శ్వాస ఉన్నంతవరకు సినిమాకు సేవ
♦ ప్రపంచ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు సి. కల్యాణ్
♦ చెన్నై ఆస్కాలో పుట్టిన రోజు వేడుకలు
♦ ప్రముఖుల సత్కారం
తమిళసినిమా: తన చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాకు సేవ చేస్తానని అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా సి.కల్యాణ్ అన్నారు. గత నెలలో ఫ్రాన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సినీ చిత్రోత్సవాల్లో సి.కల్యాణ్‌ను అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా ఎంపిక చేశారు.
బుధవారం కల్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను చెన్నై టి.నగర్‌లోని ఆస్కాలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత సినీ ప్రముఖులు పలువురు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. సి.కల్యాణ్ ఒక తెలుగువారిగా అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షునిగా ఎంపికవడం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. ఈ పదవికి ఎంపికైన ఏకైక భారతీయుడు సి.కల్యాణ్ కావడం విశేషమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ ఒక సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన తాను నిర్మాతగా ఎదిగి అనంతరం దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షునిగా, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి బిల్డింగ్ కమిటీ అధ్యక్షునిగా, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు వంటి పలు బాధ్యతలను నిర్వర్తించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాకు సేవచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా తాను త్వరలో బాలకృష్ణ హీరోగా ఆయన 102వ సినిమాను నిర్మించబోతున్నట్లు సి.కల్యాణ్ ప్రకటించారు. జీఎస్‌టీపై ఆయన మాట్లాడుతూ పన్ను పెరగడం వల్ల సినిమా అంతమవుతుందన్నారు.