ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి
ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి
Published Fri, Sep 27 2013 1:54 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన. ఇంతకీ కె.రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తోంది ఏ సినిమాకు అనుకుంటున్నారా? మంచు విష్ణు కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.
హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మిగిలివున్న పాటను మంచు ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తున్నారు. ‘మాస్’ అనే పదానికి పర్యాయపదమైన దర్శకేంద్రుడు... ఈ పాటను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరో విషయం ఏంటంటే... ఈ ప్రత్యేకగీతంలో నర్తించే అవకాశాన్ని మంచు లక్ష్మి కొట్టేశారు.
తమ్ముడి ఇంట్రడక్షన్ సాంగ్‌లో అక్క అడుగు కదపనున్నారన్నమాట. పాటలను తెరకెక్కించడంలో కె.రాఘవేంద్రరావు స్పెషలిస్ట్. అందుకే ఆయన తీసే పాటలో నర్తించడానికి కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ విధంగా మంచు లక్ష్మికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అనే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. శనివారం పాటలను, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తామని విష్ణు చెప్పారు.
Advertisement
Advertisement