సినిమారివ్యూ: 'దృశ్యం' | Drushyam Cinema Review: it is a new genre film to the Tollywood audience | Sakshi
Sakshi News home page

సినిమారివ్యూ: 'దృశ్యం'

Published Fri, Jul 11 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

సినిమారివ్యూ: 'దృశ్యం'

సినిమారివ్యూ: 'దృశ్యం'

 
నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్
దర్శకత్వం: శ్రీ ప్రియ
 
 
పాజిటివ్ పాయింట్స్: 
  • ఆకట్టుకునే కథ, 
  • భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 
నెగిటివ్ పాయింట్స్:
  • స్క్రీన్ ప్లే,
  • ఎడిటింగ్, 
  • సినిమాటోగ్రఫి
 
ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడంలో 'విక్టరీ' వెంకటేశ్ ది ఓ ఢిఫరెంట్ స్టైల్. రీమేక్ చిత్రాల్లో నటించి భారీ హిట్లను తన ఖాతాలో వెంకటేశ్ వేసుకున్న సంగతి తెలిసిందే. కాని ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు వెంకటేశ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే రీమేక్ చిత్రాలు నిరాశ పరిచినా.. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. అదే పేరుతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్, మీనాలు జంటగా నిర్మాత డి సురేశ్, రాజ్ కుమార్ సేతుపతిలు రూపొందించిన 'దృశ్యం' చిత్రం జూలై 11వ తేదిన విడుదలకు సిద్దమైంది. సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపులతో వచ్చిన 'దృశ్యం' ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. 
 
కథ: 
పోలీస్ అధికారులైన నదియా, నరేశ్ లకు వరుణ్ (రోషన్) అనే కుమారుడు ఉంటాడు. వరుణ్ కనిపించకుండా పోయాడనే విషయం నదియా, నరేశ్ లకు తెలుస్తుంది. దాంతో వరుణ్ ఆచూకీ కోసం వేట మొదలెడుతారు పోలీసులు. అయితే ఈ విచారణలో రాజావరం అనే కుగ్రామంలో ఓ కేబులు ఆపరేటర్ రాంబాబు (వెంకటేశ్) కుటుంబాన్ని అనుమానిస్తారు. వరుణ్ ఆచూకీ తెలుసుకునేందుకు రాంబాబు కుటుంబాన్ని విచారిస్తారు. అయితే రాంబాబు కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి కారణమేంటి? రాంబాబు కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? వరుణ్ కనిపించకుండా పోవడానికి రాంబాబు కుటుంబానికి సంబంధమేమిటి.  సంతోషంగా భార్య, ఇద్దరు కూతుర్లతో జీవితాన్ని వెళ్లదీస్తున్న రాంబాబు కుటుంబానికే ఈ సమస్య ఎందుకు ఎదురైంది. పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి రాంబాబు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు రాంబాబు కుటుంబం సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? పోలీస్ ఆఫీసర్లకు తమ కుమారుడి ఆచూకీ దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'దృశ్యం'.
 
నటీనటుల ఫెర్ఫార్మెన్స్:
రాంబాబుగా వెంకటేశ్ మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గా, ఓ కుటుంబ పెద్దగా వెంకటేశ్ చక్కటి ఎమోషన్స్ పలికించారు. సమస్యల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు పాత్ర ద్వారా వెంకటేశ్ సగటు ప్రేక్షకుడ్ని మరోసారి మైమరిపించారు. ఇమేజ్ కు భిన్నంగా పాత్రలను ఎంచుకోవడంలో వైవిధ్యం చూపే వెంకటేశ్ మరోమారు రాంబాబు పాత్ర ద్వారా తన సత్తాను చాటారు. గత కొద్దికాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తూన్న వెంకటేశ్... 'దృశ్యం' ద్వారా మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. 
 
చాలాకాలం తర్వాత మీనా మరోసారి తనదైన నటనను ప్రదర్శించారు. 'దృశ్యం' ద్వారా మీనా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించినట్టే. కాకపోతే అర్జంటుగా కొంచెం లావు తగ్గాల్సిందే. మంచి ఫెర్ఫార్మెన్స్ తో గతంలో ఆకట్టుకున్న మీనా.. మరోసారి 'దృశ్యం' ద్వారా చేరువయ్యారనే చెప్పవచ్చు. వెంకటేశ్ కూతుళ్లుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ లు మంచి మార్కులే సొంతం చేసుకున్నారు. 
 
చిన్న పాత్రైనా నరేశ్ ప్రాధాన్యత ఉన్న పాత్రతో అదరగొట్టేశారు. క్లైమాక్స్ లో నరేశ్ నటన బాగుంది. నదియా పాత్ర ఓకే అనిపించినా.. మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. నదియా క్యాస్టూమ్స్, మేకప్ విషయంలో కొత్త అశ్రద్ద చేశారా అనే ఫీలింగ్ కలిగింది. 
 
ముఖ్యంగా ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నెగిటివ్ షేడ్స్ తో రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే నటన సూపర్ అని చెప్పవచ్చు. 
 
వెంకటేశ్ అసిస్టెంట్ గా సప్తగిరి తన హాస్యంతో పర్వాలేదనింపించారు. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్ లు తమ పాత్రల స్వభావం, పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. 
 
సాంకేతిక నిపుణుల పనితీరు:
కథ డిమాండ్ మేరకు శరత్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా సెంటిమెంట్, భావోద్వేగాలకు గురిచేసేందుకు అవసరమైన టెంపోను బ్యాక్ గ్రౌండ్ స్కోరును మెయింటెన్ చేయడంలో శరత్ సఫలమయ్యారు. ఇక డార్లింగ్ స్వామి అందించిన డైలాగ్స్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. సున్నితంగా, సహజంగా ఉండే డైలాగ్స్ అందించిన డార్లింగ్ స్వామి.. సెంటిమెంట్ సీన్లలో డైలాగ్స్ తో తన మార్క్ ను ప్రదర్శించారు. 
 
ఇక సగటు ప్రేక్షకుడిలో ఓ ఫీల్ నింపే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని రూపొందించడంలో అలనాటి నటి శ్రీప్రియ సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది.  ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు.  ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే  'దృశ్యం' ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం. 
 
ట్యాగ్: 'దృశ్యం' ప్రేక్షకుల్లో ఓ చక్కటి అనుభూతిని నింపే ఓ సదృశ్యం!
-- రాజబాబు అనుముల
Note: Preview Show at Cinemax on Wednesday

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement