
అస్సలు భయపడకూడదు!
‘‘ఎప్పుడో శ్వాసించేసిన గతాన్ని పూర్తిగా వదిలేయండి. వర్తమానాన్ని శ్వాసించండి. దాన్నలా నొక్కిపట్టి ఉంచండి. ఎలాంటి అంచనాలు లేకుండా భవిష్యత్తును కూడా శ్వాసించండి... ఈ మాటలు వింటుంటే విచిత్రంగా ఉందా? యోగా చేసేవాళ్లు ‘ప్రాణాయామం’ చేస్తారు. జీవితం గురించి నేను చెప్పిన పై మాటలు కూడా మంచి ప్రాణాయామం లాంటివే. వర్తమాన జీవితం గురించి ఆలోచించి, దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే, భవిష్యత్తు బాగుంటుంది. అలాగే, గతించిన చేదు జ్ఞాపకాలను మనసులో నుంచి తీసేసి, ఆ స్థానంలో తీపి నింపుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
నాకు పరిశీలనా దృష్టి ఎక్కువ. కొంతమంది ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందిస్తుంటారు. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేరు. దాంతో పెద్ద పెద్ద కష్టాలు వాళ్లను బాగా కుంగదీసేస్తాయ్. జీవితం కష్ట సుఖాల సమాహారం అనుకుని, రెంటినీ సమానంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయపడడం మొదలుపెడితే వర్తమానం దుర్భరంగా ఉంటుంది. అందుకే అస్సలు భయపడకూడదు. ‘ఈ క్షణం ఏంటి?’ అని ముందుకు సాగిపోవాలి. వేదాంతం మాట్లాడుతున్నాననుకోవద్దు. ఆచరించి చూడండి.. జీవితం సాఫీగా ఉన్నట్లు మీకే అనిపిస్తుంది.’’
- శ్రీయ