'దృశ్యకావ్యం' రివ్యూ..
జానర్ : హారర్
నటీనటులు : కార్తీక్, కశ్మీరా కులకర్ణి, పృథ్వీ తదితరులు
నిర్మాత, దర్శకత్వం : బెల్లం రామకృష్ణా రెడ్డి
సంగీతం : కమలాకర్
ఈ మధ్యకాలంలో దర్శకులు కళ్లు మూసుకుని నమ్ముకుంటున్న సబ్జెక్ట్ 'సస్పెన్స్'. భయానికి మరికొన్ని భావోద్వేగాలను మిళితం చేసి సినిమాలను ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. అలాంటి హారర్ ఎలిమెంట్స్ తో ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన చిన్న సినిమానే 'దృశ్యకావ్యం'. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో.. తల నొప్పించిందో.. ఓ సారి చూద్దాం.
హనీ అనే పాప తన తండ్రి డైరీ చదువుతుండగా సినిమా మొదలవుతుంది. హీరో అఖిల్(రామ్ కార్తీక్), హీరోయిన్ అభి(కశ్మీరా కులకర్ణి)లు బి.టెక్ చదువుతుండగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. వీరికి హనీ అనే ఓ పాప. భార్య, పాపే అఖిల్ ప్రపంచం. పాపకు తండ్రి తోడిదే లోకం. ఇంతలో అఖిల్కు ఆఫీసులో యూరప్ ట్రిప్ వెళ్లే అవకాశం వస్తుంది. పాప వద్దంటున్నా వినకుండా అఖిల్ యూరప్ కు బయలుదేరుతాడు. ఇక్కడి వరకు సంతోషంగా, సాఫీగా జరిగిన వారి జీవితంలో మొదలయ్యే అనూహ్య పరిణామాలే మిగిలిన కథాంశం.
యూరప్కు బయలుదేరిన అఖిల్ ఎయిర్ పోర్టుకు చేరుకోకుండానే రోడ్డుప్రమాదానికి గురై మరణిస్తాడు. ఇదే విషయాన్ని అతని భార్యకు చెప్పడానికి అఖిల్ ఇంటికి చేరుకున్న అతని ఫ్రెండ్(మధునందన్).. ఫోనులో భర్తతో మాట్లాడుతున్న అభిని చూసి అవాక్కవుతాడు. మార్చురీ దగ్గర స్నేహితుడి మృతదేహాన్ని చూసి వచ్చిన అతడికి అఖిల్ ఇంటి పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఇక ఆ తర్వాత చనిపోయిన తండ్రికి, పాపకు మధ్య చోటుచేసుకునే కొన్ని సంఘటనలతో కథను ముందుకి నడిపించారు.
దర్శకుడు మంచి సస్పెన్స్ పాయింట్నే తీసుకున్నాడు గానీ ఆ ఒక్క పాయింట్ తోనే కథను నడిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ పాటలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో కథ మలుపు తీసుకున్నా పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు. ఇంతా చేసి ఏం జరుగుతుందో స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు, ఏం జరిగిందో తెలియాలంటే సినిమా రెండవ భాగం చూడండంటూ అకస్మాత్తుగా కథకు తెర దించాడు దర్శకుడు.
హీరో కొత్తవాడే అయినా పరిధి మేరకు బాగానే నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించిందిగానీ మాటి మాటికీ నవ్వి కాస్త చిరాకు తెప్పించింది. మధ్యలో మన సహనానికి పరీక్ష పెట్టే కమెడియన్ల కష్టాలు. అన్నీ వెరసి అటు భయంగానీ, ఇటు థ్రిల్ గానీ, సస్పెన్స్ గానీ.. ఏదీ కలిగించలేకపోయింది ఈ సినిమా. అసలు సినిమాకి 'దృశ్యకావ్యం' అనే పేరు ఎందుకు పెట్టారో అనే ఆలోచన సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలగక మానదు.
బలాలు
సంగీతం
పాటలు
కెమెరా
బలహీనతలు
కథనం
క్లైమాక్స్
హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం