సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ‘లోఫర్ వ్యాఖ్యలు’ చిచ్చును రాజేశాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరుసబెట్టి కేటీఆర్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ మాటలు, తీరు జుగుప్సాకరంగా ఉందని ఆక్షేపించారు.
టీఆర్‌ఎస్ తీరు మారటం లేదు... ‘కేటీఆర్ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను ఖండిస్తున్నా. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు వారికి అలవాటుగా మారాయి. రాజకీయాల్లో సంస్కారం, వ్యవహార తీరును ప్రతీసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. రోజూ నా చుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన్నానా? లేదుకదా!. వారి హోదాకు కూడా గౌరవం ఇస్తున్నా. అలాగే అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి సభ్యతతో మెదగాలని చెబుతున్నా. కానీ, వారి తీరు ఎంత మాత్రం మారటం లేదు’ అని జానారెడ్డి తెలిపారు.
టీఆర్‌ఎస్ ఓ బ్రోకర్ పార్టీ... సీఎం కేసీఆర్, తెరాస వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం తాను అదే రీతిలో స్పందించవద్దని సూచించానని... కానీ, అది అలుసుగా తీసుకుని ఇలాంటి పదజాలం వాడటం సంస్కారం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. ఇలాంటి మాటల వల్ల రాజకీయ విలువలు దిగజారుతాయన్నారు. ‘మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అన్నప్పుడు... ప్రతిగా తెరాస ఓ బ్రోకర్ పార్టీ అని ఎవరైనా అంటే ఏం చేస్తారు?. మీడియాలో ఆర్భాటం కోసమే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కాలి గోరు తో పోల్చారు. మరి కాళ్ళు పట్టుకున్న సంగతి మరిచిపోయారా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలనూ బాధిస్తుంది’ అని జానారెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ పప్పు కాదు... ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని జానా పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కూడా జానారెడ్డి తప్పుబట్టారు.‘130 కోట్ల ప్రజల పార్టీకి రాహుల్ నాయకుడు.. ప్రధాని అవ్వడానికి అవకాశం ఉన్నా త్యాగం చేసిన నేత నేత. గుజరాత్ లో మోడీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదు’ అని జానా తెలిపారు. తాను శుష్క సవాళ్లు చేయనని.. పబ్లిసిటీ కోసం మాట్లాడనని జానారెడ్డి వెల్లడించారు. సీట్లు, సర్వేలు కాదు.. 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఉన్నమాటే కదా : ఎమ్మెల్సీ కర్రె
సాక్షి, హైదరాబాద్ : జానారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వెంటనే స్పందించింది. ఉన్నమాటంటే కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకనీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలు వాడే భాషనే మంత్రి కేటీఆర్ వాడారు. ఆయన కాంగ్రెస్ గురించి చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం. నిజాలు మాట్లాడితే వారికి సహించటం లేదు అని కర్నె చెప్పారు. ఇక తెలంగాణకు కేసీఆర్ బాహుబలి అయితే.. కాంగ్రెస్ నేతలు కాలకేయ సైన్యంలా మారిందని కర్నె ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment