ఇకపై... నా ప్రతి సినిమా సిక్సరే!
‘‘రానున్న ‘ఊపిరి’ సినిమా నా కెరీర్‌లో కొత్త అధ్యాయం. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నాకు కిరీటం పెడితే, ఈ సినిమా ఆ కిరీటానికి అందం పెంచే నెమలి పింఛం లాంటిది. ఒక్క మాటలో ఇది నా కెరీర్‌లో మైలురాయి కాదు... ఏకంగా జీవితాన్నే మార్చే సినిమా. ఇక నుంచి యువరాజ్ సింగ్‌లా చేసే ప్రతి సినిమాతో సిక్సర్ కొడతా’’ అన్నారు హీరో నాగార్జున. ఆయనతో పాటు కార్తీ, తమన్నాలతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘ఊపిరి’(తమిళంలో ‘తోళా’) ఈ 25న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముచ్చటించింది.
నాగ్ మాట్లాడుతూ, ‘‘ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’కి ఇది అధి కారిక రీమేక్. హక్కులు కొని మరీ నిర్మాత పి.వి.పి. ఈ సినిమా తీశారు. ఇది ఇద్దరు మనుషుల యథార్థ కథ. ఇప్పటికీ వారు బతికే ఉన్నారు’’ అని చెప్పారు. ‘‘మారుతున్న పరిస్థితుల్లో రొటీన్‌కు భిన్నంగా తెలుగు ప్రేక్షకులు ఎలాంటి చిత్రం కోరుకుంటారో వంశీ అదే విధంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. నేను తమిళ డైలాగులు సరిగ్గా చెప్పలేకపోయేవాడిని. కార్తీకి తెలుగు రాకపోయినా, నేర్చుకుని మరీ పేజీన్నర డైలాగులు చెప్పేవాడు. ఆ విషయంలో కార్తీని చూస్తే నాకు సిగ్గుగా అనిపించేది’’ అని అన్నారు. మరో హీరో కార్తి మాట్లాడుతూ, ‘‘ఫస్ట్‌టైవ్‌ు తెలుగులో స్ట్రెయిట్ చిత్రంలో నటించా. ఇది ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. నాగార్జునగారు మెచ్యూర్డ్ క్యారెక్టర్‌లో నటించారు.
ఈ చిత్రం జర్నీలో ఆయనతో మంచి రిలేషన్‌షిప్ ఏర్పడింది. చెన్నైలో మా ఇంటి పక్కనే నటుడు నూతన్‌ప్రసాద్ గారిల్లు. అందుకని ఆ మాటలు, పాటలు విని తెలుగు బాగానే ఒంటబట్టింది’’ అని అన్నారు. ‘‘ఆదివారం నాడు ఈ సినిమా ఫస్ట్‌కాపీని చూసిన వెంటనే నాగార్జునగారు, పీవీపీ గారు నన్ను హగ్ చేసుకున్నారు. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఊపిరి ఈ చిత్రం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘రెండేళ్లుగా అందరం కలిసి, ఇష్టపడి చేసిన చిత్రమిది. క్వాలిటీ సినిమాలు తెలుగులోనూ వస్తాయని దీంతో మరోసారి నిరూపిస్తున్నాం. అమెరికాలో 90 హాళ్లలో రిలీజవుతోంది. తమన్నా తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు’’ అని తెలిపారు. ‘‘నాగార్జున సార్, కార్తీ తమ పాత్రల్లో నటించలేదు, జీవించారు. వారిద్దరూ లేని ‘ఊపిరి’ అస్సలు ఊహించలేం. ‘హ్యాపీడేస్’, ‘బాహుబలి’, ఇప్పుడీ ‘ఊపిరి’- ఇలా నేను గర్వించేవన్నీ తెలుగు ఫిల్మ్సే. ‘ఊపిరి’ చూసి అంతా గర్విస్తారు’’ అని తమన్నా అన్నారు.