల్ల మా సినిమా గురించి చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాం.
ఫైనల్లీ లైఫ్ ఎలా ఉంది?
హ్యాపీగా ఉంది. తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చేస్తున్నా. మహేశ్ బాబు కోసం ఓ కథ రాస్తున్నా. బిజీ బిజీగా హాయిగా ఉంది.
► ఆ మధ్య నా దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఆడవాళ్లందరికీ నచ్చింది. బాక్సాఫీస్‌లో అనుకున్నంత డబ్బు రాకపోయి ఉండొచ్చు కానీ, మంచి సినిమా అని పేరొచ్చింది. ఒకావిడ అయితే, ఏకంగా ‘జ్యోతిలక్ష్మి’పైన పుస్తకమే రాస్తోంది. అంతకన్నా శాటిస్‌ఫేక్షన్ ఏం ఉంటుంది?
► మా అబ్బాయి ఆకాశ్ గతంలో కొన్ని సినిమాలు చేసినా, మళ్లీ తెరపై కనిపించడానికి మరో మూడేళ్లు పడుతుంది. ప్రస్తుతం చదువుకుంటున్నాడు.