అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్’ పాటకు డాన్స్ చేసేదాన్ని... | Ek Do Teen Madhuri Dixit inspired The Dirty Picture Vidya Balan | Sakshi
Sakshi News home page

అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్’ పాటకు డాన్స్ చేసేదాన్ని...

Published Mon, May 26 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్’ పాటకు డాన్స్ చేసేదాన్ని...

అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్’ పాటకు డాన్స్ చేసేదాన్ని...

 ‘‘తను అమ్మాయా, అమ్మమ్మా! ఆ ఆరు గజాల చీరలేంటి? నుదుట అంత పెద్ద బొట్టేంటి’’ అంటూ హిందీ రంగంలో విద్యాబాలన్‌ని విమర్శించినవారి శాతం ఎక్కువే ఉంది. కెరీర్ ఆరంభించిన కొత్తలో ఈ మలయాళ బ్యూటీని బాలీవుడ్‌లో కొంతమంది చిన్నచూపు చూశారు. కానీ, తన కట్టూబొట్టూ మార్చలేదు విద్యా. కట్ చేస్తే.. ‘చీరల్లో విద్యా సూపర్’ అని అభినందించడం మొదలుపెట్టారు. నిండైన చీరకట్టులోనే కాదు..  ‘డర్టీ పిక్చర్’లో వీలైనంత గ్లామరస్‌గా కనిపించి, అందర్నీ స్వీట్ షాక్‌కి గురి చేశారు విద్యా. అందానికి, అభినయానికి చిరునామా అనే పేరు సంపాదించుకున్న విద్యాకి సినిమా రంగం పట్ల ఎప్పుడు ఆసక్తి కలిగింది? తన వైవాహిక జీవితం ఎలా ఉంది? తదితర విశేషాలు...
 
 నేను కథానాయిక కావాలనుకోవడానికి ప్రధాన కారణం మాధురీ దీక్షిత్. ఆమె నటించిన ‘తేజాబ్’ చూసి, మాధురీలా నేను కూడా హీరోయిన్ అయ్యి, మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశా. అప్పట్నుంచీ వీలైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించేదాన్ని. ‘తేజాబ్’లో ‘ఏక్ దో తీన్ చార్..’కి మాధురీ చేసినట్లుగా బ్రహ్మాండంగా డాన్స్ చేసేదాన్ని. అప్పట్లో మా అక్క ప్రియాబాలన్‌కి ఓ సిల్క్ స్కర్ట్ ఉండేది. మాధురీ కట్టుకున్నట్లుగా నేనా స్కర్ట్‌ని తలకు చుట్టుకుని, గది లోపలికెళ్లి గడియ పెట్టుకుని, అద్దం ముందు నిలబడి ‘ఏక్ దో తీన్..’ పాటకు డాన్స్ చేసేదాన్ని.
 
 పెద్దయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావని ఎవరైనా అడిగితే.. ‘హీరోయిన్ అవుతా’ అని చెప్పేదాన్ని. మా అమ్మా, నాన్న కూడా నా ఇష్టాన్ని కాదనలేదు. దాంతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి సన్నాహాలు మొదలుపెట్టాను. ఓసారి మా అక్క ‘హీరోయిన్ కావాలంటే అందంగా ఉంటే సరిపోదు.. బాగా యాక్ట్ చేయాలి’ అని చెప్పింది. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని బలంగా నిర్ణయించుకున్నా. అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలనుకున్న తర్వాత నేను, అక్క ఓ లోకల్ ఫొటోస్టూడియోకెళ్లి, ఫొటో తీయించాలనుకున్నాం. అప్పుడు అక్కే నాకు మంచి డ్రెస్ కొనిపెట్టింది. తనే మేకప్ చేసింది. కేశాలంకరణ కూడా తనే. సరే.. ఎట్టకేలకు ఫొటోలు దిగాను.
 
  నా బయోడేటా అక్కే రాసింది. ఆ ఫొటోలు, బయోడేటాని ఏక్తా కపూర్ ఆఫీస్‌కి పంపిస్తే, ఆడిషన్స్‌కి రమ్మన్నారు. నాతో పాటు 899 మంది ఆ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఫైనల్‌గా 30 మందిని ఎంపిక చేశారు. చివరికి నాకు అవకాశం వచ్చింది. అదే ‘హమ్ పాంచ్’ సీరియల్. మొదటి ఎపిసోడ్ చూడ్డానికి ఇంటిల్లిపాదీ టీవీ ముందు సెటిలైన వైనం నాకింకా గుర్తుంది. ఆ క్షణంలో నా గురించి నేను ఏమనుకున్నానో తెలుసా.. ‘ఈ ప్రపంచంలో మనకన్నా గొప్ప నటి లేరు’ అని. అప్పట్లో కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా తెలియదు. కానీ, నేను బెస్ట్ అనుకున్నా. అది తల్చుకుని ఇప్పటికీ నవ్వుకుంటుంటాను.
 
  ‘పరిణీత’ చిత్రం నా జీవితానికి కీలక మలుపైన విషయం తెలిసిందే. ‘లగే రహో మున్నాభాయ్’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. దాంతో పాటు నా వస్త్రధారణ గురించి కూడా కొంతమంది హేళనగా మాట్లాడేవారు. నేనేం పట్టించుకోలేదు. నా మనసు ఏది చెబితే దాన్నే ఫాలో అవుతా. ‘ఈ విమర్శలను పట్టించుకుంటే పెకైదగలేవు. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి’ అని నా మనసు చెప్పింది. దాన్నే అనుసరించా. ఇప్పుడు నా స్థాయి గురించి అందరికీ తెలిసిందే. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలంటే ‘విద్యాబాలన్ ఉంది’గా అంటారు. అభినయంతో పాటు గ్లామరస్‌గా కూడా కనిపించాలన్నా ‘విద్యా బ్రహ్మాండంగా చేస్తుంది’గా అంటున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది?
 
  హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్’లాంటివి చూసి, మనం సంబరపడిపోతుంటాం. మన సినిమాలేవైనా సాంకేతికంగా ఉన్నతంగా ఉంటే, హాలీవుడ్ సినిమాలా ఉందంటాం. హాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కల కొంతమందికి ఉంది. కానీ, నాకు మాత్రం మన భారతీయ సినిమాలే ఇష్టం. మనం ప్రతిభావంతులం అనిపించుకోవడానికి ‘అవతార్’లాంటి సినిమాలు తీయాల్సిన అవసరంలేదు. మన భారతీయులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అవి తీస్తే చాలు. నా వృత్తి జీవితం చాలా బాగుంది. వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంది. నా జీవితంలో ఉన్న పసందైన మలుపుల్లో ‘పెళ్లి’ అనే మలుపు చాలా కీలకమైనది. సిద్ధార్ధ్‌రాయ్ కపూర్ నా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది.
 
 అంత మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టం. ఇలా చెబుతుంటే, దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉంది (నవ్వుతూ). ముంబయ్‌లో నా పుట్టింటి నుంచి అత్తింటికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు. కాబట్టి, మా అమ్మానాన్నలను మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఇప్పటికీ మా పుట్టింట్లోనే జిమ్ చేస్తున్నాను. ఇక, మెట్టినిల్లు అయితే నాకు పుట్టినిల్లులానే ఉంది. వంటగదిలో దూరిపోయి గంటలు గంటలు వంట చేసే తీరిక నాకు లేదు. ఖాళీ దొరికినప్పుడు సిద్ధార్ధ్‌కి నచ్చేవి చేసి పెడతా. లేనప్పుడు ఏమేం వండాలో వంటవాళ్లకి చెప్పేస్తా.
 
 ఏ వైవాహిక జీవితం అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే.. భర్త కోసం భార్య మారనప్పుడు... భార్య కోసం భర్త మారనప్పుడు. విచిత్రంగా అనిపిస్తోందా? పెళ్లయిన కొత్తలో ఒకరకమైన మత్తులో ఉంటాం. ఆ మత్తులో మనకు నచ్చకపోయినా జీవిత భాగస్వామికి నచ్చే పనులే చేస్తుంటాం. కొన్నాళ్లకు మనం ఏదో త్యాగం చేసినట్లుగా భావిస్తాం. ఏదైనా చిన్నపాటి గొడవ వచ్చిందనుకోండి ‘నీ కోసం అది త్యాగం చేశా. ఇది త్యాగం చేశా. నా జీవితంలో చాలా కోల్పోయా’ అంటూ అసలు విషయాన్ని కక్కేస్తాం. అక్కణ్ణుంచి భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే, అంటున్నా. పెళ్లికి ముందు మన పద్ధతులు ఎలా ఉన్నాయో.. పెళ్లి తర్వాత కూడా అలానే ఉండాలి. మార్చుకోదగ్గ విషయాల్లో మాత్రమే మారాలి. భార్యాభర్తలకు ఒకరంటే మరొకరికి ప్రేమ మాత్రమే కాదు గౌరవం కూడా ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement