మౌత్‌టాక్ వల్లే ఈ విజయం
మౌత్‌టాక్ వల్లే ఈ విజయం
Published Mon, Oct 21 2013 12:49 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘‘దూసుకెళ్తా’ ఇప్పటివరకూ ప్రపంచంలో రాని కొత్త కథ అని నేను చెప్పను. రొటీన్ కథే అయినా కొత్తగా చెప్పడానికి ప్రయత్నించా. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ.. పడిన కష్టం మొత్తాన్నీ మరపించింది’’ అని వీరు పోట్ల అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకునిగా డా. మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు వీరు పోట్ల.
ఆదివారం ఆయన విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంకా చెబుతూ- ‘‘ఈ సినిమా విడుదల సమయంలోనే నాకు పాప పుట్టింది. ఆ హడావిడిలో తొలి ఆట చూడలేకపోయాను. తొలి రెండు ఆటలూ వసూళ్ల పరంగా డల్‌గా ఉన్నాయని విన్నాను. కానీ సాయంత్రం నుంచే వసూళ్లు ఊపందుకున్నాయి. పరిచయం లేని వారు కూడా ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మౌత్ టాక్ వల్లే ఈ విజయం’’ అన్నారు వీరు పోట్ల. ‘‘నిజానికి ఇది మనోజ్ కోసం అనుకున్న కథ. అయితే... మోహన్‌బాబుగారు విష్ణుతో చేస్తే బాగుంటుందన్నారు. దాంతో విష్ణు శారీరకభాషకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశా.
మనోజ్ అంత ఎనర్జిటిగ్గా విష్ణు ఉండడేమో అనుకున్నా.. కానీ మనోజ్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో నటించాడు విష్ణు. నటునిగా తనను మరో మెట్టు పైన నిలబెట్టిన సినిమా ఇది’’ అని చేశాడు. విష్ణు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, భరత్ పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోందని, ప్రథమార్ధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బాగుండేదని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనోజ్ కోసం ‘బిందాస్-2’ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement