మాస్, క్లాస్ ప్రేక్షకులే లక్ష్యంగా 'దూసుకెళ్తా'!
మాస్, క్లాస్ ప్రేక్షకులే లక్ష్యంగా 'దూసుకెళ్తా'!
Published Thu, Oct 17 2013 4:10 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
'దేనికైనా రెఢీ' చిత్రం అందించిన ఉత్సాహంతో వీరు పోట్ల దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి (అందాల రాక్షసి ఫేం)తో మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం 'దూసుకెళ్తా'. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత మోహన్ బాబు. వినోదమే ప్రధాన లక్ష్యంగా రూపొందిన 'దూసుకెళ్తా' అక్టోబర్ 17 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, క్లాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'దూసుకెళ్తా' చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో సంతృప్తి పరిచిందో తెలుసుకుందాం!
చిన్నతనం నుంచే బెట్టింగ్ కాయడంలో చిన్నా ఉరఫ్ వెంకటేశ్వరరావు ముందుంటాడు. ఎవరూ ఎలాంటి సహాయం చేసినా మర్చిపోకుండా మేలు చేసే చిన్నా.. జర్నలిస్టు ఉద్యోగం కోసం ఓ టెలివిజన్ ఛానెల్ ను సంప్రదిస్తాడు. కేంద్ర మంత్రి ఢిల్లేశ్వర్ చేసే అవినీతి కార్యక్రమంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించమని టెలివిజన్ చానెల్ ఓ పని అప్పగిస్తుంది. కేంద్ర మంత్రి అవినీతి భాగోతాన్ని చిన్నా దిగ్విజయం పూర్తి చేస్తాడు. అయితే కేంద్ర మంత్రి అనుచరులు జరిపిన దాడిలో చిన్నా తీవ్రంగా గాయపడుతాడు. గాయపడిన చిన్నాను అలేఖ్య అనే డాక్టర్ కాపాడి.. ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా దగ్గరుండి అపాయం నుంచి గట్టెక్కిస్తుంది. తనకు సహాయం చేసిన అలేఖ్యను కొందరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకున్న చిన్నా.. సహాయం చేసేందుకు వెన్నంటి ఉంటాడు. ఇదిలా ఉండగా తనను కాపాడుతున్న చిన్నా.. చిన్ననాటి స్నేహితుడే అని అలేఖ్య తెలుసుకుంటుంది. తన తండ్రి నుంచి తాను, తన తల్లి దూరం కావడానికి, తమ కష్టాలకు కారణమని చిన్నపై అలేఖ్య ద్వేషాన్ని పెంచుకుంటుంది. అయితే ఓ ప్రమాదం నుంచి అలేఖ్యను కాపాడిన చిన్నాకూడా ఆమె తన చిన్ననాటి స్నేహితురాలేనని తెలుసుకుంటాడు. అంతేకాకుండా తన వల్ల కుటుంబానికి, తండ్రికి దూరమైన అలేఖ్యను అదే కుటుంబంలో సముచిత గౌరవాన్ని అందించడానికి నిర్ణయించుకుంటాడు. అలేఖ్యను చంపాలని ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కుటుంబం నుంచి అలేఖ్య దూరం కావడానికి కారణాలేమిటి? తన కుటుంబంలో అలేఖ్యకు సముచిత స్థానం కల్పించడంలో చిన్నా సఫలమయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'దూసుకెళ్తా' చిత్రం.
చిన్నా పాత్రలో మంచు విష్ణు తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. వినోదం పండించడంలోనూ, ఫైట్స్, డాన్సులను విష్ణు తన మార్కును చూపించాడు. కీలక సన్నివేశాల్లో విష్ణు అన్ని రకాల ఆడియెన్స్ మెప్పించడం ఖాయం. అయితే కథలో వైవిధ్యం లేకపోవడంతో చిన్నా పాత్ర రొటిన్ గా అనిపించవచ్చు. అయితే స్టార్ గా మంచు విష్ణులో కొంత పరిణతి సాధించాడు అని చెప్పవచ్చు.
అలేఖ్య పాత్ర నటించిన లావణ్య త్రిపాఠి తనకు మించిన పాత్రనే పోషించదని చెప్పవచ్చు. అయితే అలేఖ్య పాత్ర ద్వారా భావోద్వేగాలను పండించడంలో తడబాటుకు గురైంది. కథ మొత్తం అలేఖ్య పాత్ర చుట్టు తిరగడంతో ఆ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మంచు విష్ణు ముందు లావణ్య ఉత్తమ నటనను ప్రదర్శించడంలో తేలిపోయింది. పెద్దగా అనుభవం లేని లావణ్య అలేఖ్య పాత్రకు సరిపోలేదనే భావన కలగడం సహజం.
ఇక వినోదంలో వీరబ్రహ్మం పాత్ర ద్వారా బ్రహ్మనందం, పిచ్చేశ్వరరావుగా వెన్నెల కిషోర్ కీలకమైన బాధ్యతను నిర్వహించారు. చిత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకులకు వినోదం పండించడంలో మంచు విష్ణు, భరత్ లు కామెడీని పండించారు. ఢిల్లేశ్వర్ గా ప్రకాశ్ త్రిపాఠి, కోటా శ్రీనివాసరావు, అహుతి ప్రసాద్, రావు రమేష్, నాగినీడు, పోసాని కృష్ణ మురళి, హేమ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనించారు.మణిశర్మ రీరికార్డింగ్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిధిగా ప్రత్యేక పాత్రలో మంచు లక్ష్మి మెరిసింది.
కథలో కొత్తదనం లేకపోగా, దర్శకుడి కథనం కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా లేకపోయింది.దర్శకుడు వీరు పోట్ల పూర్తి స్తాయిలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించలేకపోయారనే చెప్పవచ్చు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రం క్లాస్, మాస్ ఆడియెన్స్ కు చేరువైతే విష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టే.
Advertisement
Advertisement