తెలుగులో చిత్రం చేయాలన్న కోరిక కేరాఫ్ సూర్యతో నెరవేరిందని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. వెన్నెల కబడ్డీ కుళు చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కించిన నాన్ మహాన్ అల్ల చిత్రం తెలుగులో నా పేరు శివ పేరుతో అనువాదం అయ్యి రెండు భాషల్లోనూ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తాను తెలుగులో చిత్రం చేయాలని కోరుకున్నా అది నెరవేరలేదని దర్శకుడు సుశీంద్రన్ సోమవారం విలేకరులతో వెల్లడించారు.
ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని తమిళంలో నెంజిల్ తుణివిరుందాల్, తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో తెరక్కెంచారు. నటుడు సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ దీపావళి పండుగ అంటే తకు చాలా ఇష్టం అన్నారు. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రాన్ని చూసేందుకు స్నేహితునితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా తొలిసారిగా దీపావళి పండగను ఎంజాయ్ చేశానన్నారు.
ఆ తరువాత చెన్నైకి రావడంతో కొన్నేళ్లు దీపావళికి దూరంగా ఉన్నానని, మళ్లీ తన తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు చిత్ర విడుదల సందర్భంగా 2009లో దీపావళి వేడుకను జరుపుకున్నాన్నారు. అప్పటి నుంచి వరసగా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నాన్నారు. పాండినాడు చిత్రం 2013లో దీపావళి సందర్భంగా విడుదలై తనకు ఘన విజయాన్ని అందించిందన్నారు. కాగా తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్‌ను ఈ దీపావళికి విడదల చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం ఎంజీనా అనే చిత్రం నిర్మాణంలో ఉందని సుశీంద్రన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment