మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.
పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్‌పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు.
నా చిన్న కుమారుడైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.
మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?
తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment