Doosukeltha
-
కేరళలో 'సర్వ కళా వల్లవన్'గా 'దూసుకెళ్తా'
మలయాళ ప్రేక్షకులకు మరోసారి దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది అని మంచు విష్ణు అన్నారు. గత సంవత్సరం విడుదలైన 'ఎదునమ్ రెఢి' చిత్రాన్ని కేరళ సినీ ప్రేక్షకుల చక్కగా ఆదరించారని ఆయన అన్నారు. తాజాగా మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా చిత్రం 'సర్వ కళా వల్లవన్' పేరుతో మలయాళంలోకి అనువదించి శుక్రవారం కేరళ రాష్ట్రంలో విడుదల చేశారు. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించారు. 'దూసుకెళ్తా' చిత్రం అక్టోబర్ 17వ తేదిన విడుదలై తొలివారంలోనే 14.83 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. -
నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు
‘‘ ‘దూసుకెళ్తా’ విడుదలై 9 రోజులైంది. ఇంకా తరగని వసూళ్లతో దూసుకెళుతోందీ సినిమా. అన్ని ప్రాంతాల నుంచీ మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవల విడుద లైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. అయితే... నటన విషయంలో నేను ఎప్పుడూ సంతృప్తి చెందను. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నృత్యాలూ పోరాటాల విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. అయితే... ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు మాత్రం చేయలేదు. వచ్చేవారం భారీగా విజయోత్సవాన్ని జరుపుతాం’’ అని తెలిపారు. ‘‘ఓ వైపు దసరా సెలవులు అయిపోయాయి. మరో వైపు భారీ వర్షాలు. అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గలేదు. విష్ణు ఎనర్జిటిక్ యాక్షన్, బ్రహ్మానందం, ‘వెన్నెల’కిషోర్, రఘుబాబుల కామెడీ సన్నివేశాలు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని వీరు పోట్ల చెప్పారు. ‘ఢీ’ లాంటి మంచి కథ కుదిరితే... తన దర్శకత్వంలో విష్ణుతో ఓ సినిమా చేస్తానని రచయిత గోపిమోహన్ చెప్పారు. -
మౌత్‌టాక్ వల్లే ఈ విజయం
‘‘‘దూసుకెళ్తా’ ఇప్పటివరకూ ప్రపంచంలో రాని కొత్త కథ అని నేను చెప్పను. రొటీన్ కథే అయినా కొత్తగా చెప్పడానికి ప్రయత్నించా. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ.. పడిన కష్టం మొత్తాన్నీ మరపించింది’’ అని వీరు పోట్ల అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకునిగా డా. మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు వీరు పోట్ల. ఆదివారం ఆయన విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంకా చెబుతూ- ‘‘ఈ సినిమా విడుదల సమయంలోనే నాకు పాప పుట్టింది. ఆ హడావిడిలో తొలి ఆట చూడలేకపోయాను. తొలి రెండు ఆటలూ వసూళ్ల పరంగా డల్‌గా ఉన్నాయని విన్నాను. కానీ సాయంత్రం నుంచే వసూళ్లు ఊపందుకున్నాయి. పరిచయం లేని వారు కూడా ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మౌత్ టాక్ వల్లే ఈ విజయం’’ అన్నారు వీరు పోట్ల. ‘‘నిజానికి ఇది మనోజ్ కోసం అనుకున్న కథ. అయితే... మోహన్‌బాబుగారు విష్ణుతో చేస్తే బాగుంటుందన్నారు. దాంతో విష్ణు శారీరకభాషకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశా. మనోజ్ అంత ఎనర్జిటిగ్గా విష్ణు ఉండడేమో అనుకున్నా.. కానీ మనోజ్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో నటించాడు విష్ణు. నటునిగా తనను మరో మెట్టు పైన నిలబెట్టిన సినిమా ఇది’’ అని చేశాడు. విష్ణు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, భరత్ పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోందని, ప్రథమార్ధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బాగుండేదని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనోజ్ కోసం ‘బిందాస్-2’ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. -
మాస్, క్లాస్ ప్రేక్షకులే లక్ష్యంగా 'దూసుకెళ్తా'!
'దేనికైనా రెఢీ' చిత్రం అందించిన ఉత్సాహంతో వీరు పోట్ల దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి (అందాల రాక్షసి ఫేం)తో మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం 'దూసుకెళ్తా'. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత మోహన్ బాబు. వినోదమే ప్రధాన లక్ష్యంగా రూపొందిన 'దూసుకెళ్తా' అక్టోబర్ 17 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, క్లాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'దూసుకెళ్తా' చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో సంతృప్తి పరిచిందో తెలుసుకుందాం! చిన్నతనం నుంచే బెట్టింగ్ కాయడంలో చిన్నా ఉరఫ్ వెంకటేశ్వరరావు ముందుంటాడు. ఎవరూ ఎలాంటి సహాయం చేసినా మర్చిపోకుండా మేలు చేసే చిన్నా.. జర్నలిస్టు ఉద్యోగం కోసం ఓ టెలివిజన్ ఛానెల్ ను సంప్రదిస్తాడు. కేంద్ర మంత్రి ఢిల్లేశ్వర్ చేసే అవినీతి కార్యక్రమంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించమని టెలివిజన్ చానెల్ ఓ పని అప్పగిస్తుంది. కేంద్ర మంత్రి అవినీతి భాగోతాన్ని చిన్నా దిగ్విజయం పూర్తి చేస్తాడు. అయితే కేంద్ర మంత్రి అనుచరులు జరిపిన దాడిలో చిన్నా తీవ్రంగా గాయపడుతాడు. గాయపడిన చిన్నాను అలేఖ్య అనే డాక్టర్ కాపాడి.. ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా దగ్గరుండి అపాయం నుంచి గట్టెక్కిస్తుంది. తనకు సహాయం చేసిన అలేఖ్యను కొందరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకున్న చిన్నా.. సహాయం చేసేందుకు వెన్నంటి ఉంటాడు. ఇదిలా ఉండగా తనను కాపాడుతున్న చిన్నా.. చిన్ననాటి స్నేహితుడే అని అలేఖ్య తెలుసుకుంటుంది. తన తండ్రి నుంచి తాను, తన తల్లి దూరం కావడానికి, తమ కష్టాలకు కారణమని చిన్నపై అలేఖ్య ద్వేషాన్ని పెంచుకుంటుంది. అయితే ఓ ప్రమాదం నుంచి అలేఖ్యను కాపాడిన చిన్నాకూడా ఆమె తన చిన్ననాటి స్నేహితురాలేనని తెలుసుకుంటాడు. అంతేకాకుండా తన వల్ల కుటుంబానికి, తండ్రికి దూరమైన అలేఖ్యను అదే కుటుంబంలో సముచిత గౌరవాన్ని అందించడానికి నిర్ణయించుకుంటాడు. అలేఖ్యను చంపాలని ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కుటుంబం నుంచి అలేఖ్య దూరం కావడానికి కారణాలేమిటి? తన కుటుంబంలో అలేఖ్యకు సముచిత స్థానం కల్పించడంలో చిన్నా సఫలమయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'దూసుకెళ్తా' చిత్రం. చిన్నా పాత్రలో మంచు విష్ణు తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. వినోదం పండించడంలోనూ, ఫైట్స్, డాన్సులను విష్ణు తన మార్కును చూపించాడు. కీలక సన్నివేశాల్లో విష్ణు అన్ని రకాల ఆడియెన్స్ మెప్పించడం ఖాయం. అయితే కథలో వైవిధ్యం లేకపోవడంతో చిన్నా పాత్ర రొటిన్ గా అనిపించవచ్చు. అయితే స్టార్ గా మంచు విష్ణులో కొంత పరిణతి సాధించాడు అని చెప్పవచ్చు. అలేఖ్య పాత్ర నటించిన లావణ్య త్రిపాఠి తనకు మించిన పాత్రనే పోషించదని చెప్పవచ్చు. అయితే అలేఖ్య పాత్ర ద్వారా భావోద్వేగాలను పండించడంలో తడబాటుకు గురైంది. కథ మొత్తం అలేఖ్య పాత్ర చుట్టు తిరగడంతో ఆ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మంచు విష్ణు ముందు లావణ్య ఉత్తమ నటనను ప్రదర్శించడంలో తేలిపోయింది. పెద్దగా అనుభవం లేని లావణ్య అలేఖ్య పాత్రకు సరిపోలేదనే భావన కలగడం సహజం. ఇక వినోదంలో వీరబ్రహ్మం పాత్ర ద్వారా బ్రహ్మనందం, పిచ్చేశ్వరరావుగా వెన్నెల కిషోర్ కీలకమైన బాధ్యతను నిర్వహించారు. చిత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకులకు వినోదం పండించడంలో మంచు విష్ణు, భరత్ లు కామెడీని పండించారు. ఢిల్లేశ్వర్ గా ప్రకాశ్ త్రిపాఠి, కోటా శ్రీనివాసరావు, అహుతి ప్రసాద్, రావు రమేష్, నాగినీడు, పోసాని కృష్ణ మురళి, హేమ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనించారు.మణిశర్మ రీరికార్డింగ్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిధిగా ప్రత్యేక పాత్రలో మంచు లక్ష్మి మెరిసింది. కథలో కొత్తదనం లేకపోగా, దర్శకుడి కథనం కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా లేకపోయింది.దర్శకుడు వీరు పోట్ల పూర్తి స్తాయిలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించలేకపోయారనే చెప్పవచ్చు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రం క్లాస్, మాస్ ఆడియెన్స్ కు చేరువైతే విష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టే. -
దూసుకొస్తున్నాడు...
మంచు విష్ణుకు బాగా కలిసొచ్చిన రసం హాస్యం. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో హాస్యాస్త్రాలను సంధించి ప్రేక్షకుల మార్కులు కొట్టేశారు విష్ణు. అలాగే... వీరు పోట్ల కూడా కామెడీ పల్స్ తెలిసిన రచయిత, దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే... ఇక నవ్వులకు కొదవ ఉండదని ప్రత్యేకించి చెప్పాలా? వీరి కలయికలో రూపొందిన ‘దూసుకెళ్తా’ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ రోజే ‘దూసుకెళ్తా’ తొలికాపీ చూశాను. విష్ణు అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అతని నృత్యాలు, పోరాటాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీరు పోట్ల టేకింగ్, రవితేజ వాయిస్ ఓవర్, మంచు లక్ష్మి గెస్ట్ ఎప్పీయరెన్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ‘అందాలరాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: అరియానా, వివియానా. -
ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి
షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన. ఇంతకీ కె.రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తోంది ఏ సినిమాకు అనుకుంటున్నారా? మంచు విష్ణు కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మిగిలివున్న పాటను మంచు ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తున్నారు. ‘మాస్’ అనే పదానికి పర్యాయపదమైన దర్శకేంద్రుడు... ఈ పాటను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరో విషయం ఏంటంటే... ఈ ప్రత్యేకగీతంలో నర్తించే అవకాశాన్ని మంచు లక్ష్మి కొట్టేశారు. తమ్ముడి ఇంట్రడక్షన్ సాంగ్‌లో అక్క అడుగు కదపనున్నారన్నమాట. పాటలను తెరకెక్కించడంలో కె.రాఘవేంద్రరావు స్పెషలిస్ట్. అందుకే ఆయన తీసే పాటలో నర్తించడానికి కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ విధంగా మంచు లక్ష్మికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అనే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. శనివారం పాటలను, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తామని విష్ణు చెప్పారు. -
పవర్‌ఫుల్‌గా దూసుకెళ్తా
మంచు విష్ణు గమ్యం వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తాజాగా చేసిన ‘దూసుకెళ్తా’ చిత్రం సర్వహంగులతో సిద్ధమవుతోంది. ఈ నెల 28న టైమ్స్ మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేయబోతున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిందాస్’, ‘రగడ’ ఫేమ్ వీరు పోట్ల ఈ సినిమాకు దర్శకుడు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ తరహాలోనే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు చెబుతున్నారు. ఇందులో విష్ణు పాత్ర చిత్రణ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విష్ణు కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మోహన్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆర్.విజయకుమార్. -
సరికొత్తగా 'దూసుకెళ్తా'
‘దేనికైనా రెడీ’ విజయం తర్వాత మంచు విష్ణు తన కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన శారీరక భాషకు నప్పే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్లు చేయాలని విష్ణు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ‘దూసుకెళ్తా’ సినిమా చేస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల ‘దూసుకెళ్తా’లో విష్ణుని సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. ఆరియానా-వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. టైమ్స్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున పాటలు విడుదల కానున్నాయి. మణిశర్మ స్వరాలందించారు. అక్టోబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. -
దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే!
‘‘మా సినిమా చాలా బాగా వస్తోంది. ఆ సంకేతాలు లొకేషన్లో కనిపిస్తున్నాయి. ఒక విజయవంతమైన సినిమాని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు విష్ణు. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న చిత్రం ‘దూసుకెళ్తా’. విష్ణు, లావణ్య జంటగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యాచ్‌వర్క్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథను వీరు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. కథ, పాటలు, ఫైట్లు, సన్నివేశాలు.. అన్నీ హైలైట్‌గా ఉంటాయి. ఈ నెలాఖరున టీజర్‌ను, వచ్చే నెల పాటలను, అక్టోబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో విష్ణు కొత్త లుక్‌లో కనిపిస్తారు. విష్ణు, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జంట బాగుందని అందరూ అంటున్నారు. అలాగే టైటిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. బ్రహ్మానందం, ఆహుతిప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ. -
‘దూసుకెళ్తా’ అంటూవస్తున్న మంచు విష్ణు
‘దేనికైనా రెడీ’ అంటూ... దమ్మున్న విజయాన్ని అందుకున్నారు మంచు విష్ణు. ఇప్పుడు ‘దూసుకెళ్తా’ అంటూ మరోమారు తన సత్తా నిరూపించుకోబోతున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. వీరు పోట్ల దర్శకుడు. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘దేనికైనా రెడీ’ తర్వాత మళ్లీ ప్రేక్షకుల్ని మెప్పించే సినిమానే చేయాలనుకుంటున్నప్పుడు వీరు పోట్ల ఈ కథ వినిపించాడు. వండర్ అనిపించింది. టైటిల్లో పవర్ ఉన్నట్లే, కథలో కూడా పవర్ ఉంది. ‘దూసుకెళ్తా’ అనే టైటిల్ వినగానే చాలామంది అభినందించారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘విష్ణుకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘దూసుకెళ్తా’. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ స్పాట్లో అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే’’ అని దర్శకుడు చెప్పారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతిప్రసాద్, పోసాని కృష్ణముర ళి, రావురమేష్, పంకజ్ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.