యష్ రంగినేని, ‘మధుర’ శ్రీధర్
‘‘మనకు థియేటర్స్ ఎక్కువైపోయాయి.. ఫీడింగ్ తక్కువైంది. చిన్న సినిమాలకు మంచి రోజులొచ్చాయి. ఎగ్జిబిటర్స్ అందరూ చిన్న సినిమాలవైపే చూస్తున్నారు. పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దొరసాని’. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొయెటిక్, మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాం.
1980లో తెలంగాణ ఎలా ఉంది? గడి సంస్కృతి ఏంటి? అనే విషయాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో అచ్చం తెలంగాణ వాతావరణం కనిపించిందంటున్నారు. పాత కాలాన్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. పౌడర్ డబ్బా కోసమే 4–5 నెలలు తిరిగాం. 14లక్షలు పెట్టి గడిని బాగుచేయించి షూట్ చేశాం. మరో 5 లక్షలు ఆ ఊరి అభివృద్ధి కోసం అందించాం. ఈ చిత్రంతో 60మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. ఓపెనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ మ్యాట్నీ నుంచి కలెక్షన్లు పెరిగాయి. ఇంతకుముందు వచ్చిన తెలుగు గొప్ప ప్రేమకథలు తీసుకుంటే తెలుగు దర్శకులు తీసినవి తక్కువ.
ఆనంద్, శివాత్మిక కావాలనుకుంటే మంచి గ్లామర్ ఉన్న సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంలోనే ఆర్టిస్ట్‌గా వాళ్ల నిబద్ధత, నిజాయతీ తెలుస్తోంది. కమర్షియల్ అంశాలు జోడించి ఈ స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు. ప్రేక్షకుల్లో టాక్ బాగుంది. పాజిటివ్ టాక్‌ని మించిన ప్రమోషన్ ఏంటి? సోషల్ మీడియాలో కవిత్వాలు రాస్తున్నారు. నాలుగు వారాలుగా మంచి సినిమాలు రావడం శుభ పరిణామం. కొత్త సినిమా ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ఆనంద్ దేవరకొండతో మరో సినిమా, మహేంద్రతో ఓ సినిమా చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment