ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా | Director VV Vinayak Press Meet About Rakshasudu Movie | Sakshi
Sakshi News home page

ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా

Published Fri, Aug 9 2019 2:14 AM | Last Updated on Fri, Aug 9 2019 2:14 AM

Director VV Vinayak Press Meet About Rakshasudu Movie - Sakshi

‘‘నేను హీరోగా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్‌కి ‘రాక్షసుడు’ సినిమాతో హిట్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. తనకంటే కూడా నాకే ఎక్కువ సంతోషంగా అనిపించింది. దానికి కారణమైన రమేశ్‌ వర్మకి నా అభినందనలు’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్‌ నామా ఈ నెల 2న విడుదల చేశారు

. ఆ సినిమా మంచి హిట్‌ కావడం సంతోషంగా ఉందని వినాయక్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణగారి అబ్బాయి హవీష్‌ కూడా హీరోనే. అయినా కూడా ‘రాక్షసుడు’ కథకి సాయి కరెక్ట్‌గా సరిపోతాడని, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఓ సూపర్‌హిట్‌ సినిమాని సాయికి అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ రీమేక్‌ చేయడం చాలా ఈజీ అంటారు.. కానీ చాలా కష్టం. ‘రాక్షసన్‌’ తమిళ సినిమా నేను చూశా.


మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా టెంపోని ఎక్కడా మిస్‌ అవకుండా రమేశ్‌ చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్షన్‌ వైపు ఎందుకొచ్చావని రమేశ్‌ని అడిగితే.. దాదాపు 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేశాను.. బోర్‌ కొట్టి డైరెక్షన్‌ వైపు వచ్చానని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అయితే డైరెక్షన్‌ ఎప్పుడూ బోర్‌ కొట్టదు.. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. సాయితో మళ్లీ హిట్‌ సినిమా తీయాలి. సాయికి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

 ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ....
► ఓ కమర్షియల్‌ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఏ అంశాలు అవసరమో అవన్నీ సాయితో తీసిన ‘అల్లుడు శీను’లో ఉన్నాయి. కొన్ని కథకి అవసరం లేకున్నా యాడ్‌ చేశాం.. ఎందుకంటే హీరోని (సాయి శ్రీనివాస్‌) ఎలివేట్‌ చేయడానికి చేసిన మ్యాజిక్‌ అది.. సినిమాకి అది బాగా వర్కవుట్‌ అయింది.

► ఈ మధ్య పేపర్లో చదివా.. ‘మా అబ్బాయి శ్రీనుని ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులు నటుడిగా గుర్తించారు’ అని బెల్లంకొండ సురేశ్‌గారు అన్నారు. అది అబద్ధం. ‘అల్లుడు శీను’ నుంచి ‘రాక్షసుడు’ వరకూ అన్ని సినిమాలకు సాయిని నటుడిగా గుర్తించారు ప్రేక్షకులు.

► తొలి సినిమా ‘అల్లుడు శీను’కే ది బెస్ట్‌ ఇచ్చాడు. వినోదం పండించడం చాలా కష్టం.. కానీ ఆ సినిమాలో బాగా చేశాడు. ‘రాక్షసుడు’లో కథ టెంపో ఏ మాత్రం తగ్గకుండా, బాగా ఇన్‌వాల్వ్‌ అయి నటించాడు.. దాంతో తనకు మంచి పేరొచ్చింది. తను ఏ పాత్ర అయినా చేయగలడు.

► ‘అల్లుడు శీను’ సినిమా వచ్చి ఐదేళ్లు అయిందంటే రోజులు ఎంత స్పీడుగా అయిపోతున్నాయా అనిపిస్తోంది. ఆ సినిమా నిన్నకాక మొన్ననే విడుదల చేసినట్లుంది నాకు. ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకి కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. సాయి మాత్రం అనుభవం ఉన్నవాడిలా అన్నీ ఒకే టేక్‌లోనే చేసేవాడు. నాకు చాలా సంతోషంగా, పెద్ద హీరోతో చేసినట్టు అనిపించింది. అప్పటికీ ఇప్పటికీ తనలో నాకు తేడా కనిపించడం లేదు. కథకు ఏది అవసరమో దాన్ని చేస్తున్నాడు. నేను–సాయి కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది. అయితే పెద్ద సినిమా తీయాలి. అందుకు మంచి కథ కుదిరితే చేస్తాం.

► నేను సినిమా చేస్తున్నదే ఫిట్‌ అవడానికి.. అంతేకానీ హీరో అయిపోవాలని కాదు (నవ్వుతూ). బాడీ ఫిట్‌ అవడానికి ఏదో ఓ కారణం కావాలి.. అందుకు సినిమాని కారణంగా పెట్టుకుని చేస్తున్నా’’ అంటూ హీరోగా తాను ఓ సినిమా కమిట్‌ అయిన విషయం గురించి చెప్పారు వినాయక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement