ప్లీజ్.. నా నుంచి అది ఆశించొద్దు: సల్మాన్
ముంబై: స్టార్ హీరో అయినప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. అయినా అతని స్టార్ డమ్ కు ఏ లోటూ లేదు. బాలీవుడ్ మూవీలను వంద కోట్ల క్లబ్ కు చేరడం నీళ్లప్రాయంగా మార్చిన హీరో సల్మాన్ ఖాన్. శుక్రవారం అతని పెళ్లి విషయంపై కాస్త వివాదం కావడం తెలిసిందే. తమ్ముడు అర్బాజ్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు సమర్ధించుకున్నాడు. ఈ జూన్ 23-26 తేదీల మధ్య ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) ఉత్సవాలపై సల్మాన్ మాట్లాడుతూ... తాను హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లాగ డాన్స్ చేయలేనని చెప్పాడు. అందుకే ఐఫాలో వారి అంత మంచి స్టెప్పులు వేయలేనని, అందుకే తన నుంచి అలాంటివి ఆశించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తనకు వచ్చిన విధంగా నార్మల్ స్టెప్పులతో అలరించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు.
వరుస షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ తాను చాలా బిజీగా ఉన్నా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరగనున్న ఐఫా వేడుకల్లో పాల్గొంటానని చెప్పాడు. సల్మాన్ ఎక్కడుంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుందని, కుటుంబమంతా ఉన్న ఫీలింగ్ కలుగుతుందని సీనియర్ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఐఫాలో కరీనా కపూర్, మోనాలి ఠాకూర్, ప్రీతమ్, నీతి మోహన్ ఫర్మార్మెన్స్ చూడవచ్చని చెప్పాడు. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ కంటెస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తారని అనిల్ వివరించాడు.