c. Kalyan
-
ఆ మాఫియా వల్ల సినీపరిశ్రమ నాశనమవుతోంది
‘‘నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. కానీప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో 27 మంది సభ్యులు ఉన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాగా మారింది. గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ ఆరోపణలు చేశారు. నేడు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షడు సి. కల్యాణ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆరంభం అయిన ఆర్గనైజేషన్ చిన్నగా ఎల్ఎల్పీగా మారి అది కాస్తా ‘గిల్డ్’గా మారింది. గిల్డ్ ఏంటి?ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏంటి? రెండింటినీ కలిపేయొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. కలపడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఇక్కడంతా మోనోపలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్.. ఇలా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కల్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం కలిగితే మా ఫ్యానల్‌కు ఓటు వెయ్యండి’’ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కల్యాణ్ పోటీపడటంలేదు. నిర్మాతల మండలి తరఫున అధ్యక్ష పదవికి పి. కిరణ్ పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికలపై ‘దిల్’ రాజు స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న నిర్మాతలు ఉన్న ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్’ని గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ ఫ్యానెల్ తరఫున అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -
సౌందర్య తర్వాత ఆమె అంటేనే నాకు ఇష్టం: సి. కల్యాణ్
‘‘సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో ఎప్పుడూ సక్సెస్ రాదు.. ఒకరికొకరు తోడవ్వాలి. మా గురువుగారు (దాసరి నారాయణరావు) అదే చెప్పేవారు’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్‌ను సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ వస్తుంది’’ అన్నారు. ‘‘అంజిని చూస్తే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తీసిన దర్శకుడిలా లేడు. బి. గోపాల్, వీవీ వినాయక్‌లా కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నాడు’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ‘‘మేం ఈ సినిమా ఆరంభించినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతోందని అనుకున్నప్పుడు సపోర్ట్ అవసరమని అడగ్గానే రవి కొల్లిపర ముందుకొచ్చారు ’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘96, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఉంటుంది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేశాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు అవికా గోర్. -
ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు
గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఛార్జీల చెల్లింపును రద్దు చేయడంతో పాటు ఆ తర్వాతి నెలల బిల్లును వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు కల్పిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీలో షూటింగ్స్ కోసం పర్మిషన్ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ ప్రసాద్... ఇలా చాలామంది వెళ్ళి గత జూన్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాం. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. మేం తొమ్మిది నెలల కరెంట్ ఛార్జీలు రద్దు అడిగాం. అయితే ప్రభుత్వం మూడు నెలలు రద్దు చేస్తూ, జీవో ఇచ్చింది. మిగతా నెలల బిల్లును కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ గారి డ్రీమ్. దానికి సంబందించిన అన్ని విషయాలూ పరిశీలిస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి. వీరనారాయణ్ బాబు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడుతూ – ‘‘ఏ, బీ సెంటర్స్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.5 లక్షల రుణాలపై వడ్డీ 50 శాతం మాఫీ చేయడం మంచి నిర్ణయం. ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం 6 నెలల గడువు తర్వాత ఒక ఏడాది వరకు వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుంది. థియేటర్స్ వారికి వెసులుబాటు కల్పించడంతో పాటు వేలాది సినీ కార్మికులకు తగిన జీవనోపాధి కలిగించేలా చేసిన జగన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో మాకు సహకరించిన హీరోలు చిరంజీవి, నాగార్జునలకు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్, విజయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
ఆ ఒక్క మాటతో మీ వెంట ఉంటానన్నాను
తెలుగు ఫిలిం ఫ్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘గతేడాది నా 60వ పుట్టినరోజును చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆనందంగా జరుపుకున్నాను. అది నా జీవితంలో మరచిపోలేని పుట్టినరోజు. కానీ, ఈ ఏడాది పుట్టినరోజు చేసుకోవటం లేదు. ఏ చిత్రసీమ నన్ను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిందో ఆ చిత్రసీమ కార్మికుల కోసం, వారి సమస్యలను తీర్చటం కోసం చిత్రపురి హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. చిత్రపురి కాలనీవాసులు ‘మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి’ అని అడిగినప్పుడు, మీ వైపు నుండి కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి అన్నాను. అందుకు వారు గురువు దాసరిగారు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసేవారా? అన్నారు. ఆ ఒక్క మాటతో ‘నేను మీ వెంట ఉంటాను’ అని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది నాకు చాలా బాధ్యతాయుతమైన పుట్టినరోజు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సినీ కార్మికుల కోసం ఎన్నో వరాలను ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారిని కలిసినప్పుడు ‘తెలుగు సినిమా పరిశ్రమను వైజాగ్‌లో కూడా డెవలప్ చేయండి. మీకు ఏం సాయం కావాలో అడగండి’ అన్నారు. అప్పుడు నేను జగన్‌గారితో ‘వైజాగ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలనేది వై.యస్. రాజశేఖర్ రెడ్డిగారి కల. మీకోసం రెండొందల ఎకరాల్లో సినిమా పరిశ్రమను రూపుదిద్దుతాను అని సీయం రాజశేఖర్ రెడ్డిగారు అన్నప్పుడు ఆరోజు ఆయనతో పాటు ఉన్నవాళ్లల్లో నేనూ ఒకడిని’ అని చెప్పటం జరిగింది. తెలుగు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయితేనే చిత్రపరిశ్రమకు మంచిది. ప్రస్తుతం నేను రానాతో తీసిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘1945 లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. సత్యదేవ్ హీరోగా ‘బ్లఫ్‌మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ గణేశ్ దర్శకత్వంలో ఓ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం. కె.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో సినిమా ఉంటుంది. ఇవి కాక బాలకృష్ణగారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
'సినీ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాదే'
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారితో సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సినిమా, సీరియళ్ల షూటింగ్‌కు సంబంధించి త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుదంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు మంగళవారం తలసానిని కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 'కరోనా వల్ల ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి ఇబ్బంది, నష్టం కలిగిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. సినిమా, సీరియళ్ల షూటింగ్లపైనే ఆధార పడి చాలా మంది కార్మికులు బతుకుతున్నారు. వారందరికి రేషన్ కార్డుల ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం.అలాగే కరోనా క్రైసిస్ చారిటీ(సిసిసి) ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇప్పటివరకు సిసిసి ద్వారా 14 వేల మంది సినీ కార్మకులను ఆదుకోవడం గొప్ప విషయం. సినిమా పెద్దలతో మీటింగ్ లు జరిగాయి. కరోనాతో బ్రేక్ పడింది.. కానీ బెస్ట్ పాలసీ తో ముందుకు వస్తాం. లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీ తో చర్చలు జరుపుతాం. సింగిల్ విండో పాలసీ తో ముందుకు వెళ్తాము. షూటింగ్ విషయం లో ఒక నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాలు చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం' అంటూ తలసాని పేర్కొన్నారు. సినీ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీకి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు . ఇప్పటివరకు 14వేల మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతి లో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చామని, ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేస్తుందని వెల్లడించారు. లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వం తో చర్చలు జరుపుతామని తెలిపారు. (ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..) (‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’) -
విలన్ పాత్రలకు సిద్ధమే
తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్‌పుత్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజస్ కంచెర్ల మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ధు. సినిమాలో అలివేలు(పాయల్ రాజ్‌పుత్ పాత్ర) తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధు ఏం చేశాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పాయల్ రాజ్‌పుత్ మంచి నటి. ఈ సినిమాలో ఆమెది చాలా బలమైన పాత్ర. స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ఒక హైలైట్. నిర్మాత సి. కల్యాణ్‌గారు ఫోన్ చేసి మంచి పాత్ర ఉంది ఓ సారి కథ వినమని చెప్పారు. కథ విన్న తర్వాత ఇందులోని నా పాత్ర నచ్చింది. అందుకే కష్టపడి పని చేశాను. టీజర్ విడుదలైనప్పుడు ఇది అడల్ట్ కంటెంట్ మూవీ అన్నారు. కానీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్సుకతను పెంచడానికే టీజర్‌ను అలా కట్ చేశాం. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవచ్చు. వినోదంతో పాటు ఓ సీరియస్ ఇష్యూని కూడా ప్రస్తావించడం జరిగింది. కేవలం హీరో పాత్రలే కాదు.. కథ నచ్చితే ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి సిద్ధమే. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. సినిమా తప్ప నాకేం తెలియదు. సినిమాల మీద నేను సంపాదించింది కూడా మళ్లీ సినిమాలోనే పెడతాను. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను’’ అని అన్నారు. -
ఐటీ సోదాలపై స్పందించిన కళ్యాణ్
సాక్షి, హైదరాబాద్: తమ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై సినీ నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన మాట వాస్తమేనని వెల్లడించారు. కొత్త సినిమా విడుదలైన ప్రతీసారి ఐటీ అధికారులు వస్తారని వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన నిర్మించిన ‘జై సింహా’ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ నిర్మించిన ఎస్. రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారికా హాసిని క్రియేషన్స్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు జరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్, భవ్య క్రియేషన్స్, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ లాంటి ఎనిమిది నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
ఒక్కరు కాదు... ఇద్దరు!
సాయిధరమ్ తేజ్ (తేజూ) హీరోగా దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ఒక్కరు కాదు... ఇద్దరున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు చెబుతున్నారు. ఒక హీరో తేజూ, మరొక హీరో ఎవరంటే... సాయిధరమ్ తేజే అంటున్నారు. దీని మీనింగ్ ఏంటంటే... ఈ సినిమాలో హీరోది డ్యూయల్ రోల్ అట! తేజూ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న మాట. అందులో ఓ గెటప్ యంగ్‌గా, మరో గెటప్ పెద్ద పెద్ద మీసాలతో ఉంటుందట. నిజంగానే తేజూ డ్యూయల్ రోల్ చేస్తున్నారా? లేదా తన పాత్రలో డ్యూయల్ షేడ్స్ ఉంటాయా? అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తేజూ డ్యూయల్ రోల్ చేయలేదు. ఒకవేళ, వినాయక్ దర్శకత్వంలో డ్యూయల్ యాక్షన్ చేస్తున్నారనేది నిజమైతే... కెరీర్లో ఫస్ట్‌టైమ్ చేస్తున్నట్టవుతుంది. హీరోతో డ్యూయల్ యాక్షన్ చేయించడం వినాయక్‌కు కొత్త కాదు. అందులో ఆయన ఎక్స్పర్ట్. ‘చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్’ సినిమాల్లో హీరోల చేత ద్విపాత్రాభియనం చేయించారు. ‘అల్లుడు శీను’లో అయితే ప్రకాశ్‌రాజ్ చేత రెండు పాత్రలు చేయించారు. -
శ్వాస ఉన్నంతవరకు సినిమాకు సేవ
♦ ప్రపంచ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు సి. కల్యాణ్ ♦ చెన్నై ఆస్కాలో పుట్టిన రోజు వేడుకలు ♦ ప్రముఖుల సత్కారం తమిళసినిమా: తన చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాకు సేవ చేస్తానని అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా సి.కల్యాణ్ అన్నారు. గత నెలలో ఫ్రాన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సినీ చిత్రోత్సవాల్లో సి.కల్యాణ్‌ను అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా ఎంపిక చేశారు. బుధవారం కల్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను చెన్నై టి.నగర్‌లోని ఆస్కాలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత సినీ ప్రముఖులు పలువురు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. సి.కల్యాణ్ ఒక తెలుగువారిగా అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా ఎంపికవడం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. ఈ పదవికి ఎంపికైన ఏకైక భారతీయుడు సి.కల్యాణ్ కావడం విశేషమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ ఒక సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన తాను నిర్మాతగా ఎదిగి అనంతరం దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షునిగా, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి బిల్డింగ్ కమిటీ అధ్యక్షునిగా, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు వంటి పలు బాధ్యతలను నిర్వర్తించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాకు సేవచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా తాను త్వరలో బాలకృష్ణ హీరోగా ఆయన 102వ సినిమాను నిర్మించబోతున్నట్లు సి.కల్యాణ్ ప్రకటించారు. జీఎస్టీపై ఆయన మాట్లాడుతూ పన్ను పెరగడం వల్ల సినిమా అంతమవుతుందన్నారు. -
వివాదంలో మరో తెలుగు సినిమా
హైదరాబాద్: అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాపై వివాదం సద్దుమణకముందే మరో చిత్రం చిక్కుల్లో పడింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాపై వివాదం రాజుకుంది. ఈ సినిమా కోసం నిర్మాత సి. కళ్యాణ్ రూ. 6 కోట్లు తీసుకుని మోసం చేశారని సహదేవ్ అనే ఎన్నారై ఆరోపించారు. ఈ మేరకు కళ్యాణ్, తాండ్ర రమేశ్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొనడం గమనార్హం. జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. -
మేం చెప్పం.. ప్రేక్షకులే చెబుతారు!
– ‘అల్లరి’ నరేశ్ ‘‘కొంతమంది మాది డిఫరెంట్ సినిమా. కొత్త కాన్సెప్ట్‌తో తీశామంటుంటారు. కానీ, మా సినిమా చూసిన తర్వాత ఎంత కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశామనేది ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా నటిస్తున్న 53వ సినిమా ‘మేడ మీద అబ్బాయి’. జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇవ్వగా, ‘నూజివీడు సీడ్స్’ వైస్ ప్రెసిడెంట్ రామ కోటేశ్వరరావు కెమేరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, ప్రసన్నకుమార్‌లు యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘మలయాళ హిట్ సినిమా ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి తెలుగు రీమేక్ ఇది. ఒరిజినల్ వెర్షన్ తీసిన ప్రజిత్ తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ల తర్వాత అంత పొటెన్షియల్ ఉన్న పాత్ర దక్కింది’’ అన్నారు. బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ – ‘‘నాకిష్టమైన సినిమాల్లో ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ ఒకటి. ఈ నెల 16న పొల్లాచ్చిలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. సంగీత దర్శకుడు డీజే వసంత్, ఛాయాగ్రాహకుడు ఉన్ని ఎస్.కుమార్, మాటల రచయిత చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎంఎస్ కుమార్, హీరోయిన్ నిఖిలా విమల్ పాల్గొన్నారు. -
కథకు అంతం ఉంటుందా?
సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రానా ఎస్.కె. సింగ్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. మీనా బజార్’ చిత్రంతో హీరోగా మారుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. వైభవీ జోషి, మధుసూదన్, షాహీన, సత్యప్రకాష్, జీవా, వేణుగోపాల్, విదిష, విజయ ముఖ్య పాత్రల్లో నాగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. రానా ఎస్.కె. సింగ్ మాట్లాడుతూ– ‘‘అసలు కథ అంటే ఏమిటి ? కథకి అంతం ఉంటుందా? లేదా? కథ అన్నది సంఘటనలు లేదా పాత్రల మధ్య నడిచే సంఘర్షణా? అనే భిన్నమైన ప్రశ్నలకు సమాధానమే మా చిత్రం. సినిమా అంటే రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు. అందరికీ నచ్చేలా ఉండాలన్నదే మా ప్రయత్నం’’ అన్నారు. నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మాధ్యు రాజన్, సంగీతం: మణికాంత్ ఖాద్రి. -
ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా సి. కల్యాణ్
గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారతీయ చలనచిత్ర సమాఖ్య (ఎఫ్.ఎఫ్.ఐ.) అధ్యక్షునిగా సి. కల్యాణ్, ఉపాధ్యక్షునిగా కొడాలి వెంకటేశ్వర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎఫ్.ఎఫ్.ఐ.లో భారతీయ చలన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియోలు –థియేటర్ల ఓనర్లు సభ్యులు. ప్రస్తుతం కల్యాణ్ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా, వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా పదవులు నిర్వహిస్తున్నారు. -
లో ఫర్ పూరీ ఫ్యాన్స్
సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: పి.జి. విందా, నిర్మాతలు: శ్వేతాలాన, వరుణ్, తేజ, సి.వి. రావు, సి. కల్యాణ్, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ ‘నాన్నా! మా అమ్మ ఏమైంది’ అని అడిగే హీరో. ‘నాన్నా... నీ పెళ్ళాన్నీ... చంపేయనా’ అంటూ కన్నతల్లినే క్రూరంగా చంపే విలన్ కొడుకు! ఇలా దిగమింగుకోవాల్సిన సెంటిమెంట్, మింగుడుపడని యాంటీ సెంటిమెంట్ - రెండూ ఉన్న వెండితెర విచిత్రం ‘లోఫర్’. డబ్బున్న ఇంటి అమ్మాయి లక్ష్మి (రేవతి)ని ప్రేమతో మురిపించి, పెళ్ళి ముగ్గులోకి దింపిన ప్రబుద్ధుడు మురళి (పోసాని). తీరా కొడుకు పుట్టాక, ఆస్తి తెమ్మని భార్యను వేధిస్తాడు. తేను పొమ్మన్న భార్యను వదిలేసి, కన్నబిడ్డను తనతో పాటు ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అతణ్ణీ తనలాగే చేస్తాడు. భార్యకేమో పిల్లాడు చనిపోయాడనీ, పిల్లాడికేమో అమ్మ చనిపోయిందనీ తేలిగ్గా అబద్ధం చెప్పి, నమ్మిస్తాడు. పాతికేళ్ళ తరువాత పిల్లాడు రాజు (వరుణ్‌తేజ్) మోసాలు, దొంగతనాలతో లోఫర్ అవుతాడు. కానీ, అమ్మ ప్రేమ కోసం తపిస్తూ, అమ్మలందరిలో తన అమ్మను చూసుకొంటూ ఉంటాడు. ఇంట్లోవాళ్ళు చేస్తున్న ఇష్టం లేని పెళ్ళి వద్దనుకొని, పారిజాతం అలియాస్ మోనీ (దిశా పాట్నీ) హీరో వాళ్ళున్న జోధ్‌పూర్‌కు వస్తుంది. ఒక వాన కురిసిన వేళ వేడి వయసు పాటలో హీరోకు దగ్గరైపోతుంది. హీరోయిన్ కోసం ఇంట్లోవాళ్ళే విలన్‌లై వెంటపడతారు. ఇంతలో ఆమె మేనత్త (రేవతి) వస్తుంది. చనిపోయిందనుకున్న తన తల్లే ఆమె అని హీరో గుర్తిస్తాడు. కానీ ఈ లోఫర్‌ను తల్లి అసహ్యించుకుంటుంది. హీరో షాక్‌లో ఉండగా ఇంటర్వెల్. అత్తతో కలసి పారిపోతున్న హీరోయిన్ను ఇంటి విలన్లే తీసుకెళ్ళిపోతారు. అమ్మ కోసం హీరో కూడా అక్కడికొస్తాడు. పారిపోయొచ్చిన హీరోయిన్, అన్నయ్యలు తనను వెతికి పట్టుకొని మరీ ఇంటికి తీసుకెళ్ళాక ఎక్కడా ప్రతిఘటించదు. కాపాడడానికి హీరో ఉన్నాడనే ధైర్యం కావచ్చు. విలన్‌లైన హీరోయిన్ తండ్రి, అన్నలతో హీరో ఎలా ఆడుకున్నాడు? అమ్మ ప్రేమనెలా పొందాడన్నది కొంత సెంటిమెంట్, కొండంత యాక్షన్ జోడించిన మిగతా సినిమా. ‘ముకుంద’, ‘కంచె’ ద్వారా సుపరిచితమైన వరుణ్‌తేజ్ ఈ మూడో సినిమాకు మరికొంత మెరుగైనట్లనిపిస్తారు. డ్యాన్సులు, స్టైలింగ్‌లో మునుపటి కన్నా జాగ్రత్త తీసుకున్నారు. వెరసి, కెమేరాకు ఈ వర్ధమాన హీరో, అతనికి ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడుతున్నారు. తెలుగు తెరకు పరిచయమైన దిశా పాట్నీ నటన పాటల్లో చూడాలి. హీరో తండ్రి మురళి పాత్రలో పోసాని కృష్ణ మురళి - ఒక్క దెబ్బతో కామెడీ, విలనిజమ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎదిగారు. కాకపోతే, పాత్రను బట్టి యాక్షనూ కొంత మలుచుకోవాల్సింది. పసిబిడ్డకు దూరమైన తల్లిగా బాధ, కోపం, ఆవేశం లాంటివెన్నో ఉన్న తల్లి పాత్రకు రేవతి తగిన నటి. ఆమెను ఎంచుకున్నట్లే, ఆ ఎమోషన్స పండేలా తగినన్ని సీన్లూ రాసుకోవాల్సింది. ముఖేశ్‌రుషి, అతని కొడుకుల బ్యాచ్, గవ్వలేసే అమ్మాయి పాత్రలు విలనిజమ్ వాతావరణాన్ని మొదట బాగానే క్రియేట్ చేశాయి. కానీ, కథలో హీరోయిజానికి దీటుగా నిలిచే విలన్, విలనిజమ్ కనిపించవు. కామెడీ కోసం సినిమా ఫస్టాఫ్‌లో సప్తగిరి, ధన్‌రాజ్, సెకండాఫ్‌లో హీరోయిన్ను పెళ్ళాడాలని వచ్చే సై్పడర్‌బాబుగా అలీ, ‘శ్రీమంతుడు’ తరహా స్పూఫ్‌తో బ్రహ్మానందం - ఇలా ఫేమస్ కమెడియన్స్‌ను పెట్టారు. నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాను కథా నేపథ్యానికి తగినట్లే, ఎక్కువ భాగం రాజస్థాన్‌లో జోధ్‌పూర్ పరిసరాల్లో తీశారు. అక్కడి రాజప్రాసాదాలు, ఆ పరిసరాలు చూపడంలో, పాటల చిత్రీకరణలో కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘నువ్వేడేస్తుంటే పిల్లా నాకు...’ (రచన - భాస్కరభట్ల) పాట పల్లవి కొద్దిరోజులు మాస్ నోట వినిపిస్తుంది. ‘దునియాతో నాకేంటమ్మా’ (రచన - సుద్దాల, గానం - కారుణ్య) అంటూ తల్లి సెంటిమెంట్‌తో హీరో పాడే సందర్భం బాగుంది. గ్రూప్‌తో పాటు హీరో డ్యాన్స్ చేయకుండా తన ఫీల్నే వ్యక్తీకరిస్తే సందర్భశుద్ధిగానూ ఉండేది. పూరి జగన్నాథ్‌కు దర్శకుడిగా ఈ ఏడాది రిలీజైన మూడో సినిమా ఇది. ఈ రోజుల్లో ఒకే ఏడాది చకచకా మూడు సినిమాలు తీసి, రిలీజ్ చేసి, నాలుగోది ఆల్రెడీ స్టార్ట్ చేసిన టాప్ డెరైక్ట రంటే పూరీ ఒక్కరే! అయితే, వేగంలో పడ్డాక విషయం కాస్త అటూ ఇటూగా ఉండడం అర్థం చేసుకోవాలి. డైలాగ్స్‌లో ‘వెర్రి పుష్పాలు’, ‘క్రికెట్ (కే) బాల్స్’ లాంటి మాటలు హాలులో హాయిగా వినిపిస్తాయి. సందట్లో సడేమియాగా మంచితనం నిండిన స్త్రీలిప్పుడు డైనోసార్లలా అంతరించిపోయారంటూ లిబరల్ సోషల్ కామెంటూ ఉంది. నవమోసాలూ మోసిన తల్లి పడే బాధ దేవుడికైనా తెలియవంటూ రేవతి చెప్పే సీన్, ఆ డైలాగులు బాగున్నాయి. హీరోయిన్ తండ్రి వగైరాల కాస్ట్యూమ్స్, వారుండే ప్రాసాదాలు జైపూర్‌లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. తీరా హీరో తల్లిని సముద్రపుటొడ్డున గుడిసెలో చూశాక, కథ విశాఖ తీరంలో జరుగుతోందేమోనని సర్దుకోవాలి. వెరసి, కథాస్థలం ఏమిటన్న దాంట్లో ప్రేక్షకులు మరికొంత స్పష్టతను ఆశిస్తే తప్పు లేదు. విలన్ కొడుకు కన్నతల్లినే కర్కశంగా చంపే సీన్, ఆ సీన్లో కొడుకు డైలాగ్ డెలివరీ, హావభావాలు వగైరా సున్నిత మనస్కులకు జీర్ణం కావు. ‘నేనే నీ కొడుకు’నని తల్లితో హీరో నిజం చెప్పుకోలేకపోవడం లాంటివి ఎమోషనల్‌గా ఇంకా వర్కౌట్ చేయడానికి స్కోప్ ఉన్న సందర్భాలు. అన్నట్లు... చివర్లో ‘థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూవీ- పూరి’ అంటూ టైటిల్ పడుతుంది. చాలాకాలానికి అమ్మ సెంటిమెంట్‌తో సినిమా తీసినప్పుడు ఆయన అలా ఫీల్‌తో చెప్పడం, ఆసాంతం చూశాక జనం కూడా ఆ థ్యాంక్స్‌కు తామూ అర్హులమేననుకోవడం తప్పు పట్టలేం! తెర వెనుక ముచ్చట్లు పూరి ఈ కథను హీరో నితిన్‌తో అనుకున్నారు. నితిన్ పక్కకు తప్పుకోవడంతో, వరుణ్‌తేజ్‌తో తెర మీదకొచ్చింది. పూరి అనుకున్న పేరు ‘లోఫర్’. కానీ, ఆయన గురువు వర్మ ‘మా అమ్మ మహాలక్ష్మి’ అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టమన్నారు. ఒక దశలో ‘అమ్మ’ టైటిల్ కూడా ఆలోచించారట. రెండేళ్ళ క్రితమే దిశా పరిచయానికి పూరి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్ట్ ఆగడంతో, ‘లోఫర్’లో ఛాన్సిచ్చారు. - రెంటాల జయదేవ -
ఏ హీరో ఇలా చేయలేదు!
‘‘మే 1న విడుదల కావాల్సిన చిత్రం ఇది. కానీ, అది జరగలేదు. విడుదలకు ముందు మూడు రోజుల పాటు పోరాడాం. చివరికి శనివారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాం’’అని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. కమల్‌హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శక త్వం వహించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘విడుదలలో జాప్యం జరిగినా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఏ హీరో చేయని కేరెక్టర్ చేసి కమల్ ప్రేక్షకులను మెప్పించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమార్‌బాబు, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీల కోసమో.. మతాల కోసమో..నేను సినిమాలు తీయడం లేదు!
- కమల్ హాసన్ ‘‘సినిమా ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ పరిస్థితిలో తీసిన సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాల్సి వస్తోంది. అది కూడా ఉచితంగా! ఆ సినిమా చూసి, వాళ్లు విడుదల చేసుకోమంటే చేసుకోవాలట! ఈ పరిస్థితి బాధాకరం’’ అని కమల్‌హాసన్ అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సి. కల్యాణ్ విడుదల చేస్తున్నారు. మే 1న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కమల్‌హాసన్, సి. కల్యాణ్, రమేశ్ అరవింద్, నాజర్, పూజాకుమార్లు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘విడుదలకు ముందే మీ సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి కదా!’ అనే ప్రశ్నకు కమల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ. వాళ్లను వద్దనుకుని సినిమా తీయడం ఎలా? అలాగని ముస్లిమ్ ప్రేక్షకులను నేను వద్దనుకోవడం లేదు. వాళ్లూ ముఖ్యమే. ఈ రెండు వర్గాలతో పాటు అన్ని మతాల కుటుంబాలూ నాకు అవసరమే! నేను కాంగ్రెస్ కోసమో, బీజేపీ కోసమో... వేరే రాజకీయ పార్టీల కోసమో సినిమాలు తీయడం లేదు. ‘ప్రజల సినిమా’ తీస్తున్నా’’ అన్నారు. కళాకారులం తక్కువ సంఖ్యలో ఉన్నాం. అందుకే మమ్మల్ని మైనార్టీలుగా చూడమంటున్నానని కమల్ చెబుతూ -‘‘మేం గొప్ప అనడం లేదు. చాలా చాలా తక్కువ. అందుకే, దయచేసి మమ్మల్ని బాధపెట్టకండి. మాకు వచ్చిన కళను మీకు చూపించాలన్నదే మా తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ కళను ఆదరించండి. మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని అభిమానించడం ద్వారా మీకు మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు’’ అన్నారు. గెటప్స్ కోసం ఎప్పుడూ సినిమా చేయలేదని కమల్ చెబుతూ -‘‘కథ ఏ గెటప్ డిమాండ్ చేస్తే అదే చేస్తున్నాను. అప్పుడు ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’ - ఇలా ఏది చేసినా అందులో నేను వేసిన గెటప్స్ కథానుగుణంగానే ఉంటాయి. అవి బాగుండడంతో గుర్తుండిపోయాయి. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ ఓ సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో సాగుతుంది. ఓ కళాకారుడిగా ఒక్క గెటప్‌లో కనిపించలేం కదా! ‘ఉత్తమ విలన్’ ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. నా దృష్టికోణంలో విలన్‌గా కనిపించేవాళ్లు.. మరొకరి దృష్టి కోణానికి హీరోలా కనిపిస్తారు. ఈ చిత్రంలో నా పాత్ర అలానే ఉంటుంది’’ అన్నారు. ఆండ్రియా, పూజా కుమార్‌లతో మళ్లీ సినిమా చేయడం గురించి అడగ్గా - ‘‘శ్రీదేవితో 27, శ్రీప్రియతో 27 సినిమాలు చేశాను. ఖుష్బూతో ఆరేడు సినిమాలు చేశాను. ఇప్పుడు ఆండ్రియా, పూజాకుమార్‌లతో మళ్లీ సినిమా చేయడానికి కారణం వాళ్ల ప్రతిభ. ఈ చిత్రంలోని పాత్రలకు వాళ్లే సరిపోతారు. అంతే తప్ప వేరే ఏమీ లేదు’’ అని నవ్వుతూ అన్నారు. అరవైఏళ్ల వయసులోనూ ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కమల్‌ను అడిగితే - ‘‘వయసు శరీరానికే. మనసుకు కాదు. మన మనసుకు మనమే వయసు ఫిక్స్ చేసుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ 54 సినిమాలు చేశాను. పలు విజయాలు చవి చూశాను. కానీ, ఈ చిత్రం నాకు ప్రత్యేకం’’ అని వ్యాఖ్యానించారు. -
'ఉత్తమ విలన్' ఆడియో విడుదల
-
'డార్లింగె ఓసినా డార్లింగే' ఆడియో ఆవిష్కరణ
-
ప్రేమజంట ముచ్చట్లు
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేను నా ప్రేమకథ’. దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పణుకు రమేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకులు. చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్. స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ ఆవిష్కరించారు. వర్మ తనకు మంచి మిత్రుడని, తన తమ్ముణ్ణి హీరోగా చూడాలనే కోరిక అతనికి ఈ చిత్రం ద్వారా నెరవేరిందని, ఈ సినిమా విజయం సాధించాలని సి. కల్యాణ్ ఆకాంక్షించారు. అన్ని పాటలూ బాగా వచ్చాయని చిన్ని చరణ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథ, చక్కని పాటలతో ఈ సినిమా అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. ఓ ప్రేమ జంట ముచ్చట్లు, వారి కోపతాపాల సమాహారంతో ఈ కథ నడుస్తుంది’’ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నామని కేఎన్ రావు తెలిపారు. శేఖర్, సుష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ ఆచార్య. -
ముగిసిన ఫిలిం చాంబర్ ఎన్నికలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిలిం చాంబర్) ఎన్నికలు ఆదివారం చెన్నైలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సి.కల్యాణ్ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. స్థానిక రాయపేటలోని ఉడ్‌లాండ్స్ థియేటర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఫిలిం చాంబర్ కార్యవర్గం పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాలనేది నిబంధన. ఈ సారి కేరళకు చెందిన వారు చాంబర్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది. ఈ పదవికి కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన పి.శశికుమార్, జి.పి.విజయకుమార్ పోటీ పడటం గమనార్హం. అదేవిధంగా ఉపాధ్యక్షత పదవికి నిర్మాత కె.రాజన్, పి.విజయకుమార్, కోశాధికారి పదవికి బాబు గణేశన్, మురళీధరన్, ఎ.జి.సుబ్రమణి, వెంకటేశ్ పోటీకి దిగారు. వారితోపాటు కార్యవర్గ సభ్యులు పదవికి 40 మంది పోటీ చేశారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్.వర్గం ఫిలిం చాంబర్ ఎన్నికలను బహిష్కరించడంతో చాంబర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.పి.విజయకుమార్‌తోపాటు ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న కె.రాజన్ పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా తెలియజేయలేదు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలిలో సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలకు చెందిన 2,085 మంది సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్తోపాటు కొంత మంది చాంబర్ ఎన్నికలను బహిష్కరించడం వల్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ఆదిశేషన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిం చారు. లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చాంబర్ అధ్యక్షుడిగా శశికుమార్ (కేరళ), ఉపాధ్యక్షుడిగా విజయ కుమార్ (కర్ణాటక), కోశాధికారిగా మురళీధర్(తమి ళ్), సంయుక్త కార్యదర్శులు కాట్రగడ్డ ప్రసాద్ (తెలుగు), పిఎం అరుళ్‌పతి (తమిళ్) ఎన్నికైనట్లు ప్రకటించారు. -
ఎమోషనల్ లవ్ స్టోరీ...
పవన్‌సాయి, హేమంతిని జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో తడకల రాజేష్ నిర్మించిన చిత్రం ‘ప్యూర్ లవ్’. జాన్ పోట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, మాజీ మంత్రి శంకరరావు స్వీకరిం చారు. ఈ వేడుకలో అశోక్‌కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడకల రాజేష్ మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథా చిత్రం. దర్శకుడు ఈ కథ చెప్పగానే విజయవంతమైన చిత్రం అవుతుందనిపించి, నిర్మించాను. కథ, పాటలు, ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ పాటలను, సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని దర్శకుడు తెలిపారు. ఇది ఎమోషన్ లవ్‌స్టోరీ అని పవన్‌సాయి చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని సంగీతదర్శకుడు అన్నారు. -
ఫిబ్రవరిలో మొదలు...
నాగార్జునతో ‘ఢమరుకం’ తర్వాత దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నాగచైతన్యతో సినిమా కమిట్ అయ్యారు. తొలుత ‘హలో బ్రదర్’ని రీమేక్ చేయాలనుకున్నారు. అది కుదరక, కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. ఆకుల శివ కథ, మాటలు అందిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 6న చిత్రీకరణ మొదలువుతుందని సమాచారం. ఓ ప్రముఖ కథానాయిక ఇందులో నటించబోతున్నారట. -
సినిమా భిక్షతింటూ వేడుకలకు హాజరుకారా?
వందేళ్ల సినిమా వేడుకలకు అందరిని ఆహ్వానించామని దక్షిణ భారత సిని వాణిజ్యమండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు. సినిమా భిక్షతింటూ వేడుకలకు హాజరుకాకపోతే అది వారి అవివేకమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా ప్రకటించినట్టుగానే వేడుకలు జరుగుతాయని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం హాజరవుతారని నమ్ముతున్నట్టు చెప్పారు. మీడియాలో వచ్చే ఊహాగానాలు నమ్మవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజలు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే మనం పండగ చేసుకోవడం తగదంటూ మోహన్‌బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వేడుకలను వాయిదా వేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దక్షిణ భారత పరిశ్రమ చెన్నైలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు 24 వరకూ జరుగుతాయి.