లో ఫర్ పూరీ ఫ్యాన్స్
సంగీతం: సునీల్ కశ్యప్,
కెమేరా: పి.జి. విందా,
నిర్మాతలు: శ్వేతాలాన, వరుణ్, తేజ, సి.వి. రావు, సి. కల్యాణ్,
కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్
‘నాన్నా! మా అమ్మ ఏమైంది’ అని అడిగే హీరో. ‘నాన్నా... నీ పెళ్ళాన్నీ... చంపేయనా’ అంటూ కన్నతల్లినే క్రూరంగా చంపే విలన్ కొడుకు! ఇలా దిగమింగుకోవాల్సిన సెంటిమెంట్, మింగుడుపడని యాంటీ సెంటిమెంట్ - రెండూ ఉన్న వెండితెర విచిత్రం ‘లోఫర్’. డబ్బున్న ఇంటి అమ్మాయి లక్ష్మి (రేవతి)ని ప్రేమతో మురిపించి, పెళ్ళి ముగ్గులోకి దింపిన ప్రబుద్ధుడు మురళి (పోసాని). తీరా కొడుకు పుట్టాక, ఆస్తి తెమ్మని భార్యను వేధిస్తాడు.
తేను పొమ్మన్న భార్యను వదిలేసి, కన్నబిడ్డను తనతో పాటు ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అతణ్ణీ తనలాగే చేస్తాడు. భార్యకేమో పిల్లాడు చనిపోయాడనీ, పిల్లాడికేమో అమ్మ చనిపోయిందనీ తేలిగ్గా అబద్ధం చెప్పి, నమ్మిస్తాడు. పాతికేళ్ళ తరువాత పిల్లాడు రాజు (వరుణ్‌తేజ్) మోసాలు, దొంగతనాలతో లోఫర్ అవుతాడు. కానీ, అమ్మ ప్రేమ కోసం తపిస్తూ, అమ్మలందరిలో తన అమ్మను చూసుకొంటూ ఉంటాడు.
ఇంట్లోవాళ్ళు చేస్తున్న ఇష్టం లేని పెళ్ళి వద్దనుకొని, పారిజాతం అలియాస్ మోనీ (దిశా పాట్నీ) హీరో వాళ్ళున్న జోధ్‌పూర్‌కు వస్తుంది. ఒక వాన కురిసిన వేళ వేడి వయసు పాటలో హీరోకు దగ్గరైపోతుంది. హీరోయిన్ కోసం ఇంట్లోవాళ్ళే విలన్‌లై వెంటపడతారు. ఇంతలో ఆమె మేనత్త (రేవతి) వస్తుంది. చనిపోయిందనుకున్న తన తల్లే ఆమె అని హీరో గుర్తిస్తాడు. కానీ ఈ లోఫర్‌ను తల్లి అసహ్యించుకుంటుంది. హీరో షాక్‌లో ఉండగా ఇంటర్వెల్.
అత్తతో కలసి పారిపోతున్న హీరోయిన్‌ను ఇంటి విలన్లే తీసుకెళ్ళిపోతారు. అమ్మ కోసం హీరో కూడా అక్కడికొస్తాడు. పారిపోయొచ్చిన హీరోయిన్, అన్నయ్యలు తనను వెతికి పట్టుకొని మరీ ఇంటికి తీసుకెళ్ళాక ఎక్కడా ప్రతిఘటించదు. కాపాడడానికి హీరో ఉన్నాడనే ధైర్యం కావచ్చు. విలన్‌లైన హీరోయిన్ తండ్రి, అన్నలతో హీరో ఎలా ఆడుకున్నాడు? అమ్మ ప్రేమనెలా పొందాడన్నది కొంత సెంటిమెంట్, కొండంత యాక్షన్ జోడించిన మిగతా సినిమా.
‘ముకుంద’, ‘కంచె’ ద్వారా సుపరిచితమైన వరుణ్‌తేజ్ ఈ మూడో సినిమాకు మరికొంత మెరుగైనట్లనిపిస్తారు. డ్యాన్సులు, స్టైలింగ్‌లో మునుపటి కన్నా జాగ్రత్త తీసుకున్నారు. వెరసి, కెమేరాకు ఈ వర్ధమాన హీరో, అతనికి ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడుతున్నారు. తెలుగు తెరకు పరిచయమైన దిశా పాట్నీ నటన పాటల్లో చూడాలి. హీరో తండ్రి మురళి పాత్రలో పోసాని కృష్ణ మురళి - ఒక్క దెబ్బతో కామెడీ, విలనిజమ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎదిగారు. కాకపోతే, పాత్రను బట్టి యాక్షనూ కొంత మలుచుకోవాల్సింది.
పసిబిడ్డకు దూరమైన తల్లిగా బాధ, కోపం, ఆవేశం లాంటివెన్నో ఉన్న తల్లి పాత్రకు రేవతి తగిన నటి. ఆమెను ఎంచుకున్నట్లే, ఆ ఎమోషన్‌స పండేలా తగినన్ని సీన్లూ రాసుకోవాల్సింది. ముఖేశ్‌రుషి, అతని కొడుకుల బ్యాచ్, గవ్వలేసే అమ్మాయి పాత్రలు విలనిజమ్ వాతావరణాన్ని మొదట బాగానే క్రియేట్ చేశాయి. కానీ, కథలో హీరోయిజానికి దీటుగా నిలిచే విలన్, విలనిజమ్ కనిపించవు. కామెడీ కోసం సినిమా ఫస్టాఫ్‌లో సప్తగిరి, ధన్‌రాజ్, సెకండాఫ్‌లో హీరోయిన్‌ను పెళ్ళాడాలని వచ్చే సై్పడర్‌బాబుగా అలీ, ‘శ్రీమంతుడు’ తరహా స్పూఫ్‌తో బ్రహ్మానందం - ఇలా ఫేమస్ కమెడియన్స్‌ను పెట్టారు.
నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాను కథా నేపథ్యానికి తగినట్లే, ఎక్కువ భాగం రాజస్థాన్‌లో జోధ్‌పూర్ పరిసరాల్లో తీశారు. అక్కడి రాజప్రాసాదాలు, ఆ పరిసరాలు చూపడంలో, పాటల చిత్రీకరణలో కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘నువ్వేడేస్తుంటే పిల్లా నాకు...’ (రచన - భాస్కరభట్ల) పాట పల్లవి కొద్దిరోజులు మాస్ నోట వినిపిస్తుంది. ‘దునియాతో నాకేంటమ్మా’ (రచన - సుద్దాల, గానం - కారుణ్య) అంటూ తల్లి సెంటిమెంట్‌తో హీరో పాడే సందర్భం బాగుంది. గ్రూప్‌తో పాటు హీరో డ్యాన్స్ చేయకుండా తన ఫీల్‌నే వ్యక్తీకరిస్తే సందర్భశుద్ధిగానూ ఉండేది.
పూరి జగన్నాథ్‌కు దర్శకుడిగా ఈ ఏడాది రిలీజైన మూడో సినిమా ఇది. ఈ రోజుల్లో ఒకే ఏడాది చకచకా మూడు సినిమాలు తీసి, రిలీజ్ చేసి, నాలుగోది ఆల్రెడీ స్టార్ట్ చేసిన టాప్ డెరైక్ట రంటే పూరీ ఒక్కరే! అయితే, వేగంలో పడ్డాక విషయం కాస్త అటూ ఇటూగా ఉండడం అర్థం చేసుకోవాలి. డైలాగ్స్‌లో ‘వెర్రి పుష్పాలు’, ‘క్రికెట్ (కే) బాల్స్’ లాంటి మాటలు హాలులో హాయిగా వినిపిస్తాయి. సందట్లో సడేమియాగా మంచితనం నిండిన స్త్రీలిప్పుడు డైనోసార్లలా అంతరించిపోయారంటూ లిబరల్ సోషల్ కామెంటూ ఉంది. నవమోసాలూ మోసిన తల్లి పడే బాధ దేవుడికైనా తెలియవంటూ రేవతి చెప్పే సీన్, ఆ డైలాగులు బాగున్నాయి.
హీరోయిన్ తండ్రి వగైరాల కాస్ట్యూమ్స్, వారుండే ప్రాసాదాలు జైపూర్‌లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. తీరా హీరో తల్లిని సముద్రపుటొడ్డున గుడిసెలో చూశాక, కథ విశాఖ తీరంలో జరుగుతోందేమోనని సర్దుకోవాలి. వెరసి, కథాస్థలం ఏమిటన్న దాంట్లో ప్రేక్షకులు మరికొంత స్పష్టతను ఆశిస్తే తప్పు లేదు. విలన్ కొడుకు కన్నతల్లినే కర్కశంగా చంపే సీన్, ఆ సీన్‌లో కొడుకు డైలాగ్ డెలివరీ, హావభావాలు వగైరా సున్నిత మనస్కులకు జీర్ణం కావు. ‘నేనే నీ కొడుకు’నని తల్లితో హీరో నిజం చెప్పుకోలేకపోవడం లాంటివి ఎమోషనల్‌గా ఇంకా వర్కౌట్ చేయడానికి స్కోప్ ఉన్న సందర్భాలు.
అన్నట్లు... చివర్లో ‘థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూవీ- పూరి’ అంటూ టైటిల్ పడుతుంది. చాలాకాలానికి అమ్మ సెంటిమెంట్‌తో సినిమా తీసినప్పుడు ఆయన అలా ఫీల్‌తో చెప్పడం, ఆసాంతం చూశాక జనం కూడా ఆ థ్యాంక్స్‌కు తామూ అర్హులమేననుకోవడం తప్పు పట్టలేం!
తెర వెనుక ముచ్చట్లు
పూరి ఈ కథను హీరో నితిన్‌తో అనుకున్నారు. నితిన్ పక్కకు తప్పుకోవడంతో, వరుణ్‌తేజ్‌తో తెర మీదకొచ్చింది. పూరి అనుకున్న పేరు ‘లోఫర్’. కానీ, ఆయన గురువు వర్మ ‘మా అమ్మ మహాలక్ష్మి’ అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టమన్నారు. ఒక దశలో ‘అమ్మ’ టైటిల్ కూడా ఆలోచించారట. రెండేళ్ళ క్రితమే దిశా పరిచయానికి పూరి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్ట్ ఆగడంతో, ‘లోఫర్’లో ఛాన్సిచ్చారు.
- రెంటాల జయదేవ