ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్ Devil Director Naveen Medaram Released A Note On Movie Issue | Sakshi
Sakshi News home page

Devil Movie: 'ఎవరు ఎన్ని చెప్పినా ఇది నా సినిమానే': డైరెక్టర్ పోస్ట్ వైరల్!

Published Wed, Dec 27 2023 6:36 PM

Devil Director Naveen Medaram Released A Note On Movie Issue - Sakshi

నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై  నిర్మించగా.. శ్రీకాంత్‌ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. 

అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్‌ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్‌ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్‌ దక్కలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

నవీన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్‌, వైజాగ్‌, కారైకుడిలో షూట్‌ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. 

ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్‌ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్‌ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. 

కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం‌ ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్‌ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్‌ రాసుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement