పూరి జగన్నాథ్‌తో కాసేపు మాట్లాడితే... ఆయన సినిమా చూసినట్లే ఉంటుంది. ఇంకాస్త లోతుగా వెళితే ‘చలం సాహిత్యం’ చదువుతున్నట్లుగా ఉంటుంది. పూరి గొప్ప దర్శకుడే కాదు, తత్వవేత్త కూడా. తన సినిమాల్లో హీరోల్లా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారాయన. నితిన్ హీరోగా పూరి దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన, ఇతర విశేషాలను శనివారం విలేకరులతో పంచుకున్నారు.
‘హార్ట్ ఎటాక్’కి స్పందన ఎలా ఉంది?
చాలా బావుంది. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. రాష్ట్రంలోని అన్ని ఏరియాల బయ్యర్ల నుంచీ పాజిటివ్ రిపోర్ట్. నైజాంలో తొలి రోజే కోటి రూపాయలు వసూలు చేసింది. నేనెంతో ప్రేమించి చేసిన సినిమాకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది.
అక్కడక్కడా నెగిటివ్ టాక్ ఉన్నట్లుంది?
ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. సక్సెస్ అనేది ఏ ఒక్కరి అభిప్రాయంతోనో ముడిపడి ఉండదు. ‘అత్తారింటికి దారేది’ సినిమాను కూడా చాలామంది బాలేదనే చెప్పారు. ఆ సినిమా వంద కోట్లు వసూలు చేసింది.
అసలు ఈ కథకు ప్రేరణ ఏంటి?
హిందీ సినిమా‘రాక్‌స్టార్’లో ఏఆర్ రెహమాన్ ట్యూన్ చేసిన ‘ఔర్ హో’ పాట సాహిత్యం నుంచి నాకీ కథ పుట్టుకొచ్చింది. నాగబాబుగారి అబ్బాయి వరుణ్‌తేజ్ కోసం తయారు చేసుకున్న కథ ఇది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో కుదర్లేదు. అందుకే ఇందులో హీరో పేరు వరుణ్.
‘ముద్దు’ అనేది కథలో కీలక పాత్ర పోషించింది కదా. మరి.. ఆ సన్నివేశంలో హీరోహీరోయిన్ల మొహాలకు క్లాత్ అడ్డం పెట్టేశారే?
సెన్సార్‌బోర్డ్ ధనలక్ష్మిగారి కోసం అలా క్లాత్ అడ్డం పెట్టా. ఆ విషయం ఆమెక్కూడా చెప్పాను.
డైలాగులు మీ గత సినిమాల స్థాయిలో లేవని టాక్?
డ్రగ్ తీసుకునేవాడికి డోస్ పెంచకపోతే కిక్ ఉండదు. మందు తాగేవాడికి పెగ్గు తక్కువైనా కిక్ ఉండదు. నా డైలాగులూ అంతే... నేను ఎంత రాసిన ప్రేక్షకులకు కిక్ సరిపోవడం లేదు. అదే... ఈ సినిమాకు టైటిల్ కార్డ్ నాది కాకుండా ఎవరిదైనా వేస్తే... ‘వీడెవడో పూరీలా రాశాడ్రా’ అని అప్రిషియేట్ చేస్తారు.
బ్యాంకాక్, స్పెయిన్ వదిలి ఎప్పుడొస్తారు? మన నేటివిటీతో సినిమా ఎప్పుడు తీస్తారు?
80 ఏళ్ల నుంచీ మన నేటివిటీతో సినిమాలు వస్తూనే ఉన్నాయండీ. అందుకే కాస్త కొత్తగా వేరే దేశంలో కొత్త కొత్త లొకేషన్లలో సినిమాలు చేస్తే ఆడియన్స్‌కి కూడా ఓ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని అలా తీస్తున్నాను. ఎమోషన్స్ అన్ని చోట్లా ఒకేలా ఉంటాయి. అవి ప్రేక్షకులకు టచ్ అయితే హిట్.
ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి లాంటి ఫీల్‌గుడ్ సినిమాలు చేసిన మీరు ఇప్పుడు భిన్నంగా వెళుతున్నారు. ఎందుకని?
ప్రేక్షకుల ధోరణి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్లను తృప్తి పరచడం అనుకున్నంత తేలిక్కాదు. ‘పోకిరి’ తర్వాత నా నుంచి వచ్చిన సినిమాలు చూసి, ‘అదే కథను ఎన్నిసార్లు తిప్పి తిప్పి తీస్తాడు’ అన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే... ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ టైమ్‌లో అది కొత్త ప్రయత్నం. ఇప్పుడు ఇది కొత్త ప్రయత్నం. అయితే, శ్రావణీ సుబ్రమణ్యం, తమిళమ్మాయి లాంటి కథాంశాలకు నేను దూరమైన మాట నిజం. అందుకే.. అలాంటి కథలతో త్వరలోనే సినిమాలు చేస్తా.
మహేష్‌తో సినిమా చేయబోతున్నారు కదా. ఆ కథ ఎలా ఉంటుంది?
ఇంకా కథ తయారవ్వలేదు.
కథల కోసం బ్యాంకాక్కే ఎందుకు? ఇక్కడా లొకేషన్లు ఉన్నాయిగా?
సంవత్సరం మొత్తం మీద నేను బ్యాంకాక్‌లో ఉండేది నెల. మిగిలిన 11 నెలలు ఇక్కడే ఉంటాను. ఆ 11 నెలల్ని వదిలేసి, ఆ నెల రోజుల గురించే ఎందుకు పట్టించుకుంటారు?
తమ్ముడు సాయిరామ్‌కి హిట్ ఇవ్వలేకపోయారేం?
మన పిల్లలకు మనం డబ్బులివ్వగలుగుతాం కానీ... బ్రేక్ ఇవ్వలేమండీ. అది వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. త్వరలో వాడు హీరోగా ఓ సినిమా చేస్తా.
మరి మీ అబ్బాయి సంగతి?
అది అయిదేళ్ల తర్వాత కథ. అప్పుడు ఫామ్‌లో ఉంటానో లేదో. వాడైతే ఇప్పుడే రెడీ.
పూరీ టాకీస్ అనే చిత్ర నిర్మాణ సంస్థ స్టార్ట్ చేశారు. కారణం?
కొన్నాళ్ల తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు ముందు జాగ్రత్తగా మనకు సొంత దుకాణం ఉండాలి కదా. అందుకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. న్యూ టాలెంట్‌ని పరిచయం చేయాలనుకుంటున్నా. నిర్మాతగా కొనసాగడమే కాక, కథ, మాటలు కూడా బయటవారికి ఇవ్వాలనుకుంటున్నా.
‘బుడ్డా’ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో చేయలేదు...?
‘సన్నాఫ్ సర్దార్’ చిత్ర నిర్మాతకు రెండు సినిమాలు సైన్ చేశాను.
మీ కుడిచేతిపై ఉన్న ‘నాట్ పర్మినెంట్’ అని పచ్చబొట్టుకి కారణం ఏంటి?
మనకు కష్టాలొస్తాయి. అవసరానికి డబ్బులుండవ్. నచ్చిన అమ్మాయి ప్రేమను తిరస్కరిస్తుంది. దిక్కు తోచక ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఇవేమీ శాశ్వతం కాదని గుర్తు చేస్తుందీ టాటూ. అలాగే, జీవితంలో గొప్ప విజయాలు లభిస్తాయి. అవసరానికి మించి డబ్బు ఉంటుంది. అందరి ప్రేమకూ పాత్రులం అవుతాం. అలాంటి సమయంలోనూ ఇవేమీ శాశ్వతం కాదని గుర్తు చేస్తుంది.