Loafer
-
‘లోఫర్’ వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం
-
‘కేటీఆర్ మాటలు, తీరు జుగుప్సాకరం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ‘లోఫర్ వ్యాఖ్యలు’ చిచ్చును రాజేశాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరుసబెట్టి కేటీఆర్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ మాటలు, తీరు జుగుప్సాకరంగా ఉందని ఆక్షేపించారు. టీఆర్ఎస్ తీరు మారటం లేదు... ‘కేటీఆర్ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను ఖండిస్తున్నా. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు వారికి అలవాటుగా మారాయి. రాజకీయాల్లో సంస్కారం, వ్యవహార తీరును ప్రతీసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. రోజూ నా చుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన్నానా? లేదుకదా!. వారి హోదాకు కూడా గౌరవం ఇస్తున్నా. అలాగే అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి సభ్యతతో మెదగాలని చెబుతున్నా. కానీ, వారి తీరు ఎంత మాత్రం మారటం లేదు’ అని జానారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఓ బ్రోకర్ పార్టీ... సీఎం కేసీఆర్, తెరాస వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం తాను అదే రీతిలో స్పందించవద్దని సూచించానని... కానీ, అది అలుసుగా తీసుకుని ఇలాంటి పదజాలం వాడటం సంస్కారం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. ఇలాంటి మాటల వల్ల రాజకీయ విలువలు దిగజారుతాయన్నారు. ‘మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అన్నప్పుడు... ప్రతిగా తెరాస ఓ బ్రోకర్ పార్టీ అని ఎవరైనా అంటే ఏం చేస్తారు?. మీడియాలో ఆర్భాటం కోసమే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కాలి గోరు తో పోల్చారు. మరి కాళ్ళు పట్టుకున్న సంగతి మరిచిపోయారా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలనూ బాధిస్తుంది’ అని జానారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ పప్పు కాదు... ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని జానా పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కూడా జానారెడ్డి తప్పుబట్టారు.‘130 కోట్ల ప్రజల పార్టీకి రాహుల్ నాయకుడు.. ప్రధాని అవ్వడానికి అవకాశం ఉన్నా త్యాగం చేసిన నేత నేత. గుజరాత్ లో మోడీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదు’ అని జానా తెలిపారు. తాను శుష్క సవాళ్లు చేయనని.. పబ్లిసిటీ కోసం మాట్లాడనని జానారెడ్డి వెల్లడించారు. సీట్లు, సర్వేలు కాదు.. 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నమాటే కదా : ఎమ్మెల్సీ కర్రె సాక్షి, హైదరాబాద్ : జానారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వెంటనే స్పందించింది. ఉన్నమాటంటే కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకనీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలు వాడే భాషనే మంత్రి కేటీఆర్ వాడారు. ఆయన కాంగ్రెస్ గురించి చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం. నిజాలు మాట్లాడితే వారికి సహించటం లేదు అని కర్నె చెప్పారు. ఇక తెలంగాణకు కేసీఆర్ బాహుబలి అయితే.. కాంగ్రెస్ నేతలు కాలకేయ సైన్యంలా మారిందని కర్నె ఎద్దేవా చేశారు. -
అమ్మ... మన మలుపు గెలుపు!
పాటతత్వం అమ్మ.. మన అడుగు అమ్మ.. మన వెలుగు అమ్మ.. మన మలుపు అమ్మ.. మన గెలుపు ఏమని చెప్పాలి... ఎంతని చెప్పాలి... అమ్మ గురించి చెప్పడానికి పదాలు చాలవు. ఈ సృష్టిలో అమ్మే లేకుంటే మనం లేము. అమ్మ గొప్పతనం వర్ణించడానికి ఎన్ని పాటలైనా సరిపోవు. గతంలో అమ్మపై చాలా పాటలొచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘లోఫర్’లో అమ్మపై ఓ పాట చేసే అవకాశం నాకు లభించింది. చిత్రంలో సందర్భం ఏంటంటే... ఊహ తెలియని వయసులోనే తల్లి నుంచి బిడ్డను దూరం చేసేస్తాడు ఓ తండ్రి. ఊహ వచ్చిన తర్వాత ‘నాన్నా.. అమ్మ ఏది?’ అని బిడ్డ అడిగిన ప్రతిసారీ మరణించిందని చెబుతాడు. అమ్మ బతికుందని తెలిసిన తర్వాత ఆ బిడ్డ మనసు పడే వేదనే ఈ పాట. సుద్దాల అశోక్ తేజగారు చాలా గొప్పగా రాశారు. జానపద శైలిలో పాటను స్వరపరచడం వలన ప్రేక్షకులకు సులభంగా చేరువైంది. పాట విన్న ప్రతిసారీ నా కళ్లు చెమర్చుతాయి. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎటువంటి సందర్భం ఎదురైనా... అమ్మ ఎంత ముఖ్యం అనేది పాటలో వివరించారు. సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ నా తలపై సెయ్యే పెట్టి.. నీ కడుపులో పేగును అడుగు మన ఇద్దరి నడుమున ముడి ఏందో.. అది గొంతెత్తి సెప్పుతాది వినుకోవే దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా... బ్రహ్మ గీసిన బొమ్మలే మనుషులంతా. ఆయనే మన తలరాత రాస్తాడని అంటుంటారు. కానీ, ఈ భూమ్మీద మనిషి బొమ్మను గీసేది మాత్రం అమ్మేనండీ. నవమాసాలూ మోసి జన్మనిచ్చిన తర్వాత ఓ వ్యక్తిగా, ఓ మనిషిగా మనల్ని తీర్చిదిద్దడంలో, అడుగులు వేయించడంలోనూ అమ్మ పాత్ర అనిర్వచనీయం. ప్రపంచంతో, పరిస్థితులతో పనిలేదు. అమ్మ ఉంటే చాలు. మంచి మనిషిగా ఎదుగుతాం. చిన్నారి బాధ ఏంటో? అమ్మ పేగుకి తెలుస్తుందంటారు కదా. దాన్ని, ‘నీతో ఉంటే చాలమ్మా..’ తర్వాత ‘ఎలో.. ఎలో.. నీ ఊగింది. ఒడి ఊయలలోనే’ అని సన్నివేశానికి అనుగుణంగా చెప్పారు. కాళ్ల మీద బజ్జొబెట్టి లాలపోసినావు ఏమో.. మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తొకొస్తనేమో సూడు యెండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి.. నింగి చందమామను నువ్వు పిల్వలేదా అవునో కాదంటే నువ్వు అడగవమ్మా.. మబ్బు సినుకై సెప్పుతాది యెన్నెలమ్మ దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..! ఈ చరణంలో తనను గుర్తుపట్టని తల్లిని ‘లాలి’ ‘కాళ్ళు మొక్కుతాను’ ‘ఉగ్గుపాలు’ అని గుర్తుచేసే ప్రయత్నం చేస్తాడు హీరో. మనం ఒక్కసారి గమనిస్తే.. లాలిపోయడం దగ్గర్నుంచి బిడ్డ క్షేమం కోసం ఓ తల్లి ఎంత తపన పడుతుందండీ. ఉగ్గుపాలు పట్టించడంతో పాటు ఊహ తెలిసిన తర్వాత మంచీ చెడూ అన్నీ నేర్పే తొలి గురువు అమ్మే. బిడ్డ జీవితంలో వెలుగులు నింపుతుంది. తల్లి కోడిపిల్లనొచ్చి తన్నుకెల్లే గద్దలెక్క ఎత్తుకెల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలెక్క సెడ్డదారుల్లో నేను ఎల్లినాక.. సెంపదెబ్బ కొట్టెసి మార్చే తల్లిలేక.. ఎట్టాపడితేను అట్టా బతికినానే.. ఇప్పుడు ఇట్టా వస్తే తలుపు మూయబోకే.. దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..! ‘నాన్న నన్ను సరిగ్గా పెంచకపోవడంతోనే చెడ్డదారుల్లో ప్రయాణించాను. చెంపదెబ్బ కొట్టి నన్ను మార్చే తల్లి లేదు. ఎలా పడితే అలా బతికాను’ అంటూ ఆ కొడుకు ఆవేదన వ్యక్తం చేస్తాడు. బిడ్డ తప్పుడు దారిలో ప్రయాణిస్తే.. తల్లి మనసు విలవిల లాడుతుందనే కదా అర్థం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలపై శ్రద్ధ పెట్టడం కొందరు తల్లిదండ్రులకు కుదరడం లేదు. అందువల్ల పిల్లలకు సరైన గెడైన్స్ దొరకడం లేదు. ఆ గెడైన్స్ ఉంటే చెడ్డదారుల్లో వెళ్లే పిల్లల జీవితాలు మంచి మలుపు తీసుకుంటాయి. మంచి మనిషిగా విజయం సాధిస్తారు. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండే అద్భుతమైన పాట ఇది. ‘చాలా మంచి పాట చేశావ్ రా’ అని మా అమ్మానాన్నలు పాట విన్న ప్రతిసారీ చెప్తుంటారు. ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఇటువంటి పాట చేసే సందర్భం కల్పించిన పూరిగారికి, పాట రాసిన సుద్దాల అశోక్ తేజగారికి హ్యాట్సాఫ్. సేకరణ: సత్య పులగం సుద్దాల అశోక్ తేజ, గీత రచయిత సునీల్ కశ్యప్, మ్యూజిక్ డెరైక్టర్ -
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు
మెగా వారసుడు వరుణ్ తేజ్ జోరు పెంచాడు. మాస్ ఇమేజ్ కోసం రిస్క్ చేయకుండా నెమ్మదిగా అడుగులేస్తున్న ఈ ఆరడుగుల అందగాడు 2016లో జోరు పెంచుతున్నాడు. తొలి సినిమా ముకుందతో పరవాలేదనిపించిన వరుణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన కంచె సినిమాతో మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోకపోవటంతో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. మాస్ ఇమేజ్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా చేసినా.. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూడు సినిమాలు వరుణ్‌కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురాకపోయినా విషయం ఉన్న నటుడిగా నిరూపించాయి. అందుకే వరుణ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఈ యంగ్ హీరో మాత్రం కథ ఎంపికలో తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో మరోసారి క్రిష్ దర్శకత్వంలో 'రాయబారి' సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత పండగ చేస్కో సినిమాతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాక ముందే మూడో సినిమాను కూడా కన్ఫామ్ చేసేశాడు. దిల్‌రాజు నిర్మాతగా కొత్త దర్శకుడితో ఈ ఏడాదిలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వరుణ్, ఈ మూడు సినిమాలను 2016లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట మెగా హీరో. -
లో ఫర్ పూరీ ఫ్యాన్స్
సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: పి.జి. విందా, నిర్మాతలు: శ్వేతాలాన, వరుణ్, తేజ, సి.వి. రావు, సి. కల్యాణ్, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ ‘నాన్నా! మా అమ్మ ఏమైంది’ అని అడిగే హీరో. ‘నాన్నా... నీ పెళ్ళాన్నీ... చంపేయనా’ అంటూ కన్నతల్లినే క్రూరంగా చంపే విలన్ కొడుకు! ఇలా దిగమింగుకోవాల్సిన సెంటిమెంట్, మింగుడుపడని యాంటీ సెంటిమెంట్ - రెండూ ఉన్న వెండితెర విచిత్రం ‘లోఫర్’. డబ్బున్న ఇంటి అమ్మాయి లక్ష్మి (రేవతి)ని ప్రేమతో మురిపించి, పెళ్ళి ముగ్గులోకి దింపిన ప్రబుద్ధుడు మురళి (పోసాని). తీరా కొడుకు పుట్టాక, ఆస్తి తెమ్మని భార్యను వేధిస్తాడు. తేను పొమ్మన్న భార్యను వదిలేసి, కన్నబిడ్డను తనతో పాటు ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అతణ్ణీ తనలాగే చేస్తాడు. భార్యకేమో పిల్లాడు చనిపోయాడనీ, పిల్లాడికేమో అమ్మ చనిపోయిందనీ తేలిగ్గా అబద్ధం చెప్పి, నమ్మిస్తాడు. పాతికేళ్ళ తరువాత పిల్లాడు రాజు (వరుణ్‌తేజ్) మోసాలు, దొంగతనాలతో లోఫర్ అవుతాడు. కానీ, అమ్మ ప్రేమ కోసం తపిస్తూ, అమ్మలందరిలో తన అమ్మను చూసుకొంటూ ఉంటాడు. ఇంట్లోవాళ్ళు చేస్తున్న ఇష్టం లేని పెళ్ళి వద్దనుకొని, పారిజాతం అలియాస్ మోనీ (దిశా పాట్నీ) హీరో వాళ్ళున్న జోధ్‌పూర్‌కు వస్తుంది. ఒక వాన కురిసిన వేళ వేడి వయసు పాటలో హీరోకు దగ్గరైపోతుంది. హీరోయిన్ కోసం ఇంట్లోవాళ్ళే విలన్‌లై వెంటపడతారు. ఇంతలో ఆమె మేనత్త (రేవతి) వస్తుంది. చనిపోయిందనుకున్న తన తల్లే ఆమె అని హీరో గుర్తిస్తాడు. కానీ ఈ లోఫర్‌ను తల్లి అసహ్యించుకుంటుంది. హీరో షాక్‌లో ఉండగా ఇంటర్వెల్. అత్తతో కలసి పారిపోతున్న హీరోయిన్ను ఇంటి విలన్లే తీసుకెళ్ళిపోతారు. అమ్మ కోసం హీరో కూడా అక్కడికొస్తాడు. పారిపోయొచ్చిన హీరోయిన్, అన్నయ్యలు తనను వెతికి పట్టుకొని మరీ ఇంటికి తీసుకెళ్ళాక ఎక్కడా ప్రతిఘటించదు. కాపాడడానికి హీరో ఉన్నాడనే ధైర్యం కావచ్చు. విలన్‌లైన హీరోయిన్ తండ్రి, అన్నలతో హీరో ఎలా ఆడుకున్నాడు? అమ్మ ప్రేమనెలా పొందాడన్నది కొంత సెంటిమెంట్, కొండంత యాక్షన్ జోడించిన మిగతా సినిమా. ‘ముకుంద’, ‘కంచె’ ద్వారా సుపరిచితమైన వరుణ్‌తేజ్ ఈ మూడో సినిమాకు మరికొంత మెరుగైనట్లనిపిస్తారు. డ్యాన్సులు, స్టైలింగ్‌లో మునుపటి కన్నా జాగ్రత్త తీసుకున్నారు. వెరసి, కెమేరాకు ఈ వర్ధమాన హీరో, అతనికి ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడుతున్నారు. తెలుగు తెరకు పరిచయమైన దిశా పాట్నీ నటన పాటల్లో చూడాలి. హీరో తండ్రి మురళి పాత్రలో పోసాని కృష్ణ మురళి - ఒక్క దెబ్బతో కామెడీ, విలనిజమ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎదిగారు. కాకపోతే, పాత్రను బట్టి యాక్షనూ కొంత మలుచుకోవాల్సింది. పసిబిడ్డకు దూరమైన తల్లిగా బాధ, కోపం, ఆవేశం లాంటివెన్నో ఉన్న తల్లి పాత్రకు రేవతి తగిన నటి. ఆమెను ఎంచుకున్నట్లే, ఆ ఎమోషన్స పండేలా తగినన్ని సీన్లూ రాసుకోవాల్సింది. ముఖేశ్‌రుషి, అతని కొడుకుల బ్యాచ్, గవ్వలేసే అమ్మాయి పాత్రలు విలనిజమ్ వాతావరణాన్ని మొదట బాగానే క్రియేట్ చేశాయి. కానీ, కథలో హీరోయిజానికి దీటుగా నిలిచే విలన్, విలనిజమ్ కనిపించవు. కామెడీ కోసం సినిమా ఫస్టాఫ్‌లో సప్తగిరి, ధన్‌రాజ్, సెకండాఫ్‌లో హీరోయిన్ను పెళ్ళాడాలని వచ్చే సై్పడర్‌బాబుగా అలీ, ‘శ్రీమంతుడు’ తరహా స్పూఫ్‌తో బ్రహ్మానందం - ఇలా ఫేమస్ కమెడియన్స్‌ను పెట్టారు. నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాను కథా నేపథ్యానికి తగినట్లే, ఎక్కువ భాగం రాజస్థాన్‌లో జోధ్‌పూర్ పరిసరాల్లో తీశారు. అక్కడి రాజప్రాసాదాలు, ఆ పరిసరాలు చూపడంలో, పాటల చిత్రీకరణలో కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘నువ్వేడేస్తుంటే పిల్లా నాకు...’ (రచన - భాస్కరభట్ల) పాట పల్లవి కొద్దిరోజులు మాస్ నోట వినిపిస్తుంది. ‘దునియాతో నాకేంటమ్మా’ (రచన - సుద్దాల, గానం - కారుణ్య) అంటూ తల్లి సెంటిమెంట్‌తో హీరో పాడే సందర్భం బాగుంది. గ్రూప్‌తో పాటు హీరో డ్యాన్స్ చేయకుండా తన ఫీల్నే వ్యక్తీకరిస్తే సందర్భశుద్ధిగానూ ఉండేది. పూరి జగన్నాథ్‌కు దర్శకుడిగా ఈ ఏడాది రిలీజైన మూడో సినిమా ఇది. ఈ రోజుల్లో ఒకే ఏడాది చకచకా మూడు సినిమాలు తీసి, రిలీజ్ చేసి, నాలుగోది ఆల్రెడీ స్టార్ట్ చేసిన టాప్ డెరైక్ట రంటే పూరీ ఒక్కరే! అయితే, వేగంలో పడ్డాక విషయం కాస్త అటూ ఇటూగా ఉండడం అర్థం చేసుకోవాలి. డైలాగ్స్‌లో ‘వెర్రి పుష్పాలు’, ‘క్రికెట్ (కే) బాల్స్’ లాంటి మాటలు హాలులో హాయిగా వినిపిస్తాయి. సందట్లో సడేమియాగా మంచితనం నిండిన స్త్రీలిప్పుడు డైనోసార్లలా అంతరించిపోయారంటూ లిబరల్ సోషల్ కామెంటూ ఉంది. నవమోసాలూ మోసిన తల్లి పడే బాధ దేవుడికైనా తెలియవంటూ రేవతి చెప్పే సీన్, ఆ డైలాగులు బాగున్నాయి. హీరోయిన్ తండ్రి వగైరాల కాస్ట్యూమ్స్, వారుండే ప్రాసాదాలు జైపూర్‌లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. తీరా హీరో తల్లిని సముద్రపుటొడ్డున గుడిసెలో చూశాక, కథ విశాఖ తీరంలో జరుగుతోందేమోనని సర్దుకోవాలి. వెరసి, కథాస్థలం ఏమిటన్న దాంట్లో ప్రేక్షకులు మరికొంత స్పష్టతను ఆశిస్తే తప్పు లేదు. విలన్ కొడుకు కన్నతల్లినే కర్కశంగా చంపే సీన్, ఆ సీన్లో కొడుకు డైలాగ్ డెలివరీ, హావభావాలు వగైరా సున్నిత మనస్కులకు జీర్ణం కావు. ‘నేనే నీ కొడుకు’నని తల్లితో హీరో నిజం చెప్పుకోలేకపోవడం లాంటివి ఎమోషనల్‌గా ఇంకా వర్కౌట్ చేయడానికి స్కోప్ ఉన్న సందర్భాలు. అన్నట్లు... చివర్లో ‘థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూవీ- పూరి’ అంటూ టైటిల్ పడుతుంది. చాలాకాలానికి అమ్మ సెంటిమెంట్‌తో సినిమా తీసినప్పుడు ఆయన అలా ఫీల్‌తో చెప్పడం, ఆసాంతం చూశాక జనం కూడా ఆ థ్యాంక్స్‌కు తామూ అర్హులమేననుకోవడం తప్పు పట్టలేం! తెర వెనుక ముచ్చట్లు పూరి ఈ కథను హీరో నితిన్‌తో అనుకున్నారు. నితిన్ పక్కకు తప్పుకోవడంతో, వరుణ్‌తేజ్‌తో తెర మీదకొచ్చింది. పూరి అనుకున్న పేరు ‘లోఫర్’. కానీ, ఆయన గురువు వర్మ ‘మా అమ్మ మహాలక్ష్మి’ అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టమన్నారు. ఒక దశలో ‘అమ్మ’ టైటిల్ కూడా ఆలోచించారట. రెండేళ్ళ క్రితమే దిశా పరిచయానికి పూరి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్ట్ ఆగడంతో, ‘లోఫర్’లో ఛాన్సిచ్చారు. - రెంటాల జయదేవ -
మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన వరుణ్
-
ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..?
తొలి సినిమా నుంచే కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్న వరుణ్ తేజ్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయినా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన రెండో సినిమా కంచెతో అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ హీరోగా లోఫర్ సినిమాను నిర్మించిన సి కళ్యాణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. వీటిలో ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటించే అవకాశం ఉందంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వరుణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉంది. -
వరుణ్ తేజ్ ‘లోఫర్’
-
హాలీవుడ్ రేంజ్లో మహేష్ మూవీ
ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్‌తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్‌తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు. 2017లో పూరి మహేష్‌ల హ్యాట్రిక్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. -
నాకు అడవిలో ఉన్నట్లుగానే ఉండాలి!
పూరి జగన్నాథ్... సక్సెస్‌కు పొంగిపోడు, ఫెయిల్యూర్‌కి లొంగిపోడు. కోట్లు పోయినా, పట్టించుకోనివాడు కుక్కపిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పూరి లైఫ్‌లో గొప్ప స్క్రీన్‌ప్లే కనిపిస్తుంది. పూరి మాటల్లో గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది. ‘లోఫర్’ రిలీజ్ సందర్భంగా పూరితో స్పెషల్ టాక్... ఏంటి...ఎప్పుడు చూసినా గడ్డంతో కనిపిస్తారు.. తీరిక లేకా.. స్టయిలా? నాకిష్టమైనవాళ్లందరూ గడ్డంతో ఉన్నందువల్లో ఏమో గడ్డం అంటే నాకిష్టం ఏర్పడింది. నేనిష్టంగా చదివే రచయితలు చలం గారు, ఆచార్య రజనీష్, కమ్యూనిస్ట్ లీడర్ లెనిన్ - అందరికీ గడ్డం ఉండేది. చిన్నప్పుడు త్వరగా గడ్డం వచ్చేస్తే బాగుండనుకునేవాణ్ణి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డం కంపల్సరీ అనిపించింది. నాది కొంచెం బేబీ ఫేస్. ఇండస్ట్రీలో ఎవరికైనా కథలు చెప్పడానికి వెళ్లినప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని వెళితే ‘వీడు పిల్లాడులా ఉన్నాడు. వీడికేం తెలియదు’ అనుకుంటారని భయం. గడ్డం ఉండేలా చూసుకునేవాణ్ణి. అలాగే కంటిన్యూ అవుతున్నా. బేసిక్‌గా క్లీన్‌గా ఉండడం ఇష్టం ఉండదు. నాకు అడవిలో ఉన్నట్లుగానే ఉండాలి (నవ్వు). మీ పిల్లలు ‘ఎప్పుడూ గడ్డం ఏంటి నాన్నా’ అని అనలేదా? మీ ఆవిడ? నాకు రగ్గ్డ్గా కనిపించడం ఇష్టం. మా ఆవిడకీ, నా పిల్లలకీ అదే ఇష్టం. నేనెప్పుడైనా గడ్డం తీసినా వాళ్లే పెంచమని అడుగుతుంటారు. ఓకే. ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో మదర్ క్యారెక్టర్ని ట్రెండీగా చూపించారు. మరి.. ‘లోఫర్’ అమ్మ ఎలా ఉంటుంది? ఈ అమ్మ ట్రెండీ కాదు. ఆ సినిమాలోకన్నా ఎక్కువ ఎమోషన్ ఉన్న మదర్. పల్లెటూరి అమ్మ. నేను తీసిన మొదటి పల్లెటూరి సినిమా ఇది. రేవతిగారు కమర్షియల్ సినిమాలు చేయరు కాబట్టి, వెనకాడారు. కథ విని, ఒప్పుకున్నారు. లౌడ్‌గా ఉన్న సీన్స్‌లో నటించేటప్పుడు ‘నా లైఫ్‌లో నేనిలాంటి సీన్స్ చేయలేదు. నీ మీద నమ్మకంతో చేస్తున్నా’ అన్నారావిడ. అమ్మగారి గురించి తెలుసుకోవాలని ఉంది. మిమ్మల్ని ఎలా పెంచారు? నా చిన్నప్పుడు అమ్మకు సహాయం చేసేవాణ్ణి. అమ్మ వంట చేస్తుంటే కూరగాయలు తరిగిచ్చేవాణ్ణి. ఇంటి పనులు చేసిపెట్టేవాణ్ణి. నా ఐదో తరగతి అప్పుడే నాకు వంట తెలుసు.ఎప్పుడైనా అమ్మకు కుదరకపోతే వంట కూడా చేసేవాణ్ణి. అప్పట్నుంచీ ఇప్పటివరకూ మంచి కొడుకునే. మా అమ్మ వెరీ స్ట్రాంగ్ ఉమన్. ఎప్పుడో కానీ ఆమెకు కన్నీళ్లు రావు. మరీ బాధ అనిపిస్తే తప్ప ఏడవదు. అది ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. మీరు కూడా మీ అమ్మగారిలా మరీ బాధ అనిపిస్తేనే ఏడుస్తారా? అవును. కన్నీళ్లు తప్పించుకుని ఎవరూ బతకలేం. అది సత్యం. కానీ, కన్నీళ్లకూ కారణం ఉండాలి. అప్పుడే ఆ ఏడుపుకి ఓ విలువ ఉంటుంది. జీవితంలో మీరు విపరీతంగా ఏడ్చిన సందర్భం ఏదైనా...? ఉంది. ఎప్పుడూ ఏడ్వనంతగా ఆ రోజు ఏడ్చాను. ఆస్తులు పోయాయి. ఆఫీసూ, ఇల్లూ అమ్మేశాను. అప్పటివరకూ ముద్దుగా పెంచుకున్న పది కుక్కలకు ఆహారం పెట్టడం కూడా భారం అయ్యింది. ఒకతన్ని పిలిచి ఆ కుక్కలు ఇచ్చేశా. అప్పుడు విపరీతంగా ఏడ్చా. కుక్కల్ని తీసుకుంటున్న వ్యక్తి కూడా ఏడ్చేశాడు. నా లైఫ్‌లో పెద్ద ఏడుపు అదే. అప్పుడనిపించిందా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని? జీవితంలో మొదటిసారి అలా అనుకున్నా. అంతకు ముందు డబ్బు మీద పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. మనకేదంటే ఇంట్రస్ట్ లేదో అది మన దగ్గర ఉండదని అప్పుడు అర్థమైంది. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాలు నాతోనే ఉన్నాయి. డబ్బు మాత్రం పోయింది. ఇది జరిగి ఎన్నేళ్లయింది? ఆ తర్వాత నుంచీ పొదుపుగా ఉంటున్నారా? జస్ట్ ఏడెనిమిదేళ్లయ్యింది. అంతే. ఎక్స్పెన్సెస్ తగ్గించలేదు కానీ, ఇన్కమ్ పెంచాలని ఫిక్స్ అయ్యాను. అసలు నా ఖర్చులెంత? రెగ్యులర్‌గా చేసేదాని కన్నా ఒక సినిమా ఎక్కువ చేశాననుకోండి... ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే ఎక్కువ పని చేద్దామనుకున్నా. ఫెయిల్యూర్స్ పరంగా బాగా బాధపెట్టిన సినిమా ఏది? ‘నేనింతే’ అప్పుడు బాగా బాధపడ్డా. మంచి సినిమా. కానీ, ఎవరూ చూడలేదు. ఆ సినిమా నిజాయతీగా ఉంటుంది. ‘రూపాయి సంపాదించ లేని ఏ ఎధవకీ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పే అర్హత లేదు’ అనే డైలాగ్ ఆ సినిమాలో ఉంటుంది. ఆ డైలాగ్‌కి యూత్ అంతా హర్ట్ అవుతారు. ఎందు కంటే, వయసులో ఉన్నప్పుడు ఎవరూ సంపాదించలేరు. అలా ఆ సినిమాలో కొన్ని నిజాలు చెప్పడం డెజైస్ట్ అయ్యుండదేమో. నేనిప్పటి వరకూ చేసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఏందంటే - ‘నేనింతే’నే. మళ్లీ ‘లోఫర్’కు వద్దాం. ఇది ఎలాంటి సినిమా? ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, పోసాని, రేవతిల కాంబినేషన్ బాగుం టుంది. రేవతి మహా తల్లి. పోసాని చండాలమైన తండ్రి. ఈ రెండూ సమ పాళ్లల్లో పుణికి పుచ్చుకున్న కొడుకు వరుణ్‌తేజ్. కాంబినేషన్ సీన్స్ టచింగ్‌గా ఉంటాయి. ముగ్గురూ బతికే ఉంటారు. కానీ, ఒకళ్లు చనిపోయారని మరొకరు చెప్పుకుంటుంటారు. ఈ ‘లోఫర్’లో మీ లక్షణాలేమైనా ఉన్నాయా? కొన్ని ఉంటాయి. ఎవరు కథ రాసినా వాడి తాలూకు షేడ్స్ కొన్ని ఉంటాయి. మీరు కథ రాస్తే, మీ లక్షణాలు ఎక్కడో ఆ కథలో ఉంటాయి. హీరోలు ఇడియట్, పోకిరి, లోఫర్ ఇలా ఎందుకు, మంచిగా ఉండొచ్చుగా? మంచిగా ఉండకపోవడమే మంచిది. ఇవాళ మంచివాళ్లను చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. నా హీరోలు ఇప్పుడు ప్రపంచానికి తగ్గట్టు ఉంటారు. ‘ఎండ్ ఆఫ్ ది మూవీ’ ఇడియట్, పోకిరి, లోఫర్ మంచివాళ్లేగా (నవ్వు). వరుణ్‌లో హైట్ కాకుండా మిగతా ప్లస్ పాయింట్స్? మంచి ఆర్టిస్ట్. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సీన్‌కి ఎంతవరకూ కావాలో అంతే చేస్తాడు. సీన్ చేసినంతసేపూ ఆ క్యారెక్టర్లానే ఉండిపోతాడు. వరుణ్ కళ్లల్లో మంచి ఫైర్ ఉంది. లోపల కూడా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమాలో నేనేదైతే చూపించానో అంతకన్నా ఎక్కువ ఫైర్ తనలో ఉంది. అది తన కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సూపర్‌స్టార్ అవ్వాలంటే మీ చేతిలో పడాల్సిందేనని ‘లోఫర్’ ఆడియో వేడుకలో ప్రభాస్ అన్నారు. మరి, వరుణ్ సంగతేంటి? కచ్చితంగా.. ‘వరుణ్ సూపర్ స్టార్’ అని స్టాంప్ వేసేయొచ్చు. నటుడిగా.. వ్యక్తిగా.. వరుణ్ గురించి ఏం చెబుతారు? ఓ పాటలో వరుణ్ ఏడ్చే సీన్ ఒకటుంది. ఆ పాట చాలు వరుణ్ ఎంత పెద్ద హీరో అవుతాడో చెప్పడానికి. మంచి పొజిషన్‌కి వెళతాడు. వ్యక్తిగా సూపర్. బిహేవియర్ బాగుంటుంది. అది చాలు పెకైదగడానికి. కథలన్నీ బ్యాంకాక్‌లో రాస్తారట. ఇండియాలో కూడా రాయొచ్చు కదా? అంతకు ముందు ఇక్కడే రాసేవాణ్ణి. డబ్బొచ్చాక బ్యాంకాక్‌లో రాయడం మొదలుపెట్టా. అక్కడ నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. బ్యాంకాక్ వీధుల్లో మీరు బాగా పాపులర్ అట? అవును. ఆ మాటకొస్తే నా భార్యా, పిల్లలు కూడా పాపులరే. హాలిడే ట్రిప్ అంటే అక్కడికే వెళుతుంటాం. నా బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు సొంత ఊరిలా, ఇక్కడ ఉన్నప్పుడు ఫారిన్లా అనిపిస్తుంది. మీ గురించి వచ్చే వదంతులకు ఎలా రియాక్ట్ అవుతారు? బాధపడను. పని చేసేవాళ్ల గురించే కాంట్రవర్సీస్ వస్తాయి. ఏ కాంట్రవర్సీ రాకుండా ఉండాలంటే ఏ పనీ చేయకుండా ఉండాలి. మరి.. ఇంట్లోవాళ్ల సంగతి? వాళ్లు కూడా మెల్లిగా అలవాటుపడిపోతారు (నవ్వుతూ). ఈ మధ్యకాలంలో చిరంజీవిగారిని కలిశారా? ఆయనతో సినిమా ఏమైంది? కొన్ని రోజుల క్రితం కలిశాను. 150 కాకపోతే 151, 152.. ఏదో ఒకటి చేస్తాను. ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉంటాను. ఒక కథ కాకపోతే.. ఇంకోటి.. ఏదో కథ రాయకుండా ఉండను. ‘చిరంజీవిగారు నాకు చెప్పకుండా, కథ నచ్చలేదని మీడియాతో చెప్పారు’ అని మీరన్న మాటలు ఆయన అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. చిరంజీవిగారికీ, నాకూ మధ్య స్నేహం గురించి వాళ్లకు తెలియదుగా. ‘లోఫర్’ గురించి చిరంజీవి గారు ఏమన్నారు? క్లిప్పింగ్స్ చూసి, వరుణ్ బాగా చేశాడన్నారు. ఎమోషనల్ సీన్ చూసి, ‘ఓ ఆర్టిస్ట్‌గా ఈ సీన్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అన్నారు. ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్లో అభిమానులు పవన్ కల్యాణ్ అని పదే పదే అరవడం ప్రభాస్‌ని ఇరిటేట్ చేసింది. మీరు కూడా ఇరిటేట్ అయ్యారా? అయ్యాను. ఎందుకంటే సినిమా గురించి చెప్పడానికి ఫంక్షన్ పెడతాం. అక్కడకొచ్చి అరుస్తుంటే, ఎవరైనా ఇరిటేట్ అవుతారు. అరవ డం వల్ల పవన్ కల్యాణ్‌కే బ్యాడ్‌నేమ్ వస్తుంది. ఫ్యాన్స్‌కి కామన్సెన్స్ లేదేమో అనిపిస్తుంది. అలా అరవొద్దని కల్యాణ్ చెప్పినా వింటారో లేదో తెలియదు. కానీ, కల్యాణ్ ఏ ట్విట్టర్లోనో ‘ఇలా అరిచి పరువు తీయ కండ్రా’ అని చెబితే ఉపయోగం ఉంటుందేమో. అభిమానులు ఇలా అరవడంవల్ల మా సినిమా గురించి చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాం. ఫైనల్లీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చేస్తున్నా. మహేశ్ బాబు కోసం ఓ కథ రాస్తున్నా. బిజీ బిజీగా హాయిగా ఉంది. ► ఆ మధ్య నా దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఆడవాళ్లందరికీ నచ్చింది. బాక్సాఫీస్‌లో అనుకున్నంత డబ్బు రాకపోయి ఉండొచ్చు కానీ, మంచి సినిమా అని పేరొచ్చింది. ఒకావిడ అయితే, ఏకంగా ‘జ్యోతిలక్ష్మి’పైన పుస్తకమే రాస్తోంది. అంతకన్నా శాటిస్ఫేక్షన్ ఏం ఉంటుంది? ► మా అబ్బాయి ఆకాశ్ గతంలో కొన్ని సినిమాలు చేసినా, మళ్లీ తెరపై కనిపించడానికి మరో మూడేళ్లు పడుతుంది. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. -
‘లోఫర్’ వర్కింగ్ స్టిల్స్
-
'లోఫర్' వెరైటీ లుక్!
'కంచె' సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్. తాను నటించిన తొలి రెండు సినిమాలు 'ముకుంద', 'కంచె'లో విభిన్న సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్ మూడో ప్రయత్నంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో జత కట్టాడు. వీరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'లోఫర్'. ఈ సినిమా పేరుకు తగ్గట్టే తాజా పోస్టర్లో వెరైటీ లుక్‌తో వరుణ్‌తేజ్ దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్‌ను వైష్ణో మీడియా ట్విట్టర్లో పోస్టు చేసింది. వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ మేళవించిన 'లోఫర్' చిత్రంలో కథానాయిక దిశా పటాని. డిసెంబర్ 7న చిత్ర ఆడియో, 18న సినిమాను విడుదల చేయనున్నారు. -
జోడీ కుదిరింది!
వరుణ్ తేజ్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఇంకో సినిమా ఫైనలైజ్ చేసేస్తున్నాడు. ‘కంచె’తో పాటే ‘లోఫర్’ కమిట్ అయ్యాడు. ‘లోఫర్’ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి.. వరుణ్ తదుపరి ఏ సినిమా చేయబోతున్నాడు? ఆ విషయానికే వద్దాం. ‘పండగ చేస్కో’తో హిట్ సాధించిన గోపీచంద్ మలినేనికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో వరుణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుందని సమాచారం. వరుణ్ నటించిన తొలి చిత్రం ‘ముకుంద’లో అప్‌కమింగ్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ‘కంచె’లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా అప్‌కమింగ్ హీరోయినే. మూడో సినిమా ‘లోఫర్’లో దిషా పటాని కూడా అంతే. సో.. నాలుగో సినిమాలో వరుణ్ స్టార్ హీరోయిన్‌తో జతకట్టనున్నాడన్న మాట. వరుణ్, రకుల్ సరి జోడీ అనొచ్చు. ఎందుకంటే, వరుణ్ మంచి ఎత్తు. రకుల్ కూడా మంచి హైట్. చూడచక్కగా ఉండే ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ఊహించవచ్చు. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. -
పక్కా మాస్ లోఫర్!
‘లోఫర్’ అనే టైటిల్‌తో సినిమా వస్తే, కచ్చితంగా అందులో హీరో ఫుల్ మాస్‌గా కనిపిస్తాడని ఫిక్స్ అయిపోవచ్చు. పూరి జగన్నాథ్ ‘లోఫర్’గా వరుణ్ తేజ్ అలానే కనిపించనున్నారు. అయితే, మాస్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా చూసే విధంగా ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ కూడా జోడించారు పూరి. సి. కల్యాణ్ సమర్పణలో సీవీ రావు, శ్వేతలానా, వరుణ్,తేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిశా పటాని కథానాయిక. సి. కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ ఈ చిత్రంలో ఉంటాయి. తక్కువ సమయంలో ట్రైలర్‌కి పది లక్షల క్లిక్స్ వచ్చాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన రవితేజకు ‘ఇడియట్’, మహేశ్‌కు ‘పోకిరి’, ఎన్టీఆర్‌కు ‘టెంపర్’, రామ్ చరణ్‌కు ‘చిరుత’, అల్లు అర్జున్‌కు ‘దేశముదురు’లా వరుణ్ కెరీర్లో ఈ చిత్రం మంచి మాస్ సినిమాగా మిగిలిపోతుంది. డిసెంబర్ 7న పాటలను, 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ఇడియట్, పోకిరి, చిరుతల్లా...
పూరి జగన్నాథ్ మార్క్ హీరోలంటే కొంచెం రెక్లెస్గా, కొంచెం డైనమిక్‌గా తెరపై చాలా పవర్ ప్యాక్డ్గా కనిపిస్తారు. ‘కంచె’లో ధూపాటి హరిబాబుగా క్లాస్ లుక్‌లో అలరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు ‘లోఫర్’గా పూరి జగన్నాథ్ స్టయిల్లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించనున్నారు. ఈ లోఫర్ కథ ఏంటి? అతని లవ్‌స్టోరీ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సి.వి.రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిశా పటాని కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రవితేజకు ‘ఇడియట్’, మహేశ్‌బాబుకు ‘పోకిరి’, చరణ్‌కి ‘చిరుత’, బన్నీకి ‘దేశముదురు’ సినిమాల తరహాలో వరుణ్ తేజ్ కెరీర్లో మంచి మాస్ సినిమాగా నిలిచిపోతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది’’ అని తెలిపారు. -
లోఫర్ లవ్‌స్టోరీ
పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు. ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు... ఇవి ఆయన సినిమాలో ప్రతి హీరోకి ఉండే మినిమమ్ క్వాలిటీస్. ఇవే ఆయన అభిమానులకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. మరి... ఇలాంటి క్వాలిటీస్ వరుణ్‌తేజ్‌లో కనిపిస్తే..? తొలి సినిమా ‘ముకుంద’తోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్ తేజ్, ఇప్పుడు పూరి మార్కు హీరోయిజమ్‌తో ‘లోఫర్’గా రెడీ అవుతున్నారు. ఇందులో దిశా పటాని కథానాయిక. శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు కెమెరా స్విచాన్ చేయగా, పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య, నాగబాబు సతీమణి పద్మజ క్లాప్ నిచ్చారు. ‘‘నా కెరీర్ బిగినింగ్‌లోనే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అని హీరో వరుణ్‌తేజ్ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ లవ్‌స్టోరి. వరుణ్‌తేజ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 21 నుంచి జోధ్‌పూర్‌లో భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు: పీజీ విందా. -
’లోఫర్’గా రానున్న వరుణ్
-
పక్కా మాస్!
‘ముకుంద’ అంటూ సాఫ్ట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ‘లోఫర్’ అంటూ పక్కా మాస్ టైటిల్‌తో రానున్నారు. టైటిల్ పూరి జగన్నాథ్ స్టయిల్లో ఉందనిపిస్తోందా? సరిగ్గానే ఊహించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న చిత్రానికే ఈ టైటిల్‌ని ఖరారు చేశారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘వచ్చే నెల 10న జోధ్‌పూర్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం. విజయదశమికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ వింద, ఆర్ట్: విఠల్ కోసనం, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: శ్వేతలానా, వరుణ్, తేజ, సీవీ రావు.