
‘‘భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని రాసే కథలకు ఫలానా హీరోనే చేయాలి అనేది ఉండదు. కథే హీరో. అలాంటి కథని సినిమాగా చేసేటప్పుడు హీరోనే కథను మోసుకుంటూ వెళ్తాడు. మా సినిమా హీరో కల్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ కథకు కావాల్సినంత న్యాయం చేశాడు’’ అని డైరెక్టర్ వేగేశ్న సతీష్ అన్నారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ చెప్పిన విశేషాలు...
►ఒకే జోనర్‌లో సినిమాలు చేసే హీరో ఒక్కసారిగా జోనర్ మారితే ఆ హీరో ఎలా చేశాడు? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంటుంది. కల్యాణ్‌రామ్ ఎలా చేసుంటాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఉంటుంది. అదే మా సినిమాకు ప్లస్ పాయింట్. మా కథకు అభినయం పరంగా పరిణితి కనబరచే నటుడు కావాలనుకొని ఆయనకు కథ చెప్పాను.. నచ్చటంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. కథానుగుణంగా ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి.. అవి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
►కెరీర్‌లో నేను చేసిన రెండు సినిమాలతోనే ఫ్యామిలీ దర్శకుడు అనే ముద్ర వేశారు. ఆ బ్రాండ్ నాకు సంతోషాన్నే ఇస్తోంది.
►స్వతహాగా కథా రచయితనైనా ఏ రోజూ రీమేక్ కథలు చేయాలనుకోలేదు. ‘ఆక్సిజన్’ అనే గుజరాతి సినిమా చూసిన మా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుందని శివలెంక కృష్ణప్రసాద్‌గారికి చెప్పారు. ‘సతీష్ వద్దే చాలా కథలు ఉన్నాయి.. రీమేక్ కథ చేస్తాడో? లేదో? డౌటే.. అయినా ఓ సారి అడిగిచూడండి’ అని శివలెంకగారు నిర్మాతలతో అనటంతో నిర్మాతలు నన్ను అడిగారు. సినిమా చూసినప్పుడు ఆ కథలోని హీరో క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది. కానీ మిగతా సినిమా మన తెలుగు నేటివిటీకి సరిపోదని చెప్పాను. ఆ తర్వాత నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఈ కథలో మార్పులు చేశాం. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment